భోపాల్: మహమ్మారి కరోనా బడుగు, బలహీన వర్గాల ప్రజల్ని బతుకుల్ని మరింత పేదరికంలోకి నెట్టింది. లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది జీవనాధారం కోల్పోయి రోడ్డున పడే దుస్థితి దాపురించింది. ఇలాంటి తరుణంలో సామాన్యుల నుంచి ఎంతో కొంత గుర్తింపు దక్కించుకున్న టీవీ నటులు సహా పలువురు చిరు ఉద్యోగులు కుటుంబాన్ని పోషించుకునేందుకు నిత్యావసరాలు అమ్ముతున్న ఘటనలు చూస్తేనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పద్నాగేళ్ల బాలుడు కూడా ఇలాగే తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేందుకు కోడిగుడ్లు అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బండిని తోసుకుంటూ వెళ్తున్న అతడిని స్థానిక సంస్థల సిబ్బంది అడ్డుకున్న క్రమంలో బండి బోల్తా పడింది. కోడిగుడ్లన్నీ నేలపాలయ్యాయి.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ విషయం గురించి సదరు బాలుడు మాట్లాడుతూ.. తన బండిని రోడ్డు మీద పెట్టుకునేందుకు ప్రభుత్వం సిబ్బంది 100 రూపాయలు లంచం అడిగారని ఆరోపించాడు. డబ్బు ఇవ్వనందుకే కోడిగుడ్లను కింద పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా మధ్యప్రదేశ్‌లో లాక్‌డౌన్ నేపథ్యంలో.. ‘‘లెఫ్ట్- రైట్’’నిబంధనను అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ఒకరోజు రోడ్డుకు కుడి వైపున షాపులు ఓపెన్ చేస్తే.. రెండో రోజు ఎడమ వైపు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నారు. అయితే ఈ రూల్స్‌పై అధికార పక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తుతుండటం గమనార్హం. చిరు వ్యాపారులు ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయారని, వారిని ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.