
భార్య ప్రవర్తనపై అనుమానంతో ఓ భర్త ఆమెను కడతేర్చాడు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలో కామిశెట్టి దేవరాజు అలియాస్ విగ్గురాజు, సుబ్బలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు.
తాడేపల్లిగూడెం అర్బన్(పశ్చిమగోదావరి): భార్య ప్రవర్తనపై అనుమానంతో ఓ భర్త ఆమెను కడతేర్చాడు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలో కామిశెట్టి దేవరాజు అలియాస్ విగ్గురాజు, సుబ్బలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేయడంతో ఉద్యోగం చేసి వాటిని తీర్చేందుకు సుబ్బలక్ష్మి (38) కొన్నేళ్ల క్రితం దుబాయ్ వెళ్లింది. ఇటీవల దుబాయి నుంచి తిరిగొచ్చింది. కొద్ది రోజులుగా సుబ్బలక్ష్మికి ఫోన్‌కాల్స్ ఎక్కువగా వస్తుండటంతో భర్త విగ్గురాజు దీనిపై నిలదీశాడు. సుబ్బలక్ష్మి సరైన సమాధానం చెప్పకపోవడంతో కొన్ని రోజులుగా గొడవలు పడుతున్నారు.
చదవండి: నన్నే మోసం చేస్తావా.. ప్రియుడిని చితక్కొట్టిన యువతి.. చివరకు
ఈ నేపధ్యంలో మంగళవారం అర్ధరాత్రి ఇలాగే గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో విగ్గురాజు ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో భార్య సుబ్బలక్ష్మిపై దాడిచేసి విచక్షణా రహితంగా గుండె, కడపులోను పొడిచాడు. సుబ్బలక్ష్మి కేకలు వేయగా, సమీపంలో ఉన్న బంధువులు వచ్చి చూసేసరికి కిందపడి ఉంది. ఆమెను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న సుబ్బలక్ష్మి అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పట్టణ ఎస్సై జీజే ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.