డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టేనాటికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, నిబద్ధతతో చేసిన పాదయాత్ర ఆయనను ఆవిష్కరించిన తీరు, అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా పద్ధతులు, రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసిన పరిస్థితి... ఇవన్నీ తెలుగునాట మరుపునకు రాని ఓ చరిత్ర! ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణాధ్యాయం. ఇతర పాలకులంతా లంకె కుదరటం కష్టమనుకునే అభివృద్ధి–సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగమది! రాష్ట్రమేదైనా.. తదుపరి పాలకులకు వైఎస్సార్ పరిపాలనే ఓ ‘బెంచ్‌మార్క్’ అన్న భావన స్థిరపడింది. అర్ధంతరంగా ఆయన తనువు చాలించినా.. పలువురు పాలకులు మారినా.. ఈనాటికీ ఆయన చేసిన పనులే జనం మనోఫలకంపై చెరగని ముద్రలు.