ముంబై : నగరంలోని అంధేరీ తూర్పులో చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున సీప్జ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ వీధి కుక్కపై చిరుత దాడికి పాల్పడింది. సీప్జ్‌కు ఎదురుగా ఉన్న టెలికామ్ పవర్‌గేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుక్కను కొద్ది దూరం లాక్కెళ్లిన చిరుత దానిపై దాడికి యత్నించింది. చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క తీవ్రంగా ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో రక్తం కూడా చిందింది.. అయినప్పటికీ కుక్క చిరుతతో పోరాడింది. చివరకు చిరుత అక్కడి నుంచి పరిగెత్తుతుండగా.. కుక్క దాని వెంబండించింది. అయితే చిరుత, కుక్క అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియలేదు. కుక్కపై చిరుత దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లోనమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై అక్కడి పరిసరాల్లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ.. తాను తెల్లవారుజామున 3 గంటలకు చిరుత రాకను గుర్తిచినట్టు తెలిపారు. దీంతో భయం వేసి తన క్యాబిన్ డోర్‌ను గట్టిగా లాక్ చేసుకున్నట్టు చెప్పారు. చిరుత సంచారంపై అవాజ్ వాయిస్ ఎన్జీవోకు ఫోన్ చేశానని.. దీంతో వారు అక్కడికి చేరుకుని చిరుత దాడిలో గాయపడిన కుక్కకు ప్రాథమిక చికిత్స అందించారని తెలిపారు.
ఈ ఘటనను అటవీశాఖ అధికారి సంతోష్ కాంక్ ధ్రువీకరించారు. చిరుత సంచారాన్ని గుర్తించి.. దానిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. అంధేరీ తూర్పు ప్రాంతంలో పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం చిరుత దాడిలో గాయపడిన కుక్కకు చికిత్స అందిస్తున్నారు. కాగా, జనావాసాల్లో చిరుత సంచరించడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.