చండీగఢ్ : చావు అంచుల వరకు వెళ్లిన ఓ బాలుడు తిరిగి ప్రాణాలతో బయట పడ్డాడు. రైల్వే పట్టాలపై ఉన్న రెండేళ్ల బాలుడిపై రైలు వెళ్లినప్పటికీ దెబ్బలు తగలకుండా క్షేమంగా బతికాడు. ఈ అద్భుత ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఫరీదాబాద్ సమీపంలోని బల్లాబ్‌గర్ రైల్వే స్టేషన్ ట్రాక్‌పై ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటున్నారు. ఆట మధ్యలో పెద్దవాడు రెండేళ్ల పిల్లవాడైన తమ్ముడిని ట్రాక్ మీదకు నెట్టి వేయడంతో అతడు పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో ట్రాక్‌పై గూడ్స్ రైలు వేగంగా వస్తోంది.
అయితే ట్రాక్‌పై పిల్లవాడిని గమనించిన రైలు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకు వేశాడు. కాగా అప్పటికే బాలుడి మీదగా ఇంజిన్ వెళ్లింది. ఇంతలో ఏం జరిగిందోనని భయంతో డ్రైవర్ అతని సహాయకుడు రైలు దిగి వచ్చి చూడగా అక్కడ జరిగిన సన్నివేశాన్ని చూసి షాక్ గురయ్యారు. ఇంజన్ కింద చిక్కుకున్న పిల్లవాడుఎలాంటి దెబ్బలు తగలకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం అతన్ని డ్రైవర్ బయటకు తీసి తన తల్లికి అప్పగించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు డ్రైవర్ సమయస్పూర్తిని ప్రశంసిస్తున్నారు. అంతేగాక స్థానిక డివిజనల్ రైల్వే మేనేజర్ లోకో పైలట్లకు రివార్డ్ ప్రకటించినట్లు రైల్వే అధికారి తెలిపారు.