
ప్రభుత్వ పాఠశాలలతో చెడుగుడు
హైస్కూల్లో ఉండే 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధన రద్దు
యూపీ స్కూళ్లల్లో 6–8 తరగతులకూ ఎస్‌జీటీలే
కొన్నిచోట్ల ఎలిమెంటరీ స్కూల్లోని 1, 2 తరగతులు హైస్కూళ్లకు..
గందగోళంగా జీవో 117 ప్రత్యామ్నాయ బోధన విధానాలు
ప్రైవేటు స్కూళ్లకు మేలు చేసేలా మార్పులు
తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు
సాక్షి, అమరావతి: ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4 కి.మీ. దూరంలోని హైస్కూళ్లకు వెళ్లాల్సిందే. ఇప్పటివరకు గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6నుంచి 8 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్లు ఇకపై పాఠాలు చెప్పరు. అలాగే.. హైస్కూల్లోకి మారిన 3నుంచి 5 తరగతులు అక్కడే ఉన్నా వారికి చదువు చెప్పేది ఎస్‌జీటీలే. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మారుస్తామని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం.. సర్కారీ స్కూళ్ల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయే పరిస్థితులను తీసుకొస్తోంది.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసుతో 117 జీవో రద్దు కోసం కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నాయి. విద్యా సంస్కరణల పేరుతో తాజాగా చేపట్టిన పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ, బోధన సిబ్బంది కూర్పుపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జనవరిలో ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా ఇచ్చిన తాజా ఆదేశాలు విద్యార్థులకు నష్టం చేసేలా ఉన్నాయి. 5 రకాల పాఠశాలలను పునర్ వ్యవస్థీకరిస్తామని ప్రకటించిన విద్యాశాఖ.. తాజాగా ఆరో రకం (1–10 తరగతులు) పాఠశాలలను సృష్టించింది. కొత్త నిబంధనలతో ఏ పాఠశాలలో ఏ టీచర్ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఒక్కో స్కూల్‌కు ఒక్కో విధానం
జీవో నం.117కు ప్రత్యామ్నాయంగా తాజాగా విడుదల చేసిన బోధన సిబ్బంది కేటాయింపు నిబంధనల్ని చూసి ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాథమిక (1–5) తరగతుల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్, విద్యార్థుల సంఖ్య 1:30 నిష్పత్తిలో ఉండాలి. అయితే, విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లో ఈ చట్టాన్ని కేవలం ఫౌండేషన్ స్కూల్ (1, 2 తరగతులు), బేసిక్ ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే అమలు చేస్తోంది. ఇక మోడల్ ప్రాథమిక పాఠశాలల(1 నుంచి 5)ల్లో 59 మంది విద్యార్థుల వరకు నలుగురు ఎస్జీటీలను కేటాయించింది.
ఒకవేళ మిగులు ఎస్జీటీలు అందుబాటులో ఉండి.. 50 మంది విద్యార్థులుంటే ఒక పీఎస్ హెచ్‌ఎంతో పాటు నలుగురు ఎస్జీటీలను కేటాయించింది. అంటే మోడల్ స్కూళ్లకు 1:10 ప్రకారం ఉపాధ్యాయులను ఇచ్చింది. గతంలో 120 మంది దాటితేనే హెడ్ మాస్టర్ అన్న నిబంధనను సడలించింది. గతంలో ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేస్తామని పేర్కొన్నారు. కానీ.. తాజాగా యూపీ స్కూళ్లను కొనసాగిసూ్తనే 6–8 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లను తొలగించి, వారి స్థానంలో ఎస్జీటీలను కేటాయించింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా హైస్కూళ్లల్లో 1 నుంచి 10 తరగతుల వరకు బోధన అందించనున్నారు. ఈ హైస్కూళ్లలో 1 నుంచి 5 తరగతుల వరకు బేసిక్ ప్రైమరీ పాఠశాల ఏ ర్పాటు కానుంది. ఇందులో మొదటి 10 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్‌జీటీలు (1:5 ప్రకారం), తర్వాత 1:10 నిష్పత్తిలో సిబ్బందిని కేటాయిస్తున్నారు.
తాజా నిబంధనలపై తీవ్ర విమర్శలు
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధ్యాయుల కేటాయింపులో ఏకీకృత విధానం లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైస్కూళ్లల్లో 3–4 తరగతులు ఉన్నా ఇప్పటివరకు వారికి బోధిస్తున్న సబ్జెక్టు టీచర్ విధానం రద్దు చేయడం, యూపీ స్కూళ్లలోనూ ఉన్నత తరగతులకు ఎస్‌జీటీలనే కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. కొన్ని ప్రైమరీ స్కూళ్లలో టీచర్, విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉంటే.. మరికొన్నింటిలో 1:5గా ఉంది.
ఈ ఎంపిక ఉపాధ్యాయులను అభద్రతకు గురి చేస్తోంది. ఏలూరు జిల్లాలోని ఓ హైస్కూల్లో ఉన్న బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ముగ్గురు ఎస్జీటీలు పనిచేసేలా, సమీప గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ, మరో గ్రామంలో బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 29 విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీలను కేటాయించడం గమనార్హం. ఈ ఆశాస్త్రీయ విధానాలు విద్యావేత్తల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
కొత్తగా వస్తున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లలో టీచర్లకు ఎస్జీటీలుగా పదోన్నతులు ఇచ్చి, పీఎస్ హెచ్‌ఎంలుగా నియమించాలి. స్కూల్ అసిస్టెంట్లు ఉన్నత తరగతులకు బోధించాలి. కానీ ప్రైమరీ స్కూళ్లల్లో హెచ్‌ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్లతో సర్దుబాటు చేస్తున్నట్లు విద్యాశాఖ చెప్పడం విస్మయం కలిగిస్తోంది.
అంతుబట్టని సర్కారు విధానాలు
వైఎస్సార్ జిల్లాలోని ఒక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రస్తుతం అంగన్‌వాడీ, 1, 2 తరగతులకు ఫౌండేషన్ స్కూల్, 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూల్ కొనసాగుతున్నాయి. 1, 2 తరగతులకు ఎస్‌జీటీలు బోధిస్తుండగా, మూడో తరగతి నుంచి స్కూల్ అసిస్టెంట్లు బోధిస్తున్నారు. తాజా నిబంధనలతో ఒకటి, రెండు తరగతులను హైస్కూల్లో విలీనం చేసి, ఇప్పటివరకు అదే హైస్కూల్లో ఉన్న 3–5 తరగతులు అదే ప్రాంగణంలోని ఫౌండేషన్ స్కూల్లోకి తీసుకొచ్చి, ఎస్‌జీటీతో బోధించనున్నారు. అంటే ఒకటి నుంచి 5 తరగతుల పిల్లలు వేళ్లేది హైస్కూల్‌కే అయినా చదివేది మాత్రం ప్రాథమిక పాఠశాలలోనే. దీంతో హైస్కూల్లోని సబ్జెక్ట్ టీచర్లను సర్‌ప్లస్‌గా చూపిస్తున్నారు.
ఉన్నత తరగతులు కొనసాగుతున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎస్జీటీలకు బదులు స్కూల్ అసిస్టెంట్లను ఇవ్వాలని, ఒకటి నుంచి 10 తరగతులు కొనసాగుతున్న హైస్కూళ్లలో 3వ తరగతి నుంచి గత ప్రభుత్వం జీవో 117 ద్వారా అమలు చేసిన స్కూల్ అసిస్టెంట్లతో బోధన చేయిస్తేనే విద్యార్థులు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ప్రాథమిక, యూపీ స్కూళ్లలోని విద్యార్థులు ప్రైవేటు బాటపట్టడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.