‘హెల్మెట్ ధరించండి- ప్రాణాలను కాపాడుకోండి’ అని ట్రాఫిక్ పోలీసులు నెత్తీనోరూ మొత్తుకున్నా ఎవ్వరూ దాన్ని నిబద్ధతగా పాటించిన పాపాన పోలేదు. బుజ్జగిస్తే వినేలా లేరనుకున్న కేంద్రం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ మొత్తంలో చలాన్లు విధిస్తోంది. దీంతో చలాన్లు కట్టలేక జేబులు ఖాళీ అవుతున్నాయని కొంతమంది చచ్చినట్టు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. కానీ ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు చాలామందే ఉన్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే వ్యక్తి తనతోపాటు పెంపుడు కుక్క రక్షణ బాధ్యత తనమీద వేసుకున్నాడు. అదెలాగంటే.. బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి తన పెంపుడు జంతువైన కుక్కను వెంట తీసుకెళ్లాడు. అయితే దాన్ని వెనకాల కూర్చోపెట్టుకుని, దానికో హెల్మెట్ ధరించి మరీ తీసుకెళ్లాడు. దీంతో రోడ్డు వెంబడి జనమంతా ఆ కుక్కను చూసి ఔరా అని ముక్కున వేలేసుకున్నారు.
ఈ అరుదైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘కుక్క అంటే ఎంత ప్రేమో’ అని కొందరు నెటిజన్లు బైక్ నడిపిస్తున్న వ్యక్తిపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ‘కుక్కను ముందు కూర్చోపెట్టుకోండి, వెనకాల కూర్చోబెడితే.. ఆ శునకం పడిపోతే ఏంటి పరిస్థితి?’ అంటూ మరికొందరు కుక్కపై ప్రేమ, దాని యజమానిపై కోపం ఏకకాలంలో ప్రదర్శించారు. ‘హెల్మెట్ ధరించనివాళ్లు కనీసం ఈ కుక్కను చూసైనా నేర్చుకోండయ్యా’ అంటూ ఓ నెటిజన్ ఒకింత ఘాటుగా, కాస్త వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. గతంలో ఢిల్లీలోనూ ఓ శునకం హెల్మెట్ ధరించి బైక్‌పై ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి లోను చేసిన సంగతి తెలిసిందే.