భోపాల్: ఓ యువకుడిని పోలీసులు ఎత్తిన లాఠీ దించకుండా కొట్టారు. దెబ్బలకు తాళలేక అతడు స్పృహ కోల్పోయినప్పటికీ వదిలిపెట్టకుండా తమ ప్రతాపాన్ని చూపించారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని చింద్వారాలో చోటు చేసుకుంది. చింద్వారాలో ఓ వ్యక్తిని పోలీసు లాఠీతో చితకబాదాడు. దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతను ఉన్నచోటే నేలపై పడిపోయాడు. అయినప్పటికీ అతడిని వదిలేయలేదు. ఈసారి మరో పోలీసు లాఠీ ఎత్తి గొడ్డును బాదినట్లు బాదాడు. కాలితో తలపై తన్నాడు. అప్పటికే అతడు చలనం లేకుండా పడి ఉన్నాడు. దీంతో అక్కడే ఉన్న మూడో వ్యక్తి పోలీసుల సాయంతో గాయపడిన వ్యక్తిని పోలీసు వ్యానులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన గురించి పోలీసు అధికారి శశాంక్ గార్గ్ మాట్లాడుతూ.. ఇది పాత వీడియోనని స్పష్టం చేశారు. పోలీసులు లాఠీ ఝుళిపిస్తోన్న వ్యక్తి ఇరుగు పొరుగువారిని ఇబ్బందులకు గురి చేసేవాడని తెలిపారు. అయితే అతనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని, ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు పోలీసుల దాడిని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. "యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులను వెంటనే జైల్లో వేయండి" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.