సాక్షి, పెద్దపల్లి/రామగుండం: కృషి ఉంటే మనిషి రుషి అవుతాడు. తాను అనుకున్నది సాధించే క్రమంలో అద్భుతాలు సృష్టిస్తాడు. అచ్చం అలాగే రామగుండంలో ఓ యువకుడు అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించాడు. స్వయంగా పవర్ పారా గ్లైడర్ రూపొందించి అందులో విహరించాడు. దాదాపు ఇరవై నిమిషాల పాటు గాల్లో విన్యాసాలు చేసి చూపరులను ఆకట్టుకున్నాడు. వివరాలు.. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రైల్వే కాలనీ కి చెందిన ఆడెపు అర్జున్‌కు పారా గ్లైడర్ రూపొందించాడు. జెన్‌కో క్రీడామైదానంలో ట్రయల్ రన్ నిర్వహించి సక్సెస్ అయ్యాడు. కాగా బీకామ్ చదివిన అర్జున్ చిన్నప్పటి నుంచి పారా గ్లైడింగ్ అంటే ఇష్టం.
ఈ క్రమంలో స్వయంగా తానే పారా గ్లైడర్ రూపొందించాలనే పట్టుదలతో మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం అమెరికా, ఇటలీ నుంచి 15 లక్షల విలువైన ఉపకరణాలు తెప్పించుకుని తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. ట్రయల్ రన్‌లో భాగంగా 20 నిమిషాలు గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేశాడు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. రాజధాని హైదరాబాద్‌లో జరిగే అడ్వెంచర్స్ ఈవెంట్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి గ్లైడర్లను పిలిపించి వివిధ కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వం, తమలాంటి యువతకు కూడా అవకాశం ఇవ్వాలని కోరాడు.