
భారతదేశం గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా నిలదొక్కుకుంటున్నందున ప్రభుత్వం ఉద్యోగ కల్పన, మూలధన వ్యయం (క్యాపెక్స్) అనే రెండు కీలక లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన వైఖరితో కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) వంటి ప్రస్తుత పథకాల ఫలితాలను పరిగణలోకి తీసుకొని కొత్త విధానంలో పరిమితులను పెంచేలా నిర్ణయాలు తీసుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ తయారీలో భారతదేశ వాటాను పెంచుతూ దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నందున ఈ వ్యూహాత్మక మార్పు అవసరమని భావిస్తున్నారు. దీన్ని రూపొందించడంలో కీలక అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
తయారీలో పురోగతి
భారత్ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారం, పీఎల్‌ఐ పథకం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్పాదక శక్తి కేంద్రంగా మారాలని దీర్ఘకాలిక లక్ష్యంగా ఏర్పరుచుకుంది. అందుకోసం కొన్ని విజయాలు సాధించినప్పటికీ ప్రస్తుత ప్రయత్నాలు ఆశించిన ఆర్థిక పరివర్తనను పూర్తిగా అందించలేదు. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రూపొందించిన పీఎల్ఐ పథకం నిర్దిష్ట విభాగాల్లో ప్రొడక్షన్‌ను పెంచింది. కానీ, చైనా వంటి ప్రపంచ పోటీదారులకు ధీటుగా అవసరమైన విస్తృతమైన పారిశ్రామిక వృద్ధిని సృష్టించడంలో విఫలమైంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఉత్పత్తి లక్ష్యాల కంటే ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చే కొత్త విధానాన్ని తీసుకురావాలని పరిశీలనలో పడింది.
పెద్ద మొత్తంలో ఉద్యోగాలు..
కొత్తగా రానున్న విధానానికి ఉపాధి కల్పన కీలకం కానుంది. దేశంలో పెరుగుతున్న యువ శ్రామిక శక్తితో స్థిరమైన, మంచి వేతనంతో ఉద్యోగాలను సృష్టించడం చాలా ముఖ్యం. ఇది ఆర్థిక అవసరంతోపాటు పార్టీలకు అతీతంగా రాజకీయంగా కూడా లబ్ధి చేకూరే అంశం. దేశంలో కొన్ని పరిశ్రమలు లక్షలాది మందికి ఉపాధిని అందించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, తోలు వస్తువులు.. వంటి తయారీ పరిశ్రమలు పెద్దమొత్తంలో ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతాయి. వీటికి ప్రోత్సాహకాలను అనుసంధానం చేయడం ద్వారా నిరుద్యోగాన్ని తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో దీనివల్ల భారీగా లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తుంది.
ఇదీ చదవండి: తెల్లవారితే మారే రూల్స్ ఇవే!
మూలధన వ్యయానికి పెద్దపీట
మెరుగైన ఉత్పాదకతకు పటిష్టమైన మౌలిక సదుపాయాలు అవసరం. దీన్ని గ్రహించిన ప్రభుత్వ వర్గాలు మూలధన వ్యయానికి పెద్దపీట వేసింది. కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు, విద్యుత్ సరఫరా వ్యవస్థల్లోకి గణనీయమైన పెట్టుబడులను మళ్లించాలని భావిస్తుంది. క్యాపెక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, సరఫరా గొలుసు సామర్థ్యాన్ని మెరుగుపరచడం, భారతీయ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెరిగేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త విధానంలో భాగంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలకు మరింత మూలధనాన్ని సమకూర్చవచ్చు. ఇది ప్రైవేట్ పెట్టుబడులు పెంచుతూ ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతుందని భావిస్తున్నారు.