న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బౌలర్ల అద్భుత ప్రదర్శన, బ్యాట్స్‌మెన్ సమయోచిత ఇన్నింగ్స్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ గెలుపుతో ప్రారంభించింది. బౌలర్లు కుల్దీప్ (4/39), షమీ(3/19), చహల్( 2/43), కేదార్ జాదవ్(1/17)లు చెలరేగి ఆతిథ్య జట్టును157 పరుగులకే ఆలౌట్ చేశారు. ఓపెనర్లు గుప్టిల్(5), మున్రో(8)లను వరుస ఓవర్లలో మహ్మద్ షమీ క్లీన్‌బౌల్డ్ చేయగా.. కుల్దీప్ యాదవ్ ట్రెంట్ బౌల్ట్ వికెట్‌తో కివీస్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.
అయితే టెయిలెండర్ ట్రెంట్ బౌల్ట్‌కు.. కుల్దీప్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో మిస్టర్ కూల్ ధోని... ‘ అతడు గుడ్డిగా వెనక్కి వెళ్తాడు. నువ్వు గూగ్లీ వెయ్’ అంటూ సూచించాడు. ధోని చెప్పినట్లుగానే కుల్దీప్ బంతి సంధించగానే... స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి బౌల్ట్ పెవిలియన్‌కు చేరాడు. కాగా ధోని.. కుల్దీప్‌తో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ధోని చెప్పినట్లుగానే కుల్దీప్ బౌల్ చేశాడు. బౌల్ట్ కూడా ధోని చెప్పినట్లే చేశాడు. శర్మకు క్యాచ్ ఇచ్చాడు. ధోని మెదడు చాచా చౌదరీ కంటే కూడా చురుగ్గా పనిచేస్తుంది’ అంటూ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.