
వేధింపులతోనే రైతు ఆత్మహత్య
మదనపల్లె : స్థానిక నాయకుల వేధింపులు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని, మా కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేయాలని బాధితులు కోరారు. వాల్మీకిపురం మండలం టేకులకోన వద్ద గురువారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్న రైతు వెంకటాద్రి కుమారుడు యువరాజు, కుమార్తె మీనా మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్‌ను ఆశ్రయించారు. మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో వారు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. తమ తాత లక్ష్మయ్య సైనికుడిగా పని చేసి పదవీ విరమణ చేయడంతో 1975లో.. వాల్మీకిపురం మండలం మూరేవాండ్లపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 1051 లో 5.51 ఎకరాల భూమి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. స్థానికుల ఆక్రమణలతో కేవలం రెండు ఎకరాలు మాత్రమే తమకు మిగిలిందని, ఆ భూమిపై ఆధారపడి జీవిస్తున్నామని ఫిర్యాదులో తెలిపారు. తాత లక్ష్మయ్య మృతి చెందడంతో సదరు భూమిని తమ తండ్రి వెంకటాద్రి తన పేరుపై ముటేషన్ చేయాల్సిందిగా తహసీల్దార్ పాములేటి, వీఆర్వో వెంకటేశ్వర్‌రెడ్డిలను ఆశ్రయించినా వారు నిర్లక్ష్యం చూపారన్నారు. స్థానిక నాయకులు నారాయణరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మదనారెడ్డి తాము సాగు చేసుకుంటున్న భూమిపై వివాదం సృష్టించారన్నారు. తహసీల్దార్ పామిలేటి వారికే వత్తాసు పలకడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన తమ తండ్రి వెంకటాద్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సబ్ కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ స్పందిస్తూ.. ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమని, మీ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మీరు సాగు చేసుకుంటున్న భూమి కుంట పోరంబోకుగా ఉందని, నిబంధనల ప్రకారం పట్టా ఇవ్వడం కుదరదని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సాగుకై ప్రత్యామ్నాయ భూమిని గుర్తించి ఇస్తామన్నారు. మీ కుటుంబానికి అన్యాయం జరగకుండా భూమి అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుని, భూ కేటాయింపుకు అర్హులుగా గుర్తిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. ఆత్మహత్య ఘటనపై క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ చేసి బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు, మాజీ సైనికులు మదన్మోహన్ రెడ్డి, సిపాయి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ వివరణ
కలికిరి(వాల్మీకిపురం) : రైతు ఆత్మహత్యపై స్పందించిన తహసీల్దారు పామిలేటి ప్రకటన విడుదల చేశారు. బాధితుడు వెంకటాద్రి తనకు పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసి ఉండటం జరిగిందని, పరిశీలించిన మునుపటి రెవెన్యూ అధికారులు తాటిగుంటపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1051 రెవెన్యూ రికార్డుల మేరకు కుంట పొరంబోకు భూమిగా ఉండటంతో పట్టా ఇవ్వడం కుదరదని ఎండార్స్‌మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే భవిష్యత్తులో అసైన్‌మెంట్ కమిటీలకు మృతుడి కుటుంబం దరఖాస్తు ఉంచి, అప్పటి ప్రభుత్వ నింబంధనలు, కుటుంబ అర్హత మేరకు దరఖాస్తు పట్టా మంజూరుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
ఆరుగురిపై కేసు నమోదు
రైతు వెంకటాద్రి ఆత్మహత్యపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు తహసీల్దారు పామిలేటిని ఆదేశించారు. కాగా మృతుని కుమారుడు సి.యువరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దవంకపల్లికి చెందిన నారాయణరెడ్డి, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఏపీటీయుఎస్ హోమ్ లోన్స్ పీలేరు బ్రాంచ్ మేనేజరు మణికంఠ, తహసీల్దారు పామిలేటిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
న్యాయం కోసం
బాధిత కుటుంబం వేడుకోలు
సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
అండగా నిలిచిన
మాజీ సైనిక సంక్షేమ సంఘం