న్యూఢిల్లీ : జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి మరో కీలక వీడియోను విద్యార్థి సంఘం నాయకులు శనివారం విడుదల చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గళం విప్పిన యూనివర్సీటీ విద్యార్థులపై రెండు నెలల క్రితం పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 49 సెకండ్లున్న తాజా వీడియో ప్రకారం.. యూనివర్సీటీలోని పాత రీడింగ్ హాల్‌లో చదువుకుంటున్న విద్యార్థుల్ని పోలీసులు లాఠీలతో చితకబాదారు.
క్యాంపస్ మైదానంలో సీఏఏకు నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులను లాఠీ లార్జీ, టియర్ గ్యాస్‌తో చెదరగొట్టారు. ఈ దాడిలో విద్యార్థి నాయకులురాలు ఆయిషీ ఘోష్ తలకు గాయమైంది. అనంతరం అక్కడి నుంచి లైబ్రరీలోకి ప్రవేశించిన పోలీసులు రీడింగ్ రూమ్‌లో చదువుకుంటున్న విద్యార్థులపై అకారణంగా దాడికి దిగారు. అప్పటికే పోలీసుల చర్య గురించి తెలుసుకున్న విద్యార్థులు బెంచీల మాటున దాక్కున్నప్పటీకీ బయటకు లాగి మరీ లాఠీలతో కొట్టారు. డిసెంబరు 15న ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, విద్యార్థుల భారీ ర్యాలీ నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు చర్యలు మాత్రమే చేపట్టామని, ఎవరిపై దాడులు చేయలేదని పోలీసులు పేర్కొనడం తెలిసిందే.