చెన్నై : ఓ కేసు విషయంపై మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ మధ్య జరిగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులమనే స్పృహలేకుండా ప్రవర్తించిన ఆ పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌కాగా అధికారుల గొడవ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కడలూరు సమీపం బన్రూట్టి నడువీరపట్టు దక్షిణ వీధికి చెందిన ప్రభు తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు పోలీసు స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎస్‌ఐ భార్య శశికళ. ఈమె అత్త అల్లి, ఆడపడుచు సుగంధి. ఆస్తి వ్యవహారం కారణంగా వరకట్నం కోరుతూ తనను హింసిస్తున్నారని, ఇంటి నుంచి వెళ్లగొట్టినట్లు గత తొమ్మిదో తేదీన బన్రూట్టి మహిళా పోలీసు స్టేషన్లో శశికళ తన అత్త, ఆడపడుచుపై ఫిర్యాదు చేసింది. కొద్దిరోజుల క్రితం బన్రూట్టి మహిళా పోలీసు స్టేషన్‌కు వచ్చిన ప్రభు ఇన్‌స్పెక్టర్ వనజ వద్ద వివరాలు అడిగారు. ఇన్‌స్పెక్టర్ స్పందిస్తూ మీ భర్త సబ్ ఇన్‌స్పెక్టర్ అయితే ఏంటి కొమ్ములు మొలిచాయా? అని ప్రశ్నించింది.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మళ్లీ మహిళా పోలీసు స్టేషన్‌కు వచ్చిన ప్రభు తన భార్య ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బెదిరించారు. పోలీసు ఇన్‌స్పెక్టర్ వనజకు, ఎస్‌ఐ ప్రభుకు మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. పరస్పరం దూషించుకున్నారు. ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బన్రూట్టి మహిళా పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వనజ, తిరువణ్ణామలై జిల్లా, సెయ్యారు పోలీసు స్టేషన్ ఎస్‌ఐ ప్రభుపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు పోలీసుశాఖ నిర్ణయించింది.