చంద్రబాబుకు తనను సస్పెండ్ చేసేంత సీను లేదని, దమ్ముంటే బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. ఆ రాజ్యసభ సభ్యుల్ని చేర్చుకున్నందుకు మోదీ, అమిత్‌షా ఇంటి వద్ద చంద్రబాబు దీక్ష చేయాలన్నారు. విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్టీకి రాజీనామా చేశాక నన్ను సస్పెండ్ చేయడమేంటి?. వయసు మీద పడడంతో చంద్రబాబు మతి చలించి మాట్లాడుతున్నాడు. కొడుకుని గెలిపించుకోలేకపోయాడు. లోకేష్ ముద్ద పప్పు.. అతన్ని మాపై రుద్దాలని చూస్తున్నారు’ అని మండిపడ్డారు. టీడీపీకి లోకేష్ పెద్ద గుదిబండ, స్పీడ్ బ్రేకర్ అని, అతని వల్ల పార్టీ ముందుకు వెళ్లలేదని వంశీ విమర్శించారు. తాను బయటికెళ్తే టీడీపీకి నష్టం లేదని, లోకేష్ పార్టీలో ఉంటేనే పెద్ద నష్టమని పేర్కొన్నారు.