jee results
-
ర్యాంకర్లూ కటాఫ్!
సాక్షి, హైదరాబాద్: కేంద్రీయ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్–2025 అర్హత పరీక్ష ఫలితాల్లో దాదాపు అన్ని కేటగిరీల్లో కటాఫ్ పర్సంటైల్ గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లో అర్హుల సంఖ్యలోనూ స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మరోవైపు గతేడాదితో పోలిస్తే 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య కూడా సగానికి పడిపోయింది.గతేడాది జేఈఈ మెయిన్ ఫలితాల్లో 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 56 మంది ఉండగా ఈసారి కేవలం 24 మందే 100 పర్సంటైల్ సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు సైతం భారీగా తగ్గిపోయారు. గతేడాది జేఈఈ మెయిన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 21 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా తాజాగా ఆ జాబితాలో నలుగురు (హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బణిబ్రత మజీ, గుత్తికొండ సాయి మనోజ్ఞ) మాత్రమే ఉండటం గమనార్హం. సాయి మనోజ్ఞ మహిళల కేటగిరీలో టాపర్‌గా నిలవగా అజయ్‌రెడ్డి ఈడబ్ల్యూఎస్ విభాగంలోనూ టాపర్‌గా నిలిచాడు. భారీగా దరఖాస్తులు... జేఈఈ మెయిన్–2025 కోసం విద్యార్థులు భారీగానే పోటీ పడ్డారు. జనవరి, ఏప్రిల్ రెండు సెషన్లకు కలిపి 15,39,848 మంది దరఖాస్తు చేసుకోగా 14,75,103 మంది హాజరయ్యారు. తుది ఫలితాల్లో నిర్దేశించిన కటాఫ్ పర్సంటైల్ సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2,50,236 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు స్వల్పంగా తగ్గాయి. ఓపెన్ కేటగిరీలో 93.102 పర్సంటైల్‌గా కటాఫ్‌ను నిర్ణయించగా గతేడాది ఇది 93.236గా నమోదైంది.ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కటాఫ్‌ను 80.383గా నిర్ణయించగా గతేడాది 81.326గా నమోదైంది. ఓబీసీ కేటగిరీలో గతేడాది 79.675 పర్సంటైల్ ఉండగా ఈ ఏడాది 79.431గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మాత్రం కటాఫ్ పర్సంటైల్ స్వల్పంగా పెరిగింది. మరోవైపు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డ 110 మంది విద్యార్థుల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిలిపేసింది. ఈ నెల 23 నుంచి ‘అడ్వాన్స్డ్’కు రిజిస్ట్రేషన్ జేఈఈ మెయిన్ ఫలితాల్లో 2,50,236 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడంతో అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. మే 2 వరకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉంది. మే 18న రెండు పేపర్లుగా అడ్వాన్స్డ్ పరీక్షలు జరగనున్నాయి. అడ్వాన్స్డ్ ఫలితాలను జూన్ 2న ప్రకటించనున్నట్లు ఐఐటీ కాన్పూర్ ప్రాథమికంగా వెల్లడించింది. అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల ఆధారంగా ఐఐటీల్లోని 17 వేలకుపైగా సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే జేఈఈ మెయిన్ ద్వారా ప్రవేశం కల్పించే ఎన్ఐటీల్లో దాదాపు 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 8,500, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర విద్యాసంస్థల్లో దాదాపు 9 వేల సీట్లు అందుబాటులో ఉంటాయి. -
జేఈఈ మెయిన్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా వారిలో నలుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బనిబ్రత మజీతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ 100 పర్సంటైల్ సాధించారు. అలాగే టాప్–100 ర్యాంకుల్లో 15 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. 99 పర్సంటైల్‌లో వంద మందికిపైగా చోటు సాధించారు. జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. రాజస్తాన్‌కు చెందిన ఎండీ అనాస్, ఆయుష్ సింగల్ తొలి రెండు ర్యాంకులు సాధించారు. జేఈఈ మొదటి విడత పరీక్ష జనవరిలో జరిగింది. రెండో సెషన్‌ను ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 10,61,849 మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 9,92,350 మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మొదటి, రెండో విడత పరీక్ష ఫలితాలను ఆధారంగా చేసుకొని ర్యాంకులు ప్రకటించారు. వాటి ల్లో 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. ఈ పరీక్షకు ఈ నెల 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2న పరీక్ష ఉంటుంది. -
జేఈఈ మెయిన్‌లో మనోళ్ల సత్తా
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో మళ్లీ తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన బట్టేపాటి కార్తికేయ జాతీయస్థాయిలో ఐదో ర్యాంకు కైవసం చేసుకున్నారు. తెలంగాణకే చెందిన అడెల్లి సాయికిరణ్ ఏడో ర్యాంకు, కె.విశ్వంత్ 8వ ర్యాంకు, ఇందుకూరి జయంత్ ఫణి సాయి 19వ ర్యాంకును సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండా రేణు 9వ ర్యాంకు, బొజ్జ చేతన్ రెడ్డి 21వ ర్యాంకును సాధించారు. బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన ఈ ఏడాది జనవరి 8 నుంచి 12 వరకు తొలి దఫా, ఆ తర్వాత ఏప్రిల్ 7 నుంచి 12వరకు జరిగిన రెండో దఫా జేఈఈ మెయిన్ పేపర్–1 పరీక్ష జరిగింది. జనవరిలో జరిగిన తొలిదఫా పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే ప్రకటించగా, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్ష ఫలితాలను సోమవారం రాత్రి ప్రకటించింది. ఢిల్లీకు చెందిన శుభాన్ శ్రీవాత్సవ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును కైవసం చేసుకోగా, కర్ణాటకకు చెందిన కెవిన్ మార్టిన్ రెండో ర్యాంకు, మధ్యప్రదేశ్‌కు చెందిన ధ్రువ్ అరోరా మూడో ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో ఎన్టీఏ ప్రకటించిన టాప్–24 ర్యాంకర్లలో తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ఇద్దరికి చోటు లభించింది. జనవరిలో జరిగిన తొలి దఫా జేఈఈ మెయిన్ పరీక్షకు 8,74,469 మంది, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్షకు 8,81,096 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6,08,440 మంది విద్యార్థులు రెండు సార్లు పరీక్ష రాశారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకుని వీరికి ఎన్టీఏ ర్యాంకులను కేటాయించింది. రెండు దఫాల్లో కలిపి మొత్తం 11,47,125 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాశారు. రెండో దఫాల్లో 608440 మంది పరీక్షలు రాయగా, అందులో 297932 మంది తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. కాగా, మొత్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన గురుమూర్తి, పద్మ దంపతుల కుమారుడు కె.విశ్వంత్ జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించారు. ఆయన తల్లిదండ్రులిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన బట్టేపాటి కార్తికేయ హైదరాబాద్‌లో ఉండి చదువుకుంటున్నారు. సిద్దిపేటకు చెందిన దయానంద్, సునంద దంపతుల కుమారుడు అడెల్లి సాయికిరణ్ జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. మే 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో మెరిట్ ప్రకారం తొలి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేయనున్నారు. ఈ అభ్యర్థులకు మే 27న అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా పేపర్–1ను మే 27న ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ సాధించిన అభ్యర్ధులకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం మే 5 నుంచి దరఖాస్తుకు చివరి తేదీ మే 9 ఫీజు చెల్లింపునకు గడువు మే 10 హాల్‌టికెట్ల డౌన్లోడ్ మే 20నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 27 ఆన్లైన్ కీ విడుదల జూన్ 4 జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 14 -
ఐఐటీ జేఈఈ ఫలితాల్లో ‘సూపర్ 30’ హవా
పట్నా: ప్రతిభగల నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ కోచింగ్ అందించే బిహార్‌లోని ‘సూపర్ 30’ సంస్థ ఈ ఏడాదీ సత్తా చాటింది. ఐఐటీ-జేఈఈ 2016 ఫలితాల్లో సంస్థలోని 30 మంది విద్యార్థులకుగాను ఏకంగా 28 మంది అర్హత సాధించారు. వారిలో దినసరి కూలీ, సన్నకారు రైతు, వలస కార్మికుల పిల్లలు ఉన్నట్లు సూపర్ 30 వ్యవస్థాపక డెరైక్టర్ ఆనంద్ కుమార్ ఆదివారం పట్నాలో తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకుల కష్టానికి దక్కిన ఘనత ఇది అని వ్యాఖ్యానించారు. సరైన అవకాశాలు కల్పిస్తే పేద కుటుంబాల పిల్లలు కూడా ఐఐటీలలో సీట్లు సాధించగలరని ఈ ఏడాది ఫలితాలు మరోసారి నిరూపించాయన్నారు. ఏటా పోటీ పరీక్ష ద్వారా 30 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా కోచింగ్‌తోపాటు భోజన, వసతి సౌకర్యాలను సూపర్ 30 కల్పిస్తోంది. రోజుకు 16 గంటల చొప్పున ఏడాదిపాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ద బెస్ట్ ఆఫ్ ఆసియా 2010’ జాబితాలో సూపర్ 30ని ఎంపిక చేసింది.’