డైరెక్ట్‌ ప్లాన్లలో ఎస్‌డబ్ల్యూపీ, ఎస్‌టీపీ ఎలా..? | What is the different between SIP, SWP and STP | Sakshi

డైరెక్ట్‌ ప్లాన్లలో ఎస్‌డబ్ల్యూపీ, ఎస్‌టీపీ ఎలా..?

Feb 26 2024 7:02 AM | Updated on Feb 26 2024 7:05 AM

What is the different between SIP, SWP and STP - Sakshi

డైరెక్ట్‌ ప్లాన్లలో నేను ఇన్వెస్ట్‌ చేస్తే.. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ (ఎస్‌టీపీ)లను ఏర్పాటు చేసుకునే సేవలను ఫండ్‌ సంస్థ అందిస్తుందా? – విజయ్‌ కుమామ్‌ 

డైరెక్ట్‌ ప్లాన్లు అనేవి ఇన్వెస్టర్లు స్వయంగా నిర్వహించుకునేవి. డైరెక్ట్‌ ప్లాన్లకు సంబంధించి పెట్టుబడులు, ఇతర లావాదేవీలను ఇన్వెస్టర్‌ రెండు మూడు మార్గాల్లో నిర్వహించుకోవచ్చు. సిప్‌ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా మరే ఇతర లావాదేవీ అయినా బ్రిక్స్‌ అండ్‌ మోర్టార్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వినియోగించి చేసుకోవాలి. అంటే ఫండ్‌ హౌస్‌ రిజిస్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్లు అయిన కేఫిన్‌టెక్, క్యామ్స్‌ ద్వారా ఈ లావాదేవీలు చేసుకోవచ్చు.

సమీపంలోని ఇన్వెస్టర్‌ సర్వీస్‌ సెంటర్‌కు స్వయంగా వెళ్లి సిప్‌ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా ఎస్‌టీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్‌ హౌస్‌ వెబ్‌సైట్‌ నుంచి కూడా చేసుకోవచ్చు. కొన్ని ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌లు సైతం డైరెక్ట్‌ ప్లాన్లకు సంబంధించి ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ సదుపాయాల ద్వారా ఇన్వెస్టర్లు సొంతంగా ఈ లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. ఫండ్‌ హౌస్‌ సంస్థ నేరుగా సాయం అందించదు.  

నేను కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్‌ ఫండ్‌ యుటిలిటీస్‌ అనే ప్లాట్‌ఫామ్‌ను ఇందుకోసం వినియోగిస్తున్నాను. ఇది ఎంతో సౌకర్యంగా ఉండడమే కాకుండా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో లావాదేవీలను ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. నెట్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల నిర్వహణ తెలిసిన అందరికీ ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ లావాదేవీల నిర్వహణ సౌకర్యంగానే ఉంటుంది. కాకపోతే మొదట కేవైసీ, ఇతర అవసరాలను ఇచ్చే సమయంలో కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు. వీటిని సైతం ఇంటి నుంచే చేసుకునే సౌలభ్యం ఉంది. డైరెక్ట్‌ ప్లాన్లకు సంబంధించి సేవలను ఇన్వెస్టర్లు సులభంగా ఆన్‌లైన్‌ ద్వారా పొందొచ్చు.     

నేను ఎన్‌పీఎస్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా వయసు 54 ఏళ్లు. ఈక్విటీలకు 50 శాతం, ప్రభుత్వం బాండ్లకు 25 శాతం, కార్పొరేట్‌ బాండ్లకు 25 శాతం చొప్పున నా పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్‌ అలోకేషన్‌) ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నా ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుని.. కార్పొరేట్‌ బాండ్లలో పెట్టుబడులను 40 శాతానికి పెంచుకోవడం సరైనదేనా..? – మనోరంజన్‌
 
 గిల్ట్‌ ఫండ్స్‌ లేదా ప్రభుత్వ బాండ్లలో అస్థిరతలు.. షార్ట్‌ డ్యూరేషన్‌ లేదా కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌తో పోలిస్తే సహజంగా ఎక్కువే. ఎందుకంటే గిల్ట్‌ ఫండ్స్‌ అన్నవి ప్రధానంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఇవి వడ్డీ రేట్ల మార్పులకు ఎక్కువ ప్రభావితమవుతూ ఉంటాయి. అదే సమయంలో కార్పొరేట్‌ బాండ్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో క్రెడిట్‌ రిస్క్‌ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. స్వల్పకాలంలో ప్రభుత్వ బాండ్లు మరింత అస్థిరతలను ఎదుర్కొంటాయి.

దీర్ఘకాలంలో ఇవి కనుమరుగు అవుతాయి. మూడు, ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ మాదిరే గిల్ట్‌ ఫండ్స్‌ కూడా రాబడులు ఇచ్చాయి. ఎన్‌పీఎస్‌ టైర్‌ 1 ఖాతాలో మీ పెట్టుబడులు 60 ఏళ్ల వరకు లాకిన్‌ అయి ఉంటాయి. అంటే మరో ఆరేళ్ల సమయం మీకు మిగిలి ఉంది. మీరు డెట్‌కు కేటాయించిన మొత్తంలో సగాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టినా.. అవి మొత్తం పెట్టుబడుల్లో 25 శాతమే. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకోవాలని అనుకుంటే.. తర్వాత ఏదో ఒక సమయంలో మళ్లీ  ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో యాక్టివ్‌గా పనిచేయాల్సి రావచ్చు. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నారు. కార్పొరేట్‌ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవడం అంటే రిస్క్‌ కొంచెం తీసుకున్నట్టే అవుతుంది. కనుక మీ పెట్టుబడులను యథాతథంగా కొనసాగించుకోవచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement