
శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనక బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంతి ఆకారాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చే ప్రయత్నం చేసిన అతడిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు మూడు డీ మెరిట్ పాయింట్లు శిక్షగా వేసింది. మ్యాచ్ రెండో రోజు శనివారం భారత ఇన్నింగ్స్ 50వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘షనక తన తప్పును అంగీకరించాడు. అతని కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ శిక్షతో అతను భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉంటాడని, బంతి స్థితిని మార్చే ప్రయత్నం చేయడని ఆశిస్తున్నాం’ అని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ వెల్లడించారు.