వాషింగ్టన్: శునకాన్ని కాపలా సింహంగానే చూడకుండా రకరకాల పనులు అప్పజెప్పుతున్నారు దానికి. పాల ప్యాకెట్ తీసుకురమ్మనో, పేపర్ పట్టుకురమ్మనో, ఫ్రిజ్‌లో నుంచి మంచినీళ్లు తెమ్మనో లేదా కాసేపు కలిసి ఆడుకోవడమో ఇలా చాలా రకాలుగానే ఉపయోగించుకుంటున్నారు శునకాలను. మనదేశంలో ఇది అరుదేమో కానీ విదేశాల్లో మాత్రం సర్వసాధారణం. ఇక శునకాలకు ఈమేరకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక సంస్థలు కూడా ఉంటాయి. అలా అమెరికాలోని కెంటకీలో ‘డబుల్ హెచ్ కెనైన్’ అనే ట్రైనింగ్ అకాడమీ ఉంది. ఇది కుక్కలకు రకరకాల పనులను నేర్పించే శిక్షణ సంస్థ. ఇందులో రైకర్ అనే శునకం శిక్షణకు వచ్చింది. దానికి పనులు చేయాలన్న ఆరాటమే కానీ ఏ ఒక్కటీ సరిగ్గా చేయలేకపోయింది.()
పైగా ప్రయత్నించే క్రమంలో అది చేస్తున్న పనులు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఫ్రిజ్ డోర్ తెరవమంటే ఏకంగా ఫ్రిజ్‌నే లాక్కు రావడం, విసిరేసిన బంతి పట్టుకురమ్మంటే అది పరిగెత్తే క్రమంలో యజమానిని కింద పడేయడంలాంటివి చేస్తూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. జెర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకానికి శిక్షణ ఇస్తున్న వీడియోను ట్రైనింగ్ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఒకరకంగా కుక్కకు ట్రైనింగ్ ఇవ్వడానికి వారి తల ప్రాణం తోక్కొచ్చిందనుకోండి. కానీ గమ్మత్తైన విషయమేంటంటే మరో వీడియోలో ఈ రైకర్ అలవోకగా అన్ని పనులు చేస్తూ వావ్ అనిపించుకుంది. తన సాయశక్తులా కష్టపడి ఎట్టకేలకు అన్ని విద్యల్లో ఆరితేరిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.