
అమెరికా విధించిన సుంకాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని విభిన్న సెక్టార్లలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. అయితే భారతీయ తోలు(లెదర్) పరిశ్రమ యూఎస్‌కు తన ఎగుమతులను విస్తరించడానికి ఈ సుంకాలు ఎంతో అవకాశాన్ని కల్పించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో భారత్ 870 మిలియన్ డాలర్ల(సుమారు రూ.7,221 కోట్లు) విలువైన తోలు, తోలు ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇండియన్ లెదర్ వస్తువులకు అమెరికాలో ఉన్న మార్కెట్‌ను ఈ గణాంకాలు హైలైట్ చేస్తున్నాయి.
ఈ విభాగంలో భారత్‌కు పోటీగా ఉన్న వియత్నాం, చైనా, కంబోడియా వంటి దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం ఈ అవకాశాన్ని ప్రేరేపించే ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. భారత్‌పైనా యూఎస్ సుంకాలు ఉన్నప్పటికీ ఇక్కడి ఎగుమతులపై విధించిన సుంకాల కంటే కనీసం 20% అధిక సుంకాలను ఆయా దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఇది భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, యూఎస్ మార్కెట్‌లో వారి పట్టును బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుంది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఐఈఓ) మాజీ వైస్ ప్రెసిడెంట్, ఫరీదా గ్రూపు ఉన్నతాధికారి ఇస్రార్ అహ్మద్ మాట్టాడుతూ.. ‘తోలు పరిశ్రమ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భారతీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారించాలి. తమ మార్కెట్ పరిధిని వైవిధ్యపరచుకోవడంపై ఆసక్తిగా ఉండాలి’ అన్నారు.
ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?
పరిమిత సమయమే..?
పోటీ దేశాలు అమెరికా సుంకాలు విధించినంత మాత్రాన నిమ్మకుండిపోకుండా ఆ దేశంతో చర్చలు జరిపి తమ రేట్లను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాంతో వృద్ధిని కొనసాగించడానికి ఈ టారిఫ్ ప్రయోజనం ఆరు నుంచి తొమ్మిది నెలలకు మించకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. భారతీయ తోలు పరిశ్రమ దాని బలమైన సరఫరా గొలుసును ఆసరాగా చేసుకుని నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని చెబుతున్నారు.