సాక్షి, చెన్నై: నాలుగు దశాబ్దాలకు పైగా సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం దివికేగారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. దేశంలోని ప్రతి ఇంటికి ఆయన పేరు సుపరిచితం. విదేశాల్లో ఉన్న అభిమానుల కోసం ఆయన ఎన్నో కచేరీలు చేసి అలరించారు. ప్రాంతమేదైనా తన వద్దకు వచ్చే అభిమానులను ప్రేమతో పలకరించడం ఆయన ప్రత్యేకత. అనుకోని అతిథిగా వెళ్లి కొన్నిసార్లు వారిని సంభ్రమాశ్చర్యంలోనూ ముంచెత్తుతారు. రేవతి అనే ట్విటర్ యూజర్ తాజాగా షేర్ చేసిన ఓ వీడియో బాలు స్వచ్ఛమైన మనసుని కళ్లకు కడుతోంది.