
పార్టీ ఎంపీటీసీ తల్లి, భార్యకే టీడీపీ సభ్యత్వం ఇచ్చిన వైనం
విషయం తెలిసి సభ్యత్వ పత్రాలను చింపివేసిన మహిళలు
కె. కోటపాడు (అనకాపల్లి జిల్లా): బీమా పేరుతో వైఎస్సార్‌సీపీ కుటుంబాలను, కార్యకర్తలను మోసం చేసే పథక రచనకు తెలుగుదేశం శ్రీకారం చుట్టినట్లు కనబడుతోంది. పార్టీ ఎంపీటీసీ లేని సమయంలో ఆ నాయకుని ఇంటికే వెళ్లి, ఆయన తల్లి, భార్యకు టోకరా వేసి టీడీపీ సభ్యత్వం అంటగట్టిన వైనం అనకాపల్లి జిల్లా, కె. కోటపాడు మండలం, కొరువాడలో చోటుచేసుకుంది.
విషయం తెలిసిన సదరు మహిళలు దేశం సభ్యత్వ పత్రాలను చించి వేయడంతో పచ్చనేతల బండారం బట్టబయలైంది. సీహెచ్ కార్తీక్ అనే వ్యక్తి, కొరువాడ ఎంపీటీసీ చీపురపల్లి అచ్చిబాబు ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటికి వెళ్లాడు. ‘రూ.100 చెల్లిస్తే, రూ.5,00,000 బీమా’అంటూ అచ్చిబాబు తల్లి చిన్న, భార్య లక్ష్మిలకు నమ్మబలికాడు.
చెరో రూ.వంద, ఆధార్, ఫొటోలు తీసుకుని వెళ్లిపోయాడు. తర్వాత ఆన్‌లైన్‌లో తమ తెలుగుదేశం సభ్యత్వ పత్రాలు వైరల్ అవడంతో జరిగింది అర్థం చేసుకుని వైఎస్సార్‌సీపీ నాయకుడి కుటుంబం అవాక్కయ్యింది. దీనిపై అచ్చిబాబు గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డౌన్‌లోడ్ చేసుకున్న టీడీపీ సభ్యత్వ పత్రాలను అచ్చిబాబు తల్లి, భార్య చించివేశారు.