
మొత్తం 655 ఫ్లాట్లు.. అన్నీ 4BHKలే..
వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల చ.అ. అభివృద్ధి లక్ష్యం
ఎంఎస్‌ఎన్ గ్రూప్ సీఎండీ ఎంఎస్‌ఎన్ రెడ్డి వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎంఎస్‌ఎన్ రియాల్టీ అద్భుతమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నియోపోలిస్ ప్రాంతంలో అల్ట్రా లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్‌ను ‘వన్’ను నిర్మించనుంది. 7.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,750 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది.
40 లక్షల చ.అ.లలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో 5 టవర్లు, ఒక్కోటి 55 అంతస్తుల్లో ఉంటుంది. 5,250 చ.అ. నుంచి 7,460 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 655 యూనిట్లు ఉంటాయి. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను సంస్థ సీఎండీ ఎంఎస్‌ఎన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్నీ 4 బీహెచ్‌కే యూనిట్లే ఉండే ఈ ప్రాజెక్ట్‌లో చ.అ. ధర రూ.11 వేలుగా
ఉంటుంది. ప్రతి అపార్ట్‌మెంట్‌కు రెండు బాల్కనీలు, లార్జ్ డెక్ ఉంటుంది. గండిపేట చెరువు వ్యూ ఉండే ఈ ప్రాజెక్ట్‌లో 1.8 లక్షల చ.అ. విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ఉంటుంది.
ఇందులో 30కి పైగా ఆధునిక వసతులు ఉంటాయి. మూడు స్విమ్మింగ్ పూల్స్, యోగా డెక్, స్కై సినిమా, ఆక్వా జిమ్, వెల్‌నెస్, లైఫ్‌స్టైల్ జోన్లతో పాటు బ్యాడ్మింటన్, స్క్వాష్, పికిల్‌బాల్, ప్యాడిల్ బాల్ కోర్టులు, బౌలింగ్ అల్లే, క్రికెట్, ఫుట్‌బాల్, గోల్ఫ్ కోసం ప్రత్యేక సిమ్యులేటర్లు ఉంటాయని ఆయన వివరించారు. నగరంలో వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల చ.అ.లలో ప్రాజెక్ట్‌లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.