
అమెరికా టారిఫ్‌లు వడ్డిస్తే దేశీ ఫార్మాకు సవాళ్లు
గ్లాండ్ ఫార్మా, జైడస్ తదితర సంస్థలపై ప్రభావం
అటు యూఎస్‌ఏలో ఔషధాల రేట్లకు రెక్కలు
మినహాయింపుల కోసం చర్చలపై ఆశలు
సాక్షి బిజినెస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై ఇతరత్రా రంగాల్లాగే భారత ఫార్మా కంపెనీలకూ టెన్షన్‌గానే ఉంది. ఎందుకంటే మన ఫార్మా కంపెనీల ఎగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా అమెరికాదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరం ఆ దేశానికి భారత ఫార్మా ఎగుమతులు 16 శాతం పెరిగి దాదాపు 9 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతయ్యే ఔషధాలు సుమారు 800 మిలియన్ డాలర్లే. అమెరికాకు మన చౌక ఔషధాల అవసరం ఎంత ఉందో, మనకూ కీలకమైన అమెరికా మార్కెట్ అవసరం అంతగానూ ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
దీంతో సుంకాల వడ్డింపనేది ఎవరికి లాభదాయకం, ఎవరికి నష్టదాయకమనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలోలాగే ఫార్మా మీద టారిఫ్‌పై ఇరు దేశాలు మళ్లీ సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు. అమెరికా హెల్త్‌కేర్ వ్యవస్థలో మన జనరిక్స్‌కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మినహాయింపుల కోసం భారత్ ప్రయత్నించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాయి.
సవాళ్ల మధ్య అవకాశాలు..
వాస్తవానికి చైనాలాంటి దేశాలపై ప్రధాన దృష్టితో టారిఫ్‌లను ప్రతిపాదించినప్పటికీ అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న మన ఫార్మాపైనా ప్రభావం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా నుంచి ఔషధాల దిగుమతులపై భారత్ 10% సుంకాల వరకు విధిస్తుండగా, మన ఎగుమతులపై అక్కడ టారిఫ్‌లు లేవు. ఒకవేళ ప్రతీకారంగా మనలాగే టారిఫ్ విధించినా సుమారు 10% స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు.
గ్లాండ్ ఫార్మా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, జైడస్, లుపిన్‌లాంటి ఫార్మా కంపెనీల ఆదాయాల్లో అమెరికా వాటా సుమారు 50–37% వరకు ఉండటంతో వాటిపై టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఒకవేళ భారాన్ని కస్టమర్లకు బదలాయించకపోతే వివిధ కంపెనీల స్థూల లాభంపై సుమారు 12% వరకు ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అదే 50% బదలాయిస్తే, ఇది 7% దాకా ఉండొచ్చు.
మొత్తం మీద ఆదాయనష్టంతో పాటు మిగతా దేశాలతో పోటీపడి మార్కెట్‌ను నిలబెట్టుకోవడం కష్టంగా మారుతుంది. దేశీ ఫార్మాకు కాస్త కలిసి వచ్చే అంశాలూ ఉన్నాయి. అమెరికా మీదే ఆధారపడకుండా మన కంపెనీలు ఇతర మార్కెట్లకూ విస్తరించవచ్చు. అలాగే, అంతర్జాతీయంగా ఇతర దేశాల కంపెనీలతో దీటుగా పోటీపడేలా ఆర్‌అండ్‌డీ సామర్థ్యాలను పెంచుకోవచ్చు.
అమెరికాపై ఎఫెక్ట్ ..
ఫార్మా దిగుమతులపై టారిఫ్‌లతో అమెరికాకూ కొన్ని ప్రతికూలతలు తప్పవు. భారతీయ జనరిక్స్‌పై సుంకాల వడ్డింపు వల్ల, ఫార్మా కంపెనీలు ఔషధాల రేట్లను పెంచితే, అమెరికా వినియోగదారులకు మందుల ఖర్చులు పెరిగిపోతాయి. ఇక, మన ఫార్మాపై అమెరికా భారీగానే ఆధారపడుతోంది. టారిఫ్‌లతో సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడి, ఔషధాలకు కొరత నెలకొనవచ్చు. ఫలితంగా పేషెంట్లకు చికిత్స విషయంలో సమస్యలు ఏర్పడవచ్చు.
అటు అమెరికాకూ కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. టారిఫ్‌తో ఇతర దేశాల ఫార్మా కంపెనీలు అమెరికాలోనూ తయారీ కార్యకలాపాలు చేపట్టే పరిస్థితి ఏర్పడవచ్చు. దీంతో, దేశీయంగా తయారీకి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది. అలాగే దిగుమతి చేసుకునే ఔషధాల నాణ్యతపరమైన సవాళ్లకు చెక్ పెట్టేలా, దేశీయంగా తయారీ ప్రమాణాలపై అమెరికా మరింత నియంత్రణ సాధించవచ్చు.