
ఓలా, ఊబర్ ట్యాక్సీల తరహాలో ‘సహకార్ ట్యాక్సీ’ అనే విధానాన్ని తీసుకురావడం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్ సభలో ప్రకటించారు. ప్రజలకు స్థానిక ప్రయాణ అవసరాలను తీర్చడంలో ఇలాంటి యాప్ ల నిర్వాహకులు ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఎంతో విస్తృతంగా ఇవి సేవలందిస్తున్నాయి. అదే సమయంలో.. ఈ సంస్థలు వాహన డ్రైవర్లనుంచి భారీగా కమిషన్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి దోపిడీకి విరుగుడు అన్నట్టుగా.. అమిత్ షా ఈ విధానాన్ని ప్రకటించారు. దీనిప్రకారం స్థానికంగా సహకార సంస్థల వద్ద వాహనాల వారు రిజిస్టరు చేసుకోవాలి. నిర్వహణ మొత్తం ఆ సహకార సంస్థలే చూస్తుంటాయి. ఇది పారదర్శకంగా నడిచే అవకాశం ఉంది.
ఇదే సమయంలో చంద్రబాబునాయుడు మాటల్లోని కపటత్వం, ఆయన హైటెక్ తెలివితేటల్లోని డొల్లతనం కూడా బయటపడుతున్నాయి. ఇటీవల చంద్రబాబునాయుడు.. ర్యాపిడో అనే అగ్రిగేటర్ సంస్థతో ఒప్పందం చేసుకుని.. మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపిస్తూ ర్యాపిడో డ్రైవర్లుగా మార్చేస్తానని వారికి ఈ బైక్ లు, ఈ ఆటోలు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వం ఈ వాహనాల కొనుగోలులో ఎన్ని దందాలకు పాల్పడుతుందో తెలియదు గానీ.. మొత్తానికి ర్యాపిడో వ్యాపారాన్ని విస్తరించడానికి చంద్రబాబు తన వంతు కృషి చేయడం తప్ప కొత్తగా ఇందులో కనిపిస్తున్న సంగతేం లేదు. నిజంగా మహిళలకే మేలు చేయదలచుకుంటే.. వారికి ఈ బైకులు, ఈ ఆటోలు కొనుగోలు చేసుకోవడానికి వడ్డీలేని రుణ సదుపాయం ప్రభుత్వం కల్పించవచ్చు. వారు ర్యాపిడోకు డ్రైవర్లుగా పనిచేస్తారో మరో సంస్థకు పనిచేస్తారో వారి ఇష్టానికి వదిలేస్తే బాగుండేది.
ఒక సంస్థ దోపిడీకి ప్రభుత్వం సహకరిస్తున్నదనే ఆరోపణలు లేకుండా ఉండేవి. చంద్రబాబు అలా చేయలేదు. పైగా అమిత్ షా ప్రకటన తర్వాత.. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో అమల్లో ఉన్న కొన్ని యాప్ ల గురించి కూడా కొత్త వివరాలు తెలుస్తున్నాయి. వారు నిజంగా.. దోపిడీని అడ్డుకునే యాప్ లను తయారు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడి మమతా దీదీ ప్రభుత్వం యాత్రీ సాథీ పేరుతో ఒక యాప్ తీసుకువచ్చింది. ఇందులో కమిషన్ల రూపేణా డ్రైవర్లను దోచుకోవడం, టైమింగులను బట్టి, మొబైల్ లో చార్జింగును బట్టి ప్రయాణికులను దోచుకోవడం వంటి వక్రమార్గాలు ఉండవు. యాత్రీ సాథీ యాప్ లో రిజిస్టరు చేసుకున్న క్యాబ్ డ్రైవర్లు ఒక రోజులో తొలి పది రైడ్ లకు ఒక్కోదానికి రూ.10 వంతున చెల్లించాలి.
ఒక రోజులో ఒక రైడ్ మాత్రమే వెళితే.. 10 చెల్లిస్తే చాలు. పది రైడ్లకు రూ100 చెల్లించిన తర్వాత ఎన్ని రైడ్లు చేసుకున్నా ఆరోజుకు ఇక ఏం చెల్లించక్కర్లేదు. అలాంటి మంచి విధానం మమత ప్రభుత్వం తెచ్చింది. ఓలా, ఊబర్ దోపిడీలతో విసిగిపోయిన కర్ణాటకలోని ఆటో డ్రైవర్లు తామే స్వయంగా ఒక సాఫ్ట్ వేర్ సంస్థను ఆశ్రయించి ఒక యాప్ డిజైన్ చేయించుకున్నారు. ‘నమ్మ యాత్రి’ పేరుతో ఉండే ఆ యాప్ లో కూడా ఇదే మాదిరిగా రైడ్ లను బట్టి చెల్లిస్తే సరిపోతుంది.
నిజం చెప్పాలంటే.. టెక్నాలజీ మీద అవగాహన ఉండే పాలకులైతే ఇలాంటి కొత్త విధానాలు తీసుకురావడం ద్వారా.. అటు వాహన డ్రైవర్లు, ఇటు ప్రయాణికులు అగ్రిగేటర్ సంస్థల దోపిడీకి గురికాకుండా చూసుకోవాలి. కానీ చంద్రబాబు తనను తాను హైటెక్ ముఖ్యమంత్రి అని చాటుకుంటూ ఉంటారు. కంప్యూటరును నేనే కనిపెట్టానని చెప్పుకుంటూ ఉంటారు. ఏఐను తానే కనుగొని ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని కూడా చెప్పుకోగలరు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి.. తిరిగి అగ్రిగేర్ సంస్థకు దోచిపెట్టే ఒప్పందమే చేసుకుంటున్నారు. ఆయన చెప్పుకునే హైటెక్ తెలివితేటల్లో డొల్లతనం బయటపడుతోందే తప్ప.. మంచి నాణ్యమైన ఆలోచన చేయలేకపోతున్నారనే విమర్శలు ప్రజల్లో వినవస్తున్నాయి.
..ఎం. రాజేశ్వరి