
చెరువు మట్టి తరలింపునకు వ్యతిరేకంగా అన్నదాతల నిరసనపై జులుం
అడ్డొచ్చిన ఆందోళనకారులను ఈడ్చిపడేసిన ఖాకీలు
పోలీసుల పహారాతో యథేచ్ఛగా తరలింపు
వైఎస్సార్ జిల్లాలో పోలీసులు, కాంట్రాక్టర్ల బరితెగింపు
ఖాజీపేట: చెరువులోని మట్టిని తరలించడంవల్ల తమ భూములకు నష్టం కలుగుతుందని ఎస్టీ రైతుల పోరాటం ఓవైపు.. ప్రభుత్వం అనుమతిచ్చిoది కాబట్టి చెరువు మట్టిని ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకుపోతాం అని కాంట్రాక్టర్ల బెదిరింపులతో ఆదివారం వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లె ఎస్టీ కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, ఎస్టీ కాలనీ వాసులపై దాడిచేసి అడ్డొచ్చిన వారిని ఈడ్చిపడేసి పోలీసులు కాంట్రాక్టర్లకు దన్నుగా నిలిచారు. వివరాలివీ.. జాతీయ రహదారి నిర్మాణం కోసం నాగసానిపల్లె చెరువులో నుంచి మట్టిని తరలించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిoది.
సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించుకునేందుకు అధికారులు ఓకే అన్నారు. అయితే, ఈ మట్టిని తరలించడంవల్ల చెరువుపై ఆధారపడ్డ రైతుల భూములకు నష్టం కల్గుతుందని.. సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని ఎస్టీ రైతులు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్నారు. అలాగే, చెరువు మట్టిని తరలించొద్దని ఎస్టీ రైతులు రహదారికి అడ్డుగా మట్టివేసి నిరసనకు దిగారు. కానీ, ప్రత్యేక బలగాలతో వచ్చిన పోలీసులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.
అడ్డొచ్చిన వారిని ఈడ్చిపడేశారు. నిర్దాక్షిణ్యంగా చొక్కాలు పట్టుకుని బలవంతంగా జీపు ఎక్కించే ప్రయత్నం చేశారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు వారిపై దౌర్జన్యం చేశారు. దీంతో నాగమ్మ అనే ఎస్టీ మహిళకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు. అలాగే, బలరాంనాయక్ అనే రైతుపై కూడా పోలీసుల దాడిచేయడంతో అతనికీ గాయాలయ్యాయి. పైగా అతని మెడలోని బంగారు గొలుసు మాయమైంది. వీరితోపాటు మరో ముగ్గురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. మట్టిని తరలించుకునేందుకు వీలుగా గ్రామంలో పోలీస్ పహారా ఏర్పాటుచేశారు. స్థానిక ప్రజలెవరూ అడ్డురాకుండా పోలీసులు తీవ్రస్థాయిలో గ్రామస్తులను హెచ్చరించారు. బయటకొస్తే కేసులు పెడతామని బెదిరించారు. అనంతరం కాంట్రాక్టర్లు రోడ్డుపై అడ్డుగా ఉన్న మట్టిని తొలగించి చెరువులోని మట్టిని యథేచ్ఛగా తరలించారు.
పోలీసుల దౌర్జన్యం దారుణం..
మట్టి తరలింపుతో మా పొలానికి నీళ్లువచ్చే అవకాశంలేదు కాబట్టి నిరసన తెలుపుతున్నాం. అయితే, కాంట్రాక్టర్లకు మద్దతుగా పోలీసులు మాపై దౌర్జన్యం, దాడిచేయడం దారుణం. నా మెడలో గొలుసు పోయింది. పోలీసులు కాంట్రాక్టర్లకు మేలుచేయడం మంచి పద్ధతికాదు. – బలరాంనాయక్, నాగసానిపల్లె ఎస్టీ కాలనీ
రైతులు నష్టపోయినా ఫర్వాలేదా!?
చెరువులో మట్టిని తరలించడంవల్ల మాకు పూర్తిగా నష్టం కల్గుతుందని మేం పోరాడుతున్నాం. కానీ, పోలీసులు మాత్రం కాంట్రాక్టర్ల మేలు కోరడం బాధాకరం. అంటే.. రైతులు నష్టపోయినా వారికి ఫర్వాలేదా!? – కృష్ణానాయక్, రైతు, నాగసానిపల్లె ఎస్టీ కాలనీ