Land danda
-
భూ బాగోతంలోఇద్దరు ఎమ్మెల్యేలకూ పాత్ర
ద్వారకాతిరుమల: కొందరు ప్రజాప్రతినిధులు భూ బకాసురుల పాత్రలను పోషిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పోరంబోకు భూములు కనుమరుగవుతున్నాయి. పేద ప్రజల నివాసాలకు ఇవ్వాల్సిన స్థలాలను వారు దళారుల ద్వారా దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవలందించాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా అక్రమాలకు పాల్పడటం పట్ల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ద్వారకాతిరుమలలోని వసంత్‌నగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పోరంబోకు భూముల కబ్జాలు, క్రయ విక్రయాలపై సాక్షి ప్రచురిస్తున్న వరుస కథనాలతో అక్రమార్కులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ భూబాగోతంలో ఉంది చిన్నచితకా ప్రజాప్రతినిధులు అయితే ఈ విషయం అంత హాట్ టాపిక్ అయ్యేది కాదు. సాక్షాత్తు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ఇందులో పాత్ర ఉండటం సంచలనంగా మారింది. ఇందులో ఒక ఎమ్మెల్యే 25 సెంట్ల భూమిని తన అనుయాయుల ద్వారా విక్రయాలు సాగించి సొమ్ములు దండుకోగా... మరో ఎమ్మెల్యే తన కుమారుడి రియల్ ఎస్టేట్ వెంచర్లో అరెకరం భూమిని కలిపి దర్జాగా అమ్ముకుంటున్నారు. తేలుకుట్టిన దొంగల్లా వసంత్‌నగర్ కాలనీలోని ఆర్ఎస్ నంబర్ 1/2 లో మొత్తం 10.20 ఎకరాల భూమి ఉండగా అందులో 2.50 ఎకరాల భూమికి సంబంధించి తమకు డి ఫారం పట్టాలు ఇచ్చారని వర్దినీడి బసవరాజు అతని కుమార్తె ఎర్రంశెట్టి కరుణలు చెబుతున్నారు. అయితే ఇందులో అవకతవకలను గుర్తించిన నేతలు ఈ భూమిని ఆన్లైన్ కాకుండా అడ్డుపడ్డారు. అప్పుడే ఎమ్మెల్యే పాత్ర రంగప్రవేశం చేసింది. అధికారులను ఒప్పించి ఎలాగోలా ఆన్లైన్ చేయించారు. ఈ సెటిల్మెంట్ చేసినందుకు ఆ ఎమ్మెల్యేకు 25 సెంట్ల భూమిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు నమ్మకంగా ఉన్న కొందరు నేతలు, దళారుల ద్వారా ఆ భూమిని విక్రయించినట్లు స్పష్టమౌతోంది. 25 సెంట్ల భూమిని పలు భాగాలుగా విభజించి రూ.16.80 లక్షల వరకు అమ్మకాలు జరిపినట్లు సమాచారం. కొనుగోలుదారులకు స్థలంలో ఉన్న వారి పేరున ఎంజాయ్మెంట్, పంచాయతీ మంచినీటి కుళాయిల ఏర్పాటు ఇలా అన్ని అనుమతులు ఇప్పిస్తామని దళారులు హామీలు గుప్పించడంతో, అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ పలువురు వాటిని కొన్నారు. ఇప్పుడు ‘సాక్షి’ ఆ బాగో తాలను బట్టబయలు చేయడంతో అంతా తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. ఇదిలా ఉంటే మరో ఎమ్మెల్యే కుమారుడు వసంత్‌నగర్ కాలనీకి ఆనుకుని ఉన్న ఆర్ఎస్ నంబర్ 11లోని అరెకరం ప్రభుత్వ పోరంబోకు భూమిని తన రియల్ వెంచర్లో కలుపుకున్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా.. అప్పటి తహసీల్దారు అన్ని విధాలా ఆక్రమిత దారులకు సహకరించి ఆ భూమిని వారికి కట్టబెట్టినట్లు తెలిస్తోంది. మణి పాత్ర ఎంత ద్వారకాతిరుమలలో ఒక తహసీల్దారు పనిచేసిన సమయంలో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు స్పష్టమౌతోంది. 2016 నుంచి 2017 వరకు ఎంహెచ్. మణి ఇక్కడ తహసీల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో అనర్హుల వద్ద ఉన్న దొంగ పట్టాలను ఒక ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఆన్లైన్ చేసినట్లు తెలు స్తోంది. అలాగే అరెకరం ప్రభుత్వ భూమిని ఒక ఎమ్మెల్యే కుమారుడికి కట్టబెట్టినట్లు స్పష్టమౌతోంది. ఆయన ఇంకెంత మందికి ఇలా ఆన్లైన్లో మార్పులు చేశారన్నది తెలియాల్సి ఉంది. అడుగు ముందుకెయ్యలేని అధికారులు: ఈ భూ బాగోతంలో ఎమ్మెల్యేల పాత్ర ఉండటం వల్లే అధికారులు ముందుకు అడుగు వేయలేక పోతున్నారన్నది బహిరంగ సత్యం. సాదా సీదా టీడీపీ నేతలకే బెదిరిపోతున్న అధికారులు ఏకంగా ఎమ్మెల్యేలను ఎలా ధిక్కరిస్తారు..? ఒక వేళ ధిక్కరిస్తే వనజాక్షికి పట్టిన గతే తమకు పడుతుందన్న భయం వారిలో కలుగదా..? ఇలా సవాలక్ష భయాలతో అధికారులు ముందుకు అడుగేయలేక పోతున్నారు. దీంతో పాలకులకు అడ్డూ అదుపు లేక రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగింది వసంత్‌నగర్ కాలనీలో ప్రభుత్వ భూమి క్రయ, విక్రయాలు గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కనుసన్నల్లో జరిగాయన్న విషయం అందరికీ తెలుసు. అయితే అధికార పార్టీ వారితో ఎందుకని ఎవరికి వారు పట్టించుకోవడం లేదు. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు సైతం ఇక్కడకొచ్చి భూములను ఆక్రమిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా అమ్మి, సొమ్ము చేసుకుంటూనే నీతిపరులమని నేతలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎమ్మెల్యేలకు భయపడి అధికారులు కూడా ఈ భూ బాగోతాన్ని కప్పేస్తున్నారు. పేద ప్రజలకు ఇవ్వడానికి లేని భూమి, అమ్ముకోవడానికి ఎలా వచ్చిందో. – తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి వసంత్‌నగర్‌లోని భూవివాదానికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించాల్సి ఉంది. వారి ఆదేశానుసారం అవసరమైతే ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాం. సర్వేకు సంబంధించి ఇప్పటికే సర్వేయర్, ఆర్ఐ, వీఆర్వోలకు నోటీసులిచ్చాను. అలాగే పాత రికార్డులను చూస్తున్నాం. – టీడీఎల్ సుజాత, తహసీల్దారు, ద్వారకాతిరుమల -
స్టార్..స్టార్..దగా స్టార్
-
పేదల భూములపై పచ్చ గద్దలు
♦ పెదగంజాంలో టెక్స్టైల్స్ పార్కుకు ప్రభుత్వ ప్రకటన ♦ రాజధాని తరహాలో భూ దందాకి దిగిన టీడీపీ నేతలు ♦ దశాబ్దాల క్రితం రైతులకు ఇచ్చిన భూములు లాక్కునే వ్యూహం ♦ అప్పనంగా రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం ♦ సహకరించకపోతే ఇబ్బందులు తప్పవంటూ బెదిరింపులు ♦ అధికార పార్టీ నేతలకు రెవెన్యూ అధికారుల వత్తాసు ♦ భూములిచ్చేది లేదంటున్న రైతులు, కూలీలు ♦ జీవనాధారం కోల్పోరుు రోడ్డున పడతామంటూ ఆవేదన జిల్లాలోని అధికార పార్టీ నేతలు రాజధాని తరహాలో భూ దందాకు తెరతీశారు. విలువైన పేదల భూములను అప్పనంగా కొట్టేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. చినగంజాం మండలం పెదగంజాం పంచాయతీ పరిధిలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ప్రాంతంలోని భూములు అప్పగించాలంటూ స్థానిక నేతలు అక్కడి రైతులను బెదిరిస్తున్నారు. భూములిస్తే అంతో ఇంతో ముట్టజెబుతామని లేకపోతే బలవంతంగా లాక్కుంటామని హెచ్చరిస్తున్నారు. రైతుల దగ్గర భూములు గుంజుకొని వాటినే టెక్స్టైల్స్ పార్కుకు అప్పగించి కోట్లు కొట్టేసేందుకు స్థానిక పచ్చ నేత సమీప బంధువు వ్యూహం రచించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దశాబ్దాలుగా ఆ భూములను నమ్ముకొని బతుకుతున్న రైతులు, రైతు కూలీలు ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు ; ప్రభుత్వం పెదగంజాం ప్రాంతంలో మెగా టైక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పార్కు నిర్మాణం ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నట్లు చెప్పింది. ఇందుకోసం 530 ఎకరాలకుపైగా భూములు సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఇదే అదునుగా నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్యనేత సమీప బంధువు ఆ భూములు కొట్టేసి కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పెదగంజాం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 1160, 1161లలో వందలాది ఎకరాలు భూమి ఉందని, ఆ భూములలో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. పార్కు నిర్మాణం కోసం అదే భూములను ఎంపిక చేయాలంటూ స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అధికారుల ద్వారా బెదిరింపులు.. రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్న సామెతగా రెవెన్యూ అధికారులు పెదగంజాం భూములను సేకరించేందుకు రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా ఆ భూములను నమ్ముకొని బతుకుతున్న రైతులు భూములివ్వమని తేల్చి చెప్పారు. దీంతో అధికార పార్టీ ముఖ్యనేత సమీప బంధువు రైతులపైఒత్తిడి తెచ్చారు. గతంలో ప్రభుత్వం ఆ భూములను డికెటిలుగా ఇచ్చిందని, వాటిని అప్పగించకపోతే పైసా ఇవ్వకుండా లాక్కుంటామని బెదిరింపులకు దిగారు. స్వచ్ఛందంగా భూములు అప్పగిస్తే అంతో.. ఇంతో ముట్టజెబుతామని సానుభూతి మాటలు చెప్పారు. ఇదే విషయాన్ని అధికారుల ద్వారా చెప్పించారు. దీంతో అధికారులు కూడా రైతులను బెదిరిస్తున్నారు. అప్పనంగా భూములు కొట్టేసి వాటిని రైతులతో రాయించుకొని, తర్వాత అదే భూములను టెక్స్టైల్ పార్కుకు అప్పగించి కోట్లలో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రైతులను బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. గతంలో భూములిచ్చిన ప్రభుత్వం.. పెదగంజాం పంచాయతీ పరిధిలోని 1969 ప్రాంతంలో అమీన్‌నగర్ అనే గ్రామం ఉండేది. 150కిపైగా కుటుంబాలు అక్కడ నివసించేవారు. రొంపేరు కాలువకు దక్షిణం వైపున ఉన్న ఈ గ్రామం తరచూ వరదలకు గురయ్యేది. తీవ్ర తుపాను ప్రభావంతో 1970 ప్రాంతంలో ఏకంగా ఊరు మునిగిపోయింది. దీంతో గ్రామస్తులు ఆ ఊరు వదిలి కాలువ ఉత్తరం వైపు వలస వచ్చారు. 1972 ప్రాంతంలో బాధితులకు పాత అమీన్‌నగర్ ఉన్న ప్రాంతంలో సర్వే నెం.1160, 1161లో ఒక్కొక్కరికి ఎకరం చొప్పున దాదాపు 500 కుటుంబాలకు 530 ఎకరాలు భూములిచ్చారు. ప్రస్తుతం ఆ భూముల్లో రైతులు ఉప్పు సాగుతో పాటు, రొయ్యల చెరువులను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. కొందరు చేపల వేట సాగిస్తూ పొట్టపోసుకుంటున్నారు. ఇక్కడ రైతులతో పాటు పెదగంజాం పంచాయతీ పరిధిలోని పెదగంజాం, పల్లెపాలెం, బుచ్చిగుంట. కోడూరివారిపాలెం, కాటం వారిపాలెం, ఏటిమొగ, ఆవలదొడ్డిగొల్లపాలెం తదితర గ్రామాలకు చెందిన 8 వేల మందికిపైగా రైతులు, రైతు కూలీలకు ఆ భూములే జీవనాధారం. ఇప్పుడు ప్రభుత్వం భూములను లాగేసుకుంటే అందరూ రోడ్డున పడాల్సి వస్తోంది. మరో చోట నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో టైక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసుకోవాలని రైతులతో పాటు వేలాది కూలీలు విన్నవిస్తున్నారు. అయినా అధికార పార్టీ నేతలు కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేసుకొని ఆ భూములపై గద్దల్లా వాలారు. -
‘సదావర్తి’ సంచలనం
► సదావర్తి సత్రం భూదందాపై సర్వత్రా విమర్శలు ► వేలం నిర్వహణపై సత్రం చైర్మన్ అసంతృప్తి ► మండిపడుతున్న రాజకీయ పార్టీలు, ధార్మిక సంఘాలు సదావర్తి సత్రం భూ దందాపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజా, ధార్మిక , బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు ఏకంగా దేవస్థానం, సత్రాల భూములకే ఎసరు పెట్టడంపై మండి పడుతున్నారు. రూ.కోట్లు ఖరీదు చేసే భూమిని అతి తక్కువ ధరకే కొల్లగొట్టేశారు. టీడీపీ నేతలు బరితెగించి సత్రం ఆస్తులను దోచుకోవడంపై ధ్వజమెత్తుతున్నారు. సాక్షి, విజయవాడ : అమరావతి సదావర్తి సత్రంలో ‘వెయ్యి కోట్ల లూటీ.. శీర్షికతో శనివారం ‘సాక్షి’ మెయిన్ మొదటి పేజీలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై తీవ్ర స్పందనలు వెల్లువెత్తాయి. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పక్కా స్కెచ్‌తో సాగిన అడ్డగోలు భూలూటీకి అధికార పార్టీ మంత్రులు సహకారం అందిచటంతో రూ.కోట్లు ఖరీదు చేసే భూమిని రూ.లక్షలకే దక్కించుకున్నారు. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో జిల్లాలో ఇంటిలిజెన్స్ అధికారులు రంగంలో దిగి అసలు సత్రం వ్యవహారంపై విచారణ సాగించారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వారసుడు, సదావర్తి సత్రం చైర్మన్ రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ వేలం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకోవైపు సాక్షి కథనం నంబూరులో కలకలం సృష్టించింది. నంబూరు గ్రామానికి చెందిన సంజీవరెడ్డి భూములను కొనుగోలు చేయడంతో వ్యవహారం కలకలం రేపింది. భూముల కొనుగోలుపై సర్వత్రా చర్చ నంబూరు గ్రామానికి చెందిన సంజీవరెడ్డి మంగళగిరి నూతక్కిలో స్థిరపడ్డారు. ట్రాక్టర్ వ్యాపారం చేసే సంజీవరెడ్డి రూ.22 కోట్లు పెట్టి సదావర్తి సత్రం భూములు కొనుగోలు చేయడం వెనుక మతలబుపై సర్వత్ర చర్చ సాగుతోంది. తెలుగుదేశం నేతల అనుచరుడుగా ఉన్న సంజీవరెడ్డి బినామీయేనని, తెరవెనుక కాపు కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు, మంత్రులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇంటిలిజెన్స్ వర్గాలు సమగ్రంగా విచారణ నిర్వహిస్తున్నాయి. ఇంకోవైపు అమరావతి దేవస్థానంలో తీవ్ర అలజడి రేగింది. దేవస్థాన అధికారులు గతంలో నిర్వహించిన వేలం ప్రక్రియకు సంబంధించి వీడియోతో సహా అన్ని ఆధారాలు సిద్ధం చేసుకుంటున్నారు. దేవుడి స్థలాల జోలికొస్తే పతనం తప్పదు భక్తి భావం ఉందని పదే పదే చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భూముల వేలంపై సీబీఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. దేవాదాయ శాఖ భూములను అమరేశ్వరస్వామి, ఆలయం పరిధిలోనే ఉండేలా భూములను స్వాధీనం చేసి గుడికి అప్పగించాలి. దేవుడి స్థలాల జోలికి వస్తే వారి పతనం తప్పదు. హిందూ సంస్థలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. వేలం నిర్వహించినప్పుడు తమిళనాడులో డబ్బులు ఉన్న నేతలు వాపారస్తులు లేరా? కేవలం టీడీపీ నేతలు మాత్రమే వేలంలో పాల్గొనేలా అధికారులు వారికి వత్తాసు పలికారు. - దర్శనపు శ్రీనివాస్, హిందూ ధర్మ, రక్షా సమితి జిల్లా అధ్యక్షుడు వేలం దారుణం సదావర్తి సత్రం భూముల అక్రమ వేలం దారుణం. ధార్మిక కార్యక్రమాల కోసం, హిందు ధర్మ పరిరక్షణ కోసం దాతలు మంచి ఉద్దేశంతో ఇచ్చిన భూముల్ని ఇలా అమ్ముకోవడం దారుణం. రూ.కోట్లు విలువ చేసే భూముల్ని రూ.లక్షలకు ఎలా వియ్రిస్తారు. దీనిపై న్యాయ విచారణ జరపాలి. - దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు స్వామి కమలానంద భారతీ స్వామి -
సర్కారీ భూ దందా!
► ఖరీదైన భూముల విలువ కుదింపు ► కోట్లలో నష్టపోతున్న కత్తిపూడి ప్రజలు ► అభ్యంతరాల్ని పరిష్కరించకుండానే పరిహారం అవార్డులు ► అవసరానికి మించి భూసేకరణ ► రెండు జాతీయ రహదారుల మధ్య భూమిపై పెద్దల కన్ను ► అధికార పార్టీ నేతల కోసం అలైన్మెంట్ మార్చని వైనం ► 216 జాతీయ రహదారి రింగ్‌రోడ్డుపై ముదురుతున్న వివాదం సాక్షి ప్రతినిధి, కాకినాడ : భవిష్యత్తు అవసరాల ముసుగులో అవసరానికి మించి భూసేకరణ చేయడంలో టీడీపీ సర్కారు తనదైన ముద్ర వేసుకొంటోంది. ఇప్పటికే రాజధాని అమరావతి కోసం వేలాది ఎకరాలను రైతుల పొట్టగొట్టి పోగేసినట్లే.. జిల్లాలోనూ అలాంటి వ్యవహారానికి తెరతీసింది! జిల్లా మీదుగా వెళుతున్న 16వ నంబరు జాతీయ రహదారిని జిల్లాలో కొత్తగా విస్తరించనున్న 216 నంబరు జాతీయ రహదారిని కత్తిపూడి వద్ద అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల జరిగే అభివృద్ధిని అక్కడి గ్రామప్రజలు స్వాగతిస్తున్నా.. అర్థంపర్థంలేని భూసేకరణ విధానాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నష్టపరిహారం గణనలో ప్రభుత్వం, అధికారుల వైఖరిని తప్పుపడుతున్నారు. తమ అభ్యంతరాల ను పరిష్కరించకుండానే పరిహారానికి సంబంధించిన అవార్డులను ప్రకటించేసి ‘వెన్నుపోటు’ పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చితే అధికార పార్టీ నాయకుడొకరి భూములు పోతాయనే ఉద్దేశంతో నివాసాలపై నుంచే రింగ్‌రోడ్డు నిర్మించడానికి సిద్ధమవడాన్నీ తప్పుపడుతున్నారు. భవిష్యత్తు అవసరాల పేరుతో ఇళ్లు, స్థలాలను చౌకగా లాగేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు వివాదాస్పదమైంది. జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని కత్తిపూడి గ్రామం ఇప్పుడు కీలకమైంది. కోల్‌కతా-చెన్నై 16వ నంబరు జాతీయ రహదారిపై ఉండటమే కాక సమీపంలోనే అన్నవరం పుణ్యక్షేత్రం, కాకినాడ సెజ్, పోలవరం కాలువ ఉన్నాయి. ఇదే సమయంలో కొత్తగా విస్తరణ చేపట్టిన 216వ నంబరు జాతీయ రహదారి కత్తిపూడి వద్దే 16వ నంబరు జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత కీలకమవుతుందనే ముందుచూపుతోనే అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు కత్తిపూడి పరిసరాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. ఆ నేతలే 216 జాతీయ రహదారి విస్తరణ వల్ల తమకేమాత్రం నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే వారి ప్రయోజనం కోసం తమ ఆస్తులకు నష్టం తలపెట్టటంపై కత్తిపూడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మారిన అలైన్మెంట్.. వాస్తవానికి 216 జాతీయ రహదారి జిల్లాలోనే కత్తిపూడి నుంచి గుడిమెల్లంక వరకూ 127 కిలోమీటర్ల పొడవున ఉంది. దీన్ని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడమే కాక కొన్నిచోట్ల బైపాస్‌రోడ్లు నిర్మించనున్నారు. ఈ పనులకు గత ఏడాది డిసెంబరులో కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడలో శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రహదారి పనులపై సమీక్షిస్తున్నారు. కానీ నష్టపరిహారం విషయంలో అధికారుల లెక్కల్లో తేడాలొస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారని బాధితులు వాపోతున్నారు. ఇదే రహదారి విస్తరణ వల్ల తాటిపాకలో దాదాపు 200 ఇళ్లు, ఇతర నిర్మాణాలకు నష్టం జరుగుతుందని అక్కడి ప్రజలు చెబితే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు చొరవ తీసుకొని అలైన్మెంట్ మార్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏకంగా అక్కడ బైపాస్ రోడ్డును ప్రతిపాదిత ఏడు కిలోమీటర్ల కన్నా అలైన్మెంట్ మార్పుచేసి 14 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. కత్తిపూడిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కత్తిపూడిలో 16వ నంబరు జాతీయరహదారికి, కత్తిపూడి-కాకినాడకు ఆనుకొని పోలవరం కాలువకు ఇరువైపులా రాజమహేంద్రవరానికి చెందిన అధికార పార్టీ నేతకు సుమారు 50 ఎకరాల భూములు ఉన్నాయి. అలాగే మరికొందరు అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులకు స్థలాలున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ప్రజల ఆస్తులు దెబ్బతినకుండా బైపాస్ రోడ్లు వేస్తున్నారు. కత్తిపూడిలో మాత్రం గ్రామ ప్రధాన రహదారి వెంబడే ఇప్పటికే ఉన్న 16వ నంబరు జాతీయ రహదారి ఫ్లైవోవరు పై నుంచే రింగ్‌రోడ్డు నిర్మించనున్నారు. గ్రామంపై నుంచి కాక నేరుగా 16వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ రోడ్డు నిర్మించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని, రింగ్రోడ్డుకే మొగ్గుచూపుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేని భూసేకరణ రింగ్‌రోడ్డు నిర్మాణంతో 16వ నంబరు, 216వ నంబరు జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట మధ్యలో 8 ఎకరాల భూమి ఉంది. వాస్తవానికి ఇది రోడ్డుకు అవసరం లేదు. కానీ ఆ భూమినీ భూసేకరణలో చేర్చేశారు. భవిష్యత్తులో ఎంతో కీలకమయ్యే భూమిపై అధికార పార్టీకి చెందిన నాయకులు కన్నేశారని స్థానికులు వాపోతున్నారు. తమ ఇళ్లు, షాపులు ఉన్న ఆ భూమిని సేకరణ నుంచి మినహాయించాలని డిమాండు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ విలువే చదరపు గజానికి రూ.4,500 ఉంది. కానీ అధికారులు మాత్రం రూ.1,231 చొప్పున లెక్క తేల్చారు. దీనికి 25 శాతం మాత్రమే అదనంగా చేర్చి నష్టపరిహారం చెల్లించడానికి అవార్డు జారీ చేశారు. మరో విశేషమేమిటంటే ఈ ఆస్తులపై అధికారులు కట్టిన లెక్కలే భిన్నంగా ఉన్నాయి. కత్తిపూడిలో ప్రజల ఆస్తుల విలువను గణించే పనిని జాతీయ రహదారికి ఒకవైపు కాకినాడ ఆర్ అండ్ బీ అధికారులకు, మరోవైపు తుని ఆర్అండ్ బీ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. రెండు సెంట్ల విస్తీర్ణంలో ఉన్న పెంకుటిల్లు విలువ రూ.29 లక్షలని కాకినాడ అధికారులు లెక్క తేల్చితే.. పక్కనే 3 సెంట్ల విస్తీర్ణంలోని పక్కా భవనానికి తుని అధికారులు రూ.20 లక్షలని లెక్కగట్టారు. ఇలా ఆస్తుల విలువ గణనలో తేడాలపై అభ్యంతరాలేమిటో తెలుసుకోకుండానే అధికారులు అవార్డు ప్రకటించడంపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే అన్యాయం చేస్తోంది.. మా కుటుంబానికి ఉన్న ఎలక్ట్రికల్ షాపు రింగ్‌రోడ్డు వల్ల పోతోంది. నష్టపరిహారం కూడా రిజిస్ట్రేషన్ విలువ కన్నా తక్కువే ఇస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం నాలుగు రెట్లు ఇవ్వాల్సి ఉన్నా కేవలం ఉన్న విలువలో నాలుగు రెట్లు తగ్గించి ఇవ్వడం దారుణం. 2008లోనే ఇంజనీర్ల లెక్క ప్రకారం మా షాపు విలువ రూ.8 లక్షలు. ఇప్పుడు రూ.30 లక్షల వరకూ ఉంది. కానీ అవార్డు ప్రకారం రూ.11 లక్షలే వస్తుంది. జీవనాధారం కోల్పోయే మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఎలా? - గౌతు సతీష్, కత్తిపూడి అవసరం లేకున్నా ఖాళీ చేయిస్తున్నారు.. భూమి విలువ గణనలో తేడాలు ఉండటంపై, మా అభ్యంతరాలు వినకుండా అవార్డు పాస్ చేయడంపై అదనపు జాయింట్ కలెక్టర్‌కు నాలుగుసార్లు వినతిపత్రాలు ఇచ్చాం. అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లాం. న్యాయం చేస్తామంటూనే అన్యాయం చేస్తున్నారు. నాకు ఒకే సర్వే నంబరులో ఉన్న ఇంటికేమో చదరపు గజాల చొప్పున నష్టపరిహారం లెక్కగట్టి, ఖాళీ స్థలం పాస్‌బుక్‌లో ఉందని సెంట్ల లెక్కన ఇస్తే తీవ్రంగా నష్టపోతాం. ఎకరం రూ.కోటి అయితే ఇక్కడ మాత్రం రూ.7 లక్షలు ఇస్తారట. రెండు జాతీయ రహదారుల మధ్యనున్న 8 ఎకరాల్లో 92 మందికి చెందిన ఇళ్లు, షాపులు ఉన్నాయి. రింగ్‌రోడ్డుకు అవసరం లేకున్నా అవన్నీ ఎందుకు ఖాళీ చేయిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. - కేలంగి సోమరాజు, కత్తిపూడి -
తమ్ముళ్లకూ కబ్జాకాటు
► జిల్లాలో పెరుగుతున్న టీడీపీ నేతల భూ దందా ► సొంత పార్టీ కార్యకర్తల భూములనూ వదలని నాయకులు ► ఇచ్చినంత తీసుకుని వెళ్లిపోవాలంటూ దౌర్జన్యం ► ఎదురుతిరిగితే అక్రమ కేసులు.. బెదిరింపులు ► సత్తెనపల్లి, గుంటూరు శివారు ప్రాంతాల్లో ఘటనలు ► అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నపోలీసు అధికారులు జిల్లాలో కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు చేస్తున్న భూ దందాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకుల భూములను కూడా విడిచిపెట్టడం లేదు. విలువైన స్థలం కనిపిస్తేచాలు.. నయానోభయానో యజమానులను వెళ్లగొట్టి స్వాధీనం చేసుకుంటున్నారు. ఎదురుతిరిగిన వారిపై మందీమార్బలంతో కలసి దాడులు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. కబ్జా బాధితుల్లో స్వయానా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉంటున్నారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో రాజధాని నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి టీడీపీ నేతల దందాలు పెచ్చుమీరిపోయాయి. గతంలో భూములు అమ్ముకుని వెళ్లిపోయిన వారితో సంతకాలు చేయించుకుని, వాటిని అడ్డుపెట్టుకుని భూమి తమదంటూ దబాయిస్తున్నారు. నిజమైన భూయజమానులు వచ్చి ప్రశ్నిస్తే ఇచ్చింది తీసుకుని వెళ్లమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, మంగళగిరి, తుళ్లూరు, గుంటూరు నగర శివారు ప్రాంతాల్లో భూములపై టీడీపీ భూ రాబందుల కన్ను పడింది. కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించుకుంటున్నారు. అధికారులంతా వారి చెప్పుచేతల్లోనే.. వివాదాస్పద భూములకు సంబంధించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి బంధువులు చెప్పినట్టుగా ఆడుతున్న అధికారులు నిజమైన భూ యజమానులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. స్థల యజమానులు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు అన్నీ చూపించినప్పటికీ వారి గోడు వినిపించుకునే వారే లేరు. అధికార పార్టీ నేతలు చెప్పిందే తడవుగా రెవెన్యూ అధికారులు అడంగళ్లులో పేర్లు మార్చేయడం, వారి పేరుతో ఉన్న పాస్‌పుస్తకాలను రద్దు చేయడం వంటివి చేస్తూ భూ బకాసురులకు తమవంతు సహకారం అందిస్తున్నారు. ఆపై రెవెన్యూ అధికారులు ఇచ్చిన అడంగళ్లను అడ్డుపెట్టుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, భూమిని స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు రౌడీలు, తమ అనుయాయులను వివాదాస్పద స్థలంలో దింపి అడ్డువచ్చినవారిపై దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు సైతం అధికార పార్టీ నేతలకు తొత్తులుగా బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సత్తెనపల్లి, గుంటూరులలో టీడీపీ నేతల అరాచకం గుంటూరు శివారు ప్రాంతం కాటూరి మెడికల్ కళాశాల పక్కన సుమారు 7.50 ఎకరాల భూమిని ఓ మంత్రి అండ దండలతో గుంటూరుకు చెందిన ఓ టీడీపీ నేత కబ్జా చేశారు. గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ చౌదరి ఈస్థలం తనదంటూ డాక్యుమెంట్లను అధికారులు, పోలీసులకు చూపినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. చివరకు సీఎం, గవర్నర్‌తోపాటు ఏసీబీ, సీఐడీ వంటి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేసినా ఎవ్వరూ పట్టించుకున్న పాపానపోలేదు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన సదరు టీడీపీ నేత తన అనుచరులను భూముల్లోకి పంపి అడ్డుపడిన రామకృష్ణచౌదరిపై బెదిరింపులకు దిగారు. ఇక సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల వద్ద టీడీపీ కార్యకర్త సుబ్బారావు చౌదరికి చెందిన సుమారు 17.3 ఎకరాల భూమిపై ముఖ్యనేత తనయుని కన్ను పడింది. వెంటనే తన నమ్మినబంటులాంటి ఓ వ్యక్తిపేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇది అక్రమమని సుబ్బారావు చౌదరి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే భూమిని తమ స్వాధీనంలోకి తీసుకునేందుకు శనివారం రాత్రి నరసరావుపేట నుంచి మందీమార్బలంతో భూమి వద్దకు వచ్చారు. సుబ్బారావుకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని రాస్తారోకో చేశారు. అప్పటికి వెళ్లిపోయిన ఆ నేత అనుచరులు తిరిగి సోమవారం మధ్యాహ్నం 200 మంది రౌడీలతో వచ్చి భూమిని స్వాధీనం చేసుకున్నారు. -
కన్ను పడితే కబ్జాయే..!
చెరువులు, అటవీ భూములపై తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగారు. పొక్లెయిన్లతో పనులు చేపట్టి చెరువు సరిహద్దులను చెరిపేస్తున్నారు. చెరువు గర్భాలను పొలాలుగా మార్చేస్తున్నారు. దీనిని చూసిన రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గోడు వినిపించారు. చర్యలు తీసుకోకపోవడంతో చెరువులు, అటవీ భూములు ఆక్రమణదారుల గుప్పిట్లో చేరిపోతున్నాయి. * తెలుగు తమ్ముళ్ల భూ దందా * సాగునీటి చెరువు ఆక్రమణ * అటవీ భూములనూ విడిచిపెట్టని వైనం * 20 రోజులుగా యంత్రాలతో పనులు * పట్టించుకోని రెవెన్యూ అధికారులు ఎల్.ఎన్.పేట: మండలంలోని కొత్తపేట రెవెన్యూలో సర్వే నంబర్ 48/1లో 2.29 ఎకరాల విస్తీర్ణంలో సొండికర్ర చెరువు ఉంది. 48/2ఎ లో 51.48 ఎకరాల అటవీ (రెవెన్యూ) ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ రెండు సర్వే నంబర్లకు సంబంధించిన భూములు పక్కపక్కనే ఉండటంతో వీటిపై పూశాం గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. టీడీపీ అధికారంలోకి రావడంతో వీరి కళ నెరవేరింది. భూదందాకు పథకం రచించారు. చెరువు, అటవీ భూమితో కలిపి 53.77 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు రంగంలోకి దిగారు. అధికారులను ప్రలోభ పెట్టారు. తమ వెనుక తిరిగే అనుచరులకు భూములు ఇస్తామని నమ్మించారు. దీనికోసం కాస్త ఖర్చవుతుందన్నారు. ఒక్కో రైతు నుంచి ఎకరాకు రూ.30 వేలు చొప్పున వసూలు చేశారు. ఇందులో కొంత మొత్తాన్ని రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పి దర్జాగా భూ ఆక్రమణలు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి... ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీలు సాగుచేసే భూములను వారికే పట్టాలు ఇవ్వాలి. ఇక్కడ మాత్రం పూశాం గ్రామానికి చెందిన బీసీ కుటుంబాల వారు 8.75 ఎకరాల భూమికి దొడ్డిదారిలో పట్టాలు తీసుకున్నారు. బెవర రమాదేవికి 2.50 ఎకరాలు, శివ్వాల తారకేశ్వరికి 2.50 ఎకరాలు, శివ్వాల విశ్వనాథంకు 1.50 ఎకరాలు, శివ్వాల దాసునాయుడు 0.75 సెంట్లు, శివ్వాల సత్యనారాయణకు 0.75 సెంట్లు, శివ్వాల గంగాధర్‌కు 0.75 సెంట్లుకు పట్టాలిచ్చినట్టు రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ‘మామ్మూళ్ల’మత్తులో రెవెన్యూ అధికారులు బీసీలకు పట్టాలిచ్చారని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మొత్తం ఆక్రమణలే... రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చింది ఆరుగురు రైతులకు 8.75 ఎకరాలకు మాత్రమే. దీనిని అడ్డుపెట్టుకుని 48/1లో ఉన్న సొండికర్ర చెరువు, 48/2ఎలో ఉన్న అటవీ (రెవెన్యూ) ప్రభుత్వ భూమి 51.48 ఎకరాలనూ ఆక్రమించేస్తున్నారు. గత 20 రోజులుగా పొక్లెయిన్లతో చదును చేసి అటవీభూములు, చెరువును పొలాలుగా మలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులు నమోదు చేస్తాం రైతులకు ఇచ్చిన భూమి కంటే ఎక్కువ ఆక్రమించుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. నిబంధనలు ప్రకారం పట్టాలిచ్చాం. అవసరమైతే వాటిని రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పనులు తక్షణమే ఆపించాలని వీఆర్వో, ఆర్ఐలను పంపించాం. ఎవరినీ వదిలేదు లేదు. - రమణమూర్తి, తహశీల్దారు, ఎల్.ఎన్.పేట -
ఏదైతే అయ్యింది, లెక్కలైతే బయటకు వచ్చాయి కదా!
ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ జరుగుతున్న భూభాగోతాలు, వందలకోట్ల కుంభకోణాల వ్యవహారాన్ని చూసి టీడీపీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారట. తమతోనే ఉంటూ తమకు తెలియకుండానే కొందరు నాయకులు ఎంతో పైకి ఎదిగిపోవడాన్ని చూసి జీర్ణించుకోలేక పోతున్నారట. కొందరు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీనాయకులు నడుపుతున్న రహస్య మంత్రాంగం, భూముల కొనుగోలు, బినామీ వ్యవహారాలు బయటపడడంతో లెక్కలన్నీ బయటకు వచ్చాయని, ఇది ఒకందుకు మంచిదేనని వారు లోలోపల సర్దిచెప్పుకుంటున్నారట. పార్టీనాయకులు కొందరు ముందుచూపుతో వ్యవహరిస్తూ, ఎవరికీ దొరకకుండా వ్యవహారాలను చక్కబెట్టుకోవడం చూసి షాకవుతున్నారట. ఏదిఏమైనా లెక్క తేలింది కదా, అన్ని విషయాలు బయటకు రావాల్సిందేనని సర్దిచెప్పుకుంటున్నారట. తమకు తెలియకుండానే వందలకోట్ల భూదందాలు నిర్వహించినందుకు వారికి అంతకు అంత కావాల్సిందేనని పనిలోపనిగా శపిస్తున్నారట. సీనియర్‌నాయకులు సైతం ఈ విధంగా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోతున్నారట. ఇటీవల ఒక సీనియర్ ఎమ్మెల్యే సైతం ముందు చూపు అంటే ఆ నాయకులదేనని, తాము ఇన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇంత తక్కువ కాలంలో ఇంతగా ఎదగవచ్చునని కలకనలేదని, ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములే వాడి అని మరోసారి నిరూపితమైందని ముక్తాయింపునిచ్చారట... -
సర్కారు భూదందా గుట్టుగా..
చైనా, సింగపూర్ బృందాల పర్యటనతో రైతుల్లో ఆందోళన భూములు తీసుకుంటామంటున్న ఉన్నతాధికారులు భూపరిరక్షణ పోరాట సమితి ఆందోళనలు సీఆర్డీఏ అధికారుల పరిశీలనతో మరింత గందరగోళం మచిలీపట్నం : సర్కారు భూదందాపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మచిలీపట్నంలో పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 30న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 14,427 ఎకరాల ప్రైవేటు భూమి, మరో 15 వేల ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. భూమినే నమ్ముకుని జీవిస్తున్న రైతులు భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దుచేయాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. పరిశ్రమలకు భూములివ్వాలని కోరుతూ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కోన, బుద్దాలపాలెం, చిన్నాపురం గ్రామాల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన తర్వాతే మళ్లీ గ్రామాల్లో పర్యటిస్తామని మంత్రి, ఎంపీ హామీ ఇచ్చి నెల రోజులు గడిచినా భూసేకరణ నోటిఫికేషన్ రద్దు కాలేదు. కాగా సింగపూర్ బృందం రెండు నెలల కిందట పోర్టు, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుచేసే ప్రాంతంలోని భూములను పరిశీలించి వెళ్లింది. తాజాగా గురువారం రాత్రి సీఆర్డీఏ అధికారులు చైనా బృందంతో కలిసి గుట్టుచప్పుడు కాకుండా తపసిపూడి గ్రామానికి వచ్చి పోర్టు, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుచేసే భూములు, వాటికి సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించి వెళ్లడం రైతుల్లో మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అధికారులు భూసేకరణ ప్రక్రియను గుట్టుచప్పుడు కాకుండా కానిస్తున్నారా అనే ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. 4,889 అభ్యంతరాలు ఆగస్టు 30వ తేదీన ప్రభుత్వం జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్‌పై రైతులకు ఏమైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా తెలియజేసేందుకు వెసులుబాటు ఇచ్చారు. ఆర్డీవో కార్యాలయంలో గత నెల 28వ తేదీ వరకు 4,889 అభ్యంతరాలు రైతుల నుంచి వచ్చాయి. వీటిని తహశీల్దార్లతో పరిశీలన చేయిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ ఏడాది పాటు అమలులో ఉంటుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం పోర్టు కాకుండా అనుబంధ పరిశ్రమలను ఏర్పాటుచేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు.. ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు.. స్థాపించే పరిశ్రమలకు అనుమతులున్నాయా, లేదా వంటి అంశాలను వెల్లడించడం లేదు. సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, చైనా దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపన పేరుతో భూములను అప్పగించే పని ప్రభుత్వం చేపడితే న్యాయపరంగానైనా ఎదుర్కొంటామని రైతులు అంటున్నారు. అందుకు అనుగుణంగా వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. భూపరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచే వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూపరిరక్షణ పోరాట సమితిని ఏర్పాటుచేసి గ్రామగ్రామాన ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజులుగా మీఇంటికి - మీభూమి కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టాలంటూ భూపరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆయా పార్టీల నాయకులు రెవెన్యూ అధికారులను అడ్డుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు మచిలీపట్నం ప్రాంతాన్ని సందర్శించి రైతుల తరఫున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించైనా భూములను సేకరించకుండా అడ్డుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా అధికారులు గుట్టుచప్పుడు కాకుండా భూసేకరణ వ్యవహారాన్ని నడుపుతున్నారనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. -
నిబంధనలకు పాతర
షాద్‌నగర్ రూరల్: అధికారుల అండదండలు... రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని కొందరు రియల్టర్లు నిబంధనలకు విరుద్ధంగా భూ దందా నిర్వహిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కాలుష్య కారక పరిశ్రమ చుట్టూ పెద్దఎత్తున వెంచర్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇదంతా షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రియల్ వెంచర్ల భాగోతం. అంతర్జాతీయ విమానాశ్రయానికి, రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్న షాద్‌నగర్ ప్రాంతంలో వ్యవసాయ పొలాలకు మార్కెట్ ధర లక్షల్లో పలుకుతుంది. హైదరాబాద్ పట్టణవాసులే కాకుండా ఎన్నారైలు సైతం ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసేందుకుఆసక్తిని చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు రియల్టర్లు నివాసానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటు చేసి అమాయకులకు అంటగడుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని షాద్‌నగర్ మున్సిపాలిటీలో గల సోలీపూర్ గ్రామ శివారులో కొన్ని రియల్ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కి వెంచర్లు ఏర్పాటు చేశాయి. సోలీపూర్ గ్రామపరిధిలోని ఓ పరిశ్రమ నుంచి వ్యర్థ రసాయనాలను భూమిలోకి పంపుతున్నారు. దీంతో పరిశ్రమ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూగర్భజలాలు కలుషితమయ్యాయి. ఎక్కడ బోరు వేసినా కలుషిత నీరే బయటకు వస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొనుగోలుదారులను మభ్యపెట్టి వారికి ప్లాట్లు అంటగడుతున్నారు. దీనికి కొందరు అధికారులు.. రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి సహకరిస్తున్నట్టు సమాచారం. పరిశ్రమ పక్కన వందల ఎకరాల్లో ప్లాట్లు చేశారు. వాటికి అనుమతులు లేకుండానే కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రియల్లర్లు అనుమతుల కోసం స్థానిక మున్సిపల్, హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకోవడం పూర్తయిన వెంటనే తమ పనిని ప్రారంభిస్తున్నారు. అనుమతులు రాకపోయినా కొనుగోలు దారులకు ప్లాట్లను విక్రయిస్తున్నారు. -
భూ దందా!
⇒ పేదల భూముల చుట్టూ ఓ ఉన్నతాధికారి ‘చక్ర’బంధం ⇒ ‘అనంతసాగర్’లో కేర్ టేకర్ పేరుతో దళారీకి కబ్జా బాధ్యతలు ⇒ బినామీ పేర్లు, తప్పుడు పత్రాలతో 300 ఎకరాల విక్రయం ⇒ అమ్మకానికి సిద్ధంగా మరో 300 ఎకరాలు ⇒ సాగు భూముల నుంచి గిరిజనుల గెంటివేత సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆయన ఒక అత్యున్నతస్థాయి అధికారి. అధికార బలాన్ని, వారసత్వంగా వచ్చిన కొంత భూమిని అడ్డం పెట్టుకొని మరో 700 ఎకరాలకు ఎసరు పెట్టారు. కేర్ టేకర్ పేరుతో ఓ దళారిని సృష్టించి పట్టా భూముల మీదకు ఉసిగొల్పారు. సదరు అధికారి తండ్రి నుంచే భూములు కొనుగోలు చేసి ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనులనూ వదల్లేదు. బినామీ పేర్లు, తప్పుడు పత్రాలతో ఇప్పటికే 300 ఎకరాలు అమ్మివేశారు. మరో 300 ఎకరాలు అమ్మకానికి పెట్టారు. కొంత కాలంగా మెదక్ మండలం అనంతసాగర్ భూముల్లో టీఎస్ ఆర్టీసీ జేఎండీ జీవీ రమణారావు ఉసిగొల్పిన కేర్‌టేకర్ రఘు సాగిస్తున్న కబ్జా కాండపై ‘సాక్షి’పరిశీలనాత్మక కథనం. మెదక్ మండలం అనంతసాగర్ గ్రామంలోని హఫీజా బేగం అనే మహిళ నుంచి 1 నుంచి 51 సర్వే నంబర్లలోని 845 ఎకరాల భూమిని 1960లో నర్సింహారెడ్డి, జనార్దన్‌రావు, సూర్యారావుతోపాటు మరో ఐదుగురు కలసి కొనుగోలు చేశారు. వీరు ఏనాడు భూమిని సాగు చేయలేదు. వీరిలో కొందరు తమ వాటా భూములను గిరిజనులకు అమ్ముకున్నారు. అమ్ముకున్న వారిలో టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణారావు తండ్రి జనార్దన్‌రావు కూడా ఉన్నారు. అక్రమాల ‘పట్టా’..: 2012లో జీవీ రమణారావు సర్వే నంబర్ 23ఉ, 1ఉ, 2ఉ, 19ఉ, 27ఈ, 28ఉ, 35ఉ, 43ఉ, 50ఉ, 51ఉ, 36ఉ లోని 103.16 ఎకరాలు తన తండ్రి వారసత్వంగా వచ్చిన భూమిని తనకు పౌతీ చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి రమణారావుకు అనువంశికంగా సంక్రమించే భూమి అంత ఉండదు. ఆయన తండ్రి జనార్దన్‌రావు సంపాదించిన 104 ఎకరాల భూమిలో ఆయనే 1975 నుంచి 1986 వరకు దాదాపు 60 నుంచి 70 ఎకరాల భూమిని దళిత, గిరిజనులకు అమ్ముకున్నారు. అప్పట్లో ఎకరాకు రూ. వెయ్యి నుంచి 5 వేల వరకు వెచ్చించి శేరిశంకర్ తాండా, తిమ్మాయిపల్లి రైతులు కొనుక్కున్నారు. క్రయవిక్రయాల రశీదులు, భూ విక్రయ పత్రాలు గిరిజనుల వద్ద ఉన్నాయి. అయితే అక్షరజ్ఞానం పెద్దగాలేని వారు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొంతమంది అసలు పట్టానే చేయించుకోలేదు. కానీ తరతరాలుగా అదే భూమిని దున్నుకొని బతుకుతున్నారు. అత్యున్నత స్థాయి ఉద్యోగిగా ఉన్న రమణారావు విలువలకు కట్టుబడి తన తండ్రి నుంచి భూములు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న గిరిజనులకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయన అందుకు విరుద్ధంగా భూమిని అంతా ఆయన పేరుతో పట్టా చేయించుకున్నారు. రమణారావు ఉసిగొల్పిన దళారి... 2012లోనే రమణారావు తన భూమికి పి.రఘు అనే వ్యక్తికి కేర్‌టేకర్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడే ఆయన అక్రమానికి తెర లేపారు. తన భూమితోపాటు చిన్నాన్న గండ్ర సూర్యారావు భూమికి కూడా రఘు కేర్‌టేకర్‌గా ఉంటారని రాసిచ్చారు. సూర్యారావుకు కూడా 104 ఎకరాల వాటా ఉంది. ఆయనకు 4 కుమారులు, ఒక కుమార్తె ఉండగానే వారికి తెలియకుండా ఆయన సంరక్షణ బాధ్యతలు మరో వ్యక్తికి అప్పగించడంతో రమణారావు ఉద్దేశం బట్టబయలు అయింది. ఇక రఘు ఫోర్జరీ సంతకాలతో 854/14 2253/14, 3304/2014, 2254/2014, 2027/2014, 1127/2014 డాక్యుమెంట్ నంబర్లతో జై భారత్‌రెడ్డి ఆయన బంధువులకు 199 ఎకరాలు విక్రయించారు. ఇందులో 854/14, 3304/14 డాక్యుమెంట్లలో మాత్రమే రమణారావు సంతకాలు ఉన్నాయి. రఘు చేసిన ఫొర్జరీ పత్రాలను ‘సాక్షి’ సేకరించింది. 0168 పట్టా నంబర్‌తో మరో పాసు పుస్తకాన్ని సృష్టించి మరికొంత భూమిని ఆక్రమించారు. సర్వే నంబర్ 1, 2, 50లలో ఆయనకు సంబంధంలేని 14 ఎకరాల భూమిని రమణారావు పేరు మీద పట్టా చేయించి, ఆ మొత్తం భూమినీ విక్రయించారు. తాజాగా రఘు మరో 250 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ చేయించాడు. జనార్దన్‌రావుతోపాటు హక్కుదారులుగా ఉన్న వారి భూములను మింగేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఫెన్సింగ్ వేసిన భూమి రమణారావుదేనని, ఆయన చెప్తేనే ఫెన్సింగ్ చేయించానని రఘు చెబుతున్నాడు. విచిత్రం ఏమిటంటే రమణారావు వంశానికి సంబంధంలేని పల్లె పోచమ్మ తల్లి గుడి మాన్యాన్ని కూడా ఇటీవల రఘు విక్రయించారు. దీనిపై వివాదం చెలరేగటంతో రమణారావు.. స్థానిక నేతకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని కోరినట్టు తెలిసింది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నోరు మెదపకపోవడం గమనార్హం. గొల్లుమంటున్న గిరిజనులు: భూ సీలింగ్ చట్టం 1973 ప్రకారం అనంతసాగర్‌లో ప్రొసీడింగ్ నంబర్ సీఆర్/6497/1978తో సర్వే నంబర్ 24లో 6.46 ఎకరాలను ఐదుగురికి, 1985లో 2394/ఎస్జీడీ/75 ప్రొసీడింగ్ సీసీ నంబర్‌తో సర్వే నంబర్ 27లో 42.36 ఎకరాలను 41 మంది గిరిజనులకు, 1991లో సర్వే నంబర్ 27లో ప్రొసీడింగ్ నంబర్ డీ/5676/91 ఉత్తర్వుతో 22.25 ఎకరాలను 17 మంది లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి. మొత్తం 71.02 ఎకరాల్లో దాదాపు 63 మంది దళిత, గిరిజనులకు పట్టాలు చేశారు. అంతకుముందే 30 మంది రైతులకు 13/బి కింద అధికారులు ఒక్కొక్కరికి 1:10 గుంటల చొప్పున పట్టాలిచ్చారు. ఇవే పాసుపుస్తకాలను రైతులు ఏడీబీ బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలు తీసుకొని బోర్లు వేయించి, సాగు కూడా చేస్తున్నారు. తాజాగా వారిని భూముల నుంచి వెళ్లగొట్టారు. బోర్లు పూడ్చి వేయిం చారు. గత రబీ సీజన్లో పొట్టకొచ్చిన మొక్కజొన్న, పూతకొచ్చిన పత్తిని పూర్తిగా ధ్వంసం చేయించారు. ఈ దుర్మార్గాన్ని కళ్లారా చూసిన శేరిశంకర్ తండాకు చెందిన కాట్రోత్ జమ్ల, కాట్రోత్ బద్రు గుండె పగిలి చనిపోయారు. అదే భూమిలో జమ్లి, బద్రుల మృతదేహాలను ఖననం చేయగా వాటిని బయటకు తీయించి అడవిలోకి విసిరేయించినట్లు మృతుల బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. గూండాలతో కొట్టించారు మా కండ్ల ముందే పంటను దున్నేశారు. పంట పోయిందని మా అయ్య బద్రుకు గుండెపోటు వచ్చి చనిపోయిండు. మాది పట్టా భూమి. మమ్ములను గూండాలతో కొట్టించి సాగు చేసుకుంటున్న భూమి నుంచి తరిమేశారు. - కాట్రోత్ బలరాం, శేరిశంకర్ తండా మేం దున్నుకున్నది మా పట్టా భూములే మేం దున్నుకుంటున్నది మా పట్టా భూములే. ఎక్కడి నుంచి వచ్చాడోకానీ మా పంటచేలను దున్నేసి మా భూములను గుంజుకున్నడు. ఈ భూములను గుంజుకుంటే మాకు బతుకుదెరవు లేదని కాళ్లమీదపడ్డా కనికరించలేదు. - రనుజ, శేరిశంకర్ తండా నా భూమి నేను అమ్ముకుంటున్నా: రమణారావు ఈ వ్యవహారంపై జీవీ రమణారావును వివరణ కోరగా తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని అమ్ముకున్నానని, స్థానికంగా ఏం జరుగుతుందో తనకు తెలియదని చెప్పారు. గుడి భూమి అమ్మినట్టు తెలియదన్నారు. మీ చిన్నాన్న భూమికి మీరు ఎలా వారసులవుతారని అడగ్గా ఉన్నతాధికారినైన తనను ప్రశ్నించడం ఏమిటని ఎదురు ప్రశ్నించారు. దీనిపై తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేర్‌టేకర్ రఘుతో మాట్లాడగా... తాను అమ్ముతున్న భూమి జీవీ రమణారావుది మాత్రమేనని, ఆయన కేర్‌టేకర్‌గా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. రమణారావుకు 104 ఎకరాలే ఉండగా 250 ఎకరాలు ఎలా విక్రయించారని ప్రశ్నించగా నర్సింహారెడ్డి భూములు అమ్మినట్లు చెప్పారు. -
పరిటాల కాలనీ పేరుతో దందా!
అనంతపురం రూరల్ : టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కాలనీ పేరుతో కొందరు భూ దందాకు తెరదీశారు...ఇళ్ల స్థలాలు, వాటికి పట్టాలు ఇప్పిస్తాం... ప్రభుత్వం మాదేనంటూ అమాయకుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. పేదలను అడ్డంగా మోసగించారు. అధికార పార్టీ పేరుతో అరాచకాలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... కక్కలపల్లిలో సుమారు ఐదు ఎకరాలు వంక పోరంబోకు స్థలాన్ని ఓ ఐదుగురు వ్యక్తులు అధికార పార్టీ అండంతో ఆక్రమించారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి, వారికి కేటారుుంచారు. ఇలా సుమారు 150 నుంచి 200 మంది బండలు పాతి వారపాకలా ఆ స్థలంలో వేసుకున్నారు. ఐదు నెలల నుంచి ఈ దందా నడుస్తున్నా పట్టించుకోని రెవెన్యూ విభాగం సోమవారం పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగింది. అక్కడి గుడిసెలను పొక్లెరుున్తో తొలగించింది. మొదట్లో అక్కడ నివాసముండే ప్రజలు అడ్డుకున్నా...తహశీల్దార్ షేక్ మహబూబ్‌బాషా, రూరల్ సీఐ కృష్ణమోహన్ ప్రభుత్వ స్థలంలో ఇళ్లు వేయడం చట్టరీత్యా నేరమని చెప్పడంతో శాంతించారు. చివరకు పోలీసులు 200 పాకలను తొలగించారు. తహశీల్దార్‌తో పాటు ఆర్ఐ రవిశంకర్‌రెడ్డి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు. నమ్మకద్రోహమే కక్కలపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు వేయించి, అధికార పార్టీ పేరుతో నమ్మకద్రోహం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో పదుల సంఖ్యలో రూరల్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులు నరసింహులు, బండల మనోహర్, మహబూబ్ బాషా, నాగరాజు తదితరలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కొక్కరు రూ.20 వేల వరకు ఖర్చు చేసి వారపాకలు వేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ స్థలం కాదని, మంత్రికి చెప్పి పని చేయించుకుందామని భరోసా ఇచ్చారన్నారు. తీరా ఇవాళ పాకలు తొలగించడం బాధగా ఉందని బోరున విలపించారు. తమ వద్ద స్థలం ఇచ్చినందుకు కొంత ఎమౌంట్ తీసుకున్నారని ఆరోపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో కుళ్లాయప్ప, నసీర్, మనోహర్, ఫరీదా బేగం, వీ రామకృష్ణ, వై రాధాకృష్ణ, బీ ఫణికుమార్, సుశీలమ్మ, జబీనా, భాను, మాబున్ని, బాబయ్య తదితరులున్నారు. నిందితులను వదిలే ప్రసక్తి లేదు : నిందితులను వదిలే ప్రసక్తే లేదని సీఐ కృష్ణమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. తహశీల్దార్ నుంచి తమకు సూచనలందితే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూముల్లో దొంగగా ఇళ్లు వేసుకోవడం సరైన పద్ధతికాదని తెలిపారు. ఇక నుంచైనా ఆ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. బాధితుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారని ఆరోపణలు నిజమైతే కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. -
అక్రమాల చైతన్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాజీపేట సహకార హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (చైతన్యపురి కాలనీ)లో భారీగా భూముల దందా వెలుగులోకి వచ్చింది. రూ.14 కోట్ల విలువైన భూములను సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా కొందరికి కట్టబెట్టారు. సొసైటీ పరిధిలో మరో రూ.50కోట్ల విలువైన 10వేల గజాల స్థలాలు సభ్యులు కానివారి ఆధీనంలో ఉన్నాయి. మునిసిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ స్థలాల్లో వాణిజ్య భవనాలు నిర్మించారు. కాజీపేట సహకార హౌసింగ్ సొసైటీ (చైతన్యపురి కాలనీ) భూముల విషయంలో సహకార శాఖ నిర్వహించిన విచారణలో అక్రమాలు వెలుగు చూశాయి. ‘పాలకమండలి ఆమోదం లేకుండా సొసైటీ భూముల క్రయవిక్రయాలు జరిగాయి. సొసైటీలో సభ్యులు కాని వారి చేతుల్లో భూములు ఉన్నాయి. సొసైటీ ప్రాథమిక నియమావళిని పూర్తిగా ఉల్లంఘించారు. సహకార, మునిసిపల్ చట్టాలను పాతరేసి చేసిన ఈ అక్రమ నిర్మాణాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి’ అని విచారణ నివేదిక పేర్కొంది. కాజీపేట కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, చైతన్యపురి కాలనీ, కాజీపేట 1961 మే 25న రిజిస్టర్ (295టీకే) అయింది. రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ఇప్పుడు నిట్) ఎదురుగా ఉన్న ప్రధాన రహదారికి ఆనుకుని చైతన్యపురి కాలనీ ఉంది. ఆర్ఈసీ బోధన సిబ్బంది కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఏర్పడిన ఈ కాలనీలో హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం 20.32 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రభుత్వం సొసైటీకి స్థలం కేటాయించినప్పుడు ఈ ప్రాంతం సెంట్రల్ కమర్షియల్ జోన్‌గా ఉండేది. సొసైటీ విజ్ఞప్తితో పురపాలక శాఖలోని 598 ఉత్తర్వుల ప్రకారం ఈ భూములను నివాస ప్రాంతంగా మార్చారు. 1986 అక్టోబర్ 5న జరిగిన సొసైటీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం ప్రకారం సొసైటీలో అప్పటివరకు సభ్యులుగా ఉన్న139మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఒక్కో సభ్యుడికి 425 గజాల చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. ఇక్కడే భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. చైతన్యపురి కాలనీ ప్రాంతంలో నివాసం ఉండే అజ్మీరా విజయలక్ష్మీనాయక్ సొసైటీలో ఖాళీగా ఉన్న 100గజాల 47ఎ ప్లాట్‌ను తనకు కేటాయించాలని కోరగా సొసైటీ తిరస్కరించింది. ఈమె ఫిర్యాదు మేరకు సహకార శాఖ కమిషనర్ సొసైటీ అంశాలపై విచారణకు ఆదేశించారు. సహకార శాఖ 51 సెక్షన్ ప్రకారం విచారణ చేపట్టింది. 2014 జనవరి 4 నుంచి విచారణ మొదలైంది. వారం క్రితం ఈ విచారణ ముగిసింది. విచారణ నివేదిక జిల్లా సహకార అధికారికి చేరింది. విచారణలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. విచారణ నివేదిక ఆధారంగా సహకార శాఖ... పాలకమండలి బాధ్యులపై, అక్రమార్కులపై చర్యలకు సన్నద్ధమవుతోంది. రాజకీయ పలుకుబడి దండిగా ఉన్న చైతన్యపురి కాలనీ అక్రమార్కులపై ఎలాంటి చర్యలు ఉంటాయనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఏర్పడిన కాలనీలో అక్రమాలపై జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విచారణ నివేదిక సారాంశం... * సొసైటీలో సభ్యులుకాని వి.సత్యమూర్తి (కాంట్రాక్టర్), జనార్దనరెడ్డి(వ్యాపారవేత్త), మాణిక్‌లాల్ దాగా (వ్యాపారవేత్త) తదితరుల ఆధీనంలో సొసైటీకి చెందిన 10 వేల చదరపు గజాల స్థలం ఉంది. దీని విలువ రూ.50 కోట్లు ఉంటుంది. సొసైటీ నియమావళిలోని 42బీ (10) విరుద్ధంగా సొసైటీ భూములను కొనుగోలు చేసిన వీరు... పురపాలక శాఖకు సంబంధించి 598 ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వాణిజ్య భవనాలు నిర్మించారు. నివాసయోగ్యమైన ఈ సొసైటీ పరిధిలో వాణిజ్య భవనాలు నిర్మించి హోటళ్లు, ప్రైవేటు బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులకు, ఇతర వాణిజ్య అవసరాలకు అద్దెకు ఇచ్చారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఈ స్థలాలను సొసైటీ స్వాధీనం చేసుకోవాలి. * డివిజనల్ సహకార అధికారి అనుమతి లేకుండా సొసైటీ పరిధిలోని ఖాళీ స్థలాలను సొసైటీ పాలకమండలి ఎవరికీ విక్రయించకూడదు. దీనికి విరుద్ధంగా, చైతన్యపురి కాలనీలోని 750 గజాల స్థలాన్ని సొసైటీలో సభ్యుడు కాని ఎం.నర్సింహారెడ్డికి విక్రయించారు. ఇలాగే 705 గజాల స్థలం సభ్యుడుకాని నాగరాజు అనే వ్యక్తి అధీనంలో ఉంది. వీరికి ఇచ్చిన ఈ స్థలం ప్రస్తుత మార్కెట్ విలువ రూ.2.75 కోట్లు ఉంటుంది. * సొసైటీ నిబంధనల ప్రకారం కుటుంబానికి ఒక ప్లాటు మాత్రమే కేటాయించాలి. ఒక్కో సభ్యుడికి 425 చదరపు గజాల చొప్పున కేటాయించాలని నిర్ణయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీనికి విరుద్ధంగా సి.జగన్నాథరెడ్డి, వి.ఉషశ్రీలకు రెండు చొప్పున ప్లాట్లను కేటాయించారు. వీరిద్దరికీ కేటాయించిన ఈ అదనపు స్థలం మార్కెట్ విలువ ఇప్పుడు రూ.3.50 కోట్లు ఉంది. * సొసైటీలో సభ్యులుగా ఉన్న వి.సంధ్యశ్రీ, సి.రఘువీరారెడ్డి, సి.జయశ్రీ, సి.దయాకర్‌రెడ్డిలకు 800 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలాన్ని కేటాయించారు. ఇలా పరిమితి కంటే ఎక్కువగా కేటాయించిన ఈ స్థలాల మార్కెట్ విలువ ఇప్పుడు రూ.7.50 కోట్లు ఉంది.