జన్మభూమి కార్యక్రమం బహిష్కరణ | people protest against janmabhoomi program | Sakshi

జన్మభూమి కార్యక్రమం బహిష్కరణ

Jan 10 2018 10:59 AM | Updated on Aug 10 2018 9:50 PM

వరికుంటపాడు: వరికుంటపాడు మండలం తూర్పుబోయమడుగులలో మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమాన్ని స్థానిక గిరిజన సర్పంచ్‌ బాపట్ల చెంచయ్య బహిష్కరించగా ఆయనకు వైఎస్సార్‌ సీపీ నేతలు మద్దతుగా నిలిచారు. ఉదయం 10.30కు సర్పంచ్‌ అధ్యక్షతన ప్రారంభమైన గ్రామసభలో మండల ప్రత్యేకాధికారి కె.సత్యవాణి, తహసీల్దార్‌ జి.శ్రీనివాసులు, ఎంపీపీ సుంకర వెంకటాద్రి పాల్గొన్నారు. కాగా మధ్యాహ్నం సర్పంచ్‌ భోజనం ఏర్పాటు చేసినప్పటికీ కొందరు అధికారులు, ఎంపీపీ కలిసి గ్రామంలోని టీడీపీ నేత తోడెందుల వెంకటేశ్వర్లు ఇంట్లో భోజనం చేశారు. దీంతో ఆగ్రహించిన సర్పంచ్‌ తాను గిరిజనుడిననే భావనతో భోజనం ఏర్పాటు చేసినప్పటికీ ప్రత్యేకాధికారి, తహసీల్దార్‌ టీడీపీ నేత ఇంటికి భోజనానికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో తహసీల్దార్‌ మరలా సర్పంచ్‌ ఏర్పాటు చేసిన భోజనం తిన్నప్పటికీ సర్పంచ్‌ సంతృప్తి చెందలేదు. అనంతరం గ్రామసభ ప్రారంభమైన వెంటనే సర్పంచ్, ఇతర వైఎస్సార్‌ సీపీ నాయకులు ధర్నా నిర్వహించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మండల మహిళా టీడీపీ నాయకురాలు మాగంటి శాంతి వాగ్వాదానికి దిగారు. అనంతరం సర్పంచ్‌ తాను గ్రామసభను బహిష్కరిస్తున్నానని, అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. ఈ క్రమంలో వైఎస్సార్‌ సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. పరిస్థితి విషమిస్తుండడంతో ఎంపీపీ, అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో గ్రామసభ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం సర్పంచ్‌ చెంచయ్య విలేకరులతో మాట్లాడుతూ అధికారులు తనను అవమానించే రీతిలో వ్యవహరించారని ఆరోపించారు. అలాగే ప్రత్యేకాధికారి, తహసీల్దార్‌ మాట్లాడుతూ ఎంపీపీ భోజనానికి రమ్మంటే వెళ్లామని, సమస్య ఇంత జఠిలమవుతుందని తెలియదని తెలిపారు. కాగా వైఎస్సార్‌ సీపీ నేతలు మాగంటి సిద్ధయ్య, ఉప సర్పంచ్‌ జాన్‌ప్రసాద్‌ తదితరులు సర్పంచ్‌కు బాసటగా నిలిచారు.

ఏం ఉద్ధ్దరించారని జన్మభూమి?
బుచ్చిరెడ్డిపాళెం: ‘మాకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా లేవు? మీకేమో మినరల్‌ వాటరా? ఏం ఉద్ధరించారని జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నారు’ అంటూ బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇస్కపాళెం ప్రజలు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై ధ్వజమెత్తారు. గ్రామంలో మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు తమ ఎమ్మెల్యేను తమకు రేషన్‌కార్డులు ఎందుకు మంజూరు చేయలేదని, అర్హత ఉన్నా పింఛన్‌ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎన్టీఆర్‌ ఇళ్లు టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారని మండిపడ్డారు. స్థానిక సర్పంచ్‌ పంచాయతీని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. పంచాయతీ నిధులు స్వాహా చేయడం మినహా అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఈ సారి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని బాహాటంగానే పేర్కొన్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ‘‘ఆపండి’’ అంటూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ చొప్పా రవీంద్రబాబు, ఎంపీడీఓ పి.సుజాత, వివిధ శాఖల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement