బాబు పాలన చీకటి యుగం: వైఎస్ విజయమ్మ | Chandrababu Naidu' rule a darkness age: Ys Vijayamma | Sakshi

బాబు పాలన చీకటి యుగం: వైఎస్ విజయమ్మ

Mar 19 2014 1:53 AM | Updated on Jul 29 2019 5:31 PM

తాను సమైక్య చాంపియన్ అని చెప్పుకొనే కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరు నెలల క్రితమే తన పదవికి రాజీనామా చేసి ఉంటే నిజమైన చాంపియన్ అయ్యేవారు.

కళ్యాణదుర్గం, రాయదుర్గం రోడ్ షో, సభల్లో వైఎస్ విజయమ్మ ధ్వజం
 కిరణ్ సమైక్య జీరో : తాను సమైక్య చాంపియన్ అని చెప్పుకొనే కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరు నెలల క్రితమే తన పదవికి రాజీనామా చేసి ఉంటే నిజమైన చాంపియన్ అయ్యేవారు. కానీ విభజనకు పూర్తిగా సహకరించి చివరలో రాజీనామా చేసి సమైక్య జీరో అయ్యారు. చేయాల్సిందంతా చేసి కొత్త పార్టీ పెట్టిన ఆయన్ను చూసి జనం నవ్వుకుంటున్నారు.  
 - విజయమ్మ
  సాక్షి, అనంతపురం: ‘‘చంద్రబాబు హయాంలో ఎనిమిదేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు.. పల్లెల్లో తినడానికి తిండిలేక, పశువులకు నీరు లేక జనం అల్లాడుతుంటే అప్పట్లో ఆయన చోద్యం చూశారు.. పంటలు పండక కరెంటు బిల్లులు కట్టలేకపోయిన రైతన్నలను కనికరం లేకుండా జైల్లో పెట్టించారు.. తప్పతాగి ఇళ్లలో తన్నుకు చావండంటూ వీధి విధినా బెల్టుషాపులు పెట్టించారు.. ప్రభుత్వ ఉద్యోగాలిస్తే నష్టమని చెప్పి కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు.. తమ సమస్యల సాధన కోసం అంగన్‌వాడీ వర్కర్లు ఆందోళన చేస్తుంటే గుర్రాలతో తొక్కించిన ఘనుడు చంద్రబాబు.
 
 ఆయన పాలన చీకటి యుగం. ఇపుడు రంగు మార్చుకుని ఆచరణ సాధ్యం కాని హామీలతో మళ్లీ మోసం చేయడానికి ప్రజల ముందుకొస్తున్నారు. ఆయన కపట మాటలు నమ్మితే మళ్లీ చీకటి యుగంలోకి వెళ్తాం’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆమె అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గంలో రోడ్‌షోలు నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రతి చోటా ఆమె ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. భగ్గుమంటున్న ఎండను సైతం లెక్కచేయకుండా విజయమ్మ కోసంప్రజలు ఎదురు చూశారు. ఈ సందర్భంగా విజయమ్మ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
 
 వైఎస్ హయాంలోనే పేదలకు లబ్ధి..
  రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మంది పేద, బడుగు, బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చేకూరింది. ఆ తర్వాత ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను పట్టించుకోలేదు. వైఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా పన్ను పెంచకుండా పలు సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపారు.
  వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు పెంచి వారిని ఆర్థికంగా ఆదుకున్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందజేయాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు చేసి ఉన్నత విద్య కలను సాకారం చేశారు. ఈ పథకాలన్నీ మళ్లీ సక్రమంగా అమలు కావాలంటే జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలి.
 
  వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే వ్యవసాయానికి ఏడు గంటలు ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేశారు. అదే స్ఫూర్తితో జగన్ ముఖ్యమంత్రి అయితే నాలుగు సంతకాలు చేస్తారు. అమ్మ ఒడి పథకం, వృద్ధాప్య పెన్షన్ల పెంపు, డ్వాక్రా రుణాల మాఫీలతో పాటు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధితో రాష్ట్రాన్ని సంక్షేమ బాట పట్టిస్తారు.
 
 అది చీకటి యుగం..
  చంద్రబాబు పాలన చీకటి యుగంగా గడిచింది. బీసీలను ఆదుకుంటామని ఆదరణ పేరుతో రూ.680 కోట్లు బడ్జెట్ కేటాయించి బీసీలకు మాత్రం ఇస్త్రీ పెట్టెలు, పాల క్యాన్లు, దోబీ ఘాట్లు నిర్మించి చేతులు దులిపేసుకున్నారు. బాబు హయాంలో బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు.
-  ఎన్టీ రామారావు హయాంలో అమలు చేసిన జనతా వస్త్రాల పథకాన్ని కూడా బాబు రద్దు చేశారు. 34 ఏళ్ల రాజకీయ జీవితం ఉందని చెప్పుకొనే చంద్రబాబు.. ప్రజలకిచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 1994లో రూ.2 కిలో బియ్యాన్ని రూ.5.25 చేశారు.
-  1999లో ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఇస్తామని చెప్పి ఆ పథకం గురించి పట్టించుకోలేదు. 2009 ఎన్నికల్లో నగదు బదిలీతోపాటు, ప్రతి ఇంటికీ కలర్ టీవీ ఇస్తామన్న ఆయన హామీలను ప్రజలు ఛీకొట్టారు.
-  ప్రస్తుత ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో నెరవేర్చలేని, అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పిస్తూ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. రుణ మాఫీ అంటూ రైతులను మభ్యపెడుతూనే ఇంటికో ఉద్యోగమిస్తానని యువతను పక్కదారి పట్టిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement