
సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలు తగ్గడం లేదు. ఎండ మంటలు చల్లారడం లేదు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. గురు, శుక్రవారాల్లో వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 15, పార్వతీపురం మన్యంలో 8, శ్రీకాకుళంలో 5, ప్రకాశంలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
పల్నాడు జిల్లాలో 21, ప్రకాశం 18, ఏలూరు 18, తూర్పుగోదావరి 17, నెల్లూరు 16, గుంటూరు 16, అనకాపల్లి 15, శ్రీకాకుళం 15, కాకినాడ 13, తిరుపతి 12, కృష్ణా 11, ఎన్టీఆర్ 11, బాపట్ల 11, విజయనగరం 10, అల్లూరి సీతారామరాజు 9, కోనసీమ 9, పార్వతీపురం మన్యం 7, వైఎస్సార్ 5, విశాఖపట్నం 1, అనంతపురం 1, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 121 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు.
నిప్పులుగక్కిన ఎండ
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కూడా ఎండ నిప్పులుగక్కింది. పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగానెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5, వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.9, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 44.5, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించారు.
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 118 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు.