సుస్థిర అఫ్గాన్‌కు దారి | Sakshi Editorial On New Delhi Declaration On Afghanistan | Sakshi

సుస్థిర అఫ్గాన్‌కు దారి

Nov 11 2021 12:46 AM | Updated on Nov 11 2021 9:47 AM

Sakshi Editorial On New Delhi Declaration On Afghanistan

అఫ్గానిస్తాన్‌పై బుధవారం వెలువడిన న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ఆ దేశంలోని వర్తమాన స్థితిగతులకు అద్దం పట్టింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ఎనిమిది దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. తమ దేశంలో పరిస్థితులు భేషుగ్గా ఉన్నాయని అధికారం చెలాయిస్తున్న తాలిబన్‌లు చెప్పుకుంటున్నారు. శాంతిభద్రతలను కాపాడ టంలో విజయం సాధించామంటున్నారు. ఆఖరికి న్యూఢిల్లీ డిక్లరేషన్‌పై స్పందించిన సందర్భంలో సైతం తాలిబన్‌ల ప్రతినిధి దాన్నే పునరుద్ఘాటించారు.  కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.  ఆ దేశం నుంచి అమెరికా నిష్క్రమించి మూడు నెలలు కావస్తోంది. అప్పటినుంచీ మహిళలపై కొన సాగుతున్న దుండగాలకు లెక్క లేదు. వారిని ఇళ్లకే పరిమితం చేశారు.

ఉద్యోగాల నుంచి తొలగిం చారు. ధిక్కరించినవారిని కాల్చిచంపుతున్నారు. పాలనలో మహిళలు, మైనారిటీలతోసహా అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పిస్తామని తాలిబన్‌లు చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. దశా బ్దాలుగా పాలనతోసహా భిన్న రంగాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న హజారా, ఉజ్బెక్‌ తెగలను పూర్తిగా పక్కనపెట్టారు. ఉగ్రవాదానికి తమ గడ్డపై చోటుండదని ప్రకటించినా దేశ రాజధాని కాబూల్, కుందుజ్, కాందహార్‌లతోసహా అనేకచోట్ల ఐఎస్‌ ఉగ్రవాదులు తరచుగా నరమేథం సాగి స్తూనే ఉన్నారు. తాలిబన్‌లు కూడా ఏమంత మెరుగ్గా లేరు. అనాగరికమైన మరణదండనలు అమలు చేస్తున్నారు. అన్నిటికీ మించి ఆ దేశం ఆర్థికంగా పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఐక్య రాజ్యసమితి లెక్క ప్రకారం 2.30 కోట్లమంది పౌరులు ఆకలితో అలమటిస్తున్నారు. వీటిని అఫ్గాన్‌ ఆంతరంగిక వ్యవహారంగా పరిగణించి ప్రపంచం ప్రేక్షక పాత్ర వహించలేదు. ఇది దీర్ఘకాలం కొన సాగితే... అంతర్యుద్ధంగా మారితే ఇరుగుపొరుగు దేశాలకూ, తరువాత మొత్తంగా మధ్య ఆసియా ప్రాంతానికీ, అంతిమంగా ప్రపంచ దేశాలకూ పెద్ద తలనొప్పిగా పరిణమిస్తుంది. రెండు దశాబ్దాల పాటు ఆ దేశాన్ని గుప్పిట బంధించి వర్తమాన దుస్థితికి కారణమైన అమెరికా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. అఫ్గాన్‌కొచ్చే ముప్పేమీ లేదని, అది సవ్యంగానే మనుగడ సాగిస్తుందని అమెరికా చేసిన ప్రకటనలు వంచన తప్ప మరేమీ కాదని అది నిష్క్రమించిన క్షణాల్లోనే రుజువైంది. 

అఫ్గాన్‌ దుస్థితిపై మన దేశం మాత్రమే కాదు...దానికి పొరుగునున్న రష్యా, ఇరాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్‌ వంటివి సైతం కలవరపడుతున్నాయి. గతంలో తాలిబన్‌లు ఏలికలుగా ఉన్నప్పుడు కలిగిన చేదు అనుభవాల పర్యవసానంగా వారితో చర్చించడానికి  మన దేశం మొదట్లో సిద్ధపడని మాట వాస్తవం. కానీ ఆ తర్వాత మనసు మార్చు కుంది. సెప్టెంబర్‌ 1న ఖతార్‌లోని దోహాలో తాలిబన్‌లతో మన ప్రతినిధులు మాట్లాడగలిగారు. గత కొన్నేళ్లుగా అఫ్గాన్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్న మన దేశంపై వారి వైఖరి మారినట్టే కనబడింది. మాటల వరకూ అయితే ఇప్పటికీ వారు అలాగే చెబుతున్నారు. కానీ వారిని వెనకుండి నడిపిస్తున్న పాకిస్తాన్‌ తీరుతెన్నులపై భారత్‌కు సందేహాలున్నాయి. నిజానికి తాజా సదస్సు హఠాత్తుగా ఊడిపడింది కాదు. ఆ దేశంనుంచి తాము నిష్క్రమించదల్చుకున్నట్టు తొలిసారి 2018లో అమెరికా ప్రకటించినప్పుడు ఇరాన్‌ చొరవతో, రష్యా తోడ్పాటుతో తొలి సదస్సు జరిగింది. ఆ మరుసటి ఏడాది సైతం ఇరానే సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది.

ప్రస్తుత సదస్సు ఆ క్రమంలో మూడోది. భారత్‌ హాజరైతే తాము రాబోమని పాకిస్తాన్‌ తొలి సదస్సు సమయంలోనే చెప్పింది. ఈ పరిస్థితుల్లో అఫ్గాన్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయాలని నిజంగా తాలిబన్‌లు కోరుకుంటున్నట్టయితే అది కేవలం వారి వల్ల మాత్రమే అయ్యే పనికాదు. విధ్వంసకర ఘటనలతో, బెదిరింపులతో ఉగ్ర వాద ముఠాలు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. మాదకద్రవ్యాలను దూరతీరాలకు తరలిస్తూ వేల కోట్లు నిధులు ఆర్జిస్తున్నాయి. మారణాయుధాలు పోగేస్తున్నాయి. ఈ ముఠాలను అదుపు చేయా లన్నా, చుట్టుముట్టిన సంక్షోభాలనుంచి గట్టెక్కాలన్నా ప్రపంచ దేశాల సహకారం అత్యవసరం. పారదర్శకంగా వ్యవహరించడం నేర్చుకుని అన్ని వర్గాలకూ పాలనలో భాగస్వామ్యం కల్పిస్తే... మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులకు పూచీపడితే ఉగ్రవాద ముఠాల ఆగడాలు అంతమవు తాయి. తమకు ప్రభుత్వం నుంచి రక్షణ దొరుకుతుందన్న భరోసా ఉంటే సాధారణ ప్రజానీకం ఉగ్రవాదులను తరిమికొట్టడానికి సిద్ధపడతారు. తాలిబన్‌లు వచ్చాక సాయం ఆపేసిన ప్రపంచ దేశాలు సైతం పునరాలోచన చేస్తాయి.

అఫ్గాన్‌ విషయంలో ఐక్యరాజ్యసమితి కీలక పాత్ర పోషించాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ఇచ్చిన పిలుపు అర్ధవంతమైనది. మొదట్లోనే అటువంటి అంతర్జాతీయ వేదికల ప్రమేయం ఉన్నట్టయితే అఫ్గాన్‌కు ప్రస్తుత దుస్థితి తప్పేది. ఆకలితో అలమటిస్తున్న పౌరులకు చేయూతనందించడం, పిల్ల లకు పౌష్టికాహారం సమకూర్చడం, కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి తీసుకురావడం తక్షణ కర్తవ్యం. ఈ అంశాల్లో సమష్టిగా పనిచేయాలని సదస్సు నిర్ణయించడం మెచ్చదగ్గది. వేరే కారణా లతో సదస్సుకు గైర్హాజరైన చైనా ఈ కృషిలో తాను కూడా పాలుపంచుకుంటానంటున్నది. ఆచ రణలో అది రుజువుకావాల్సివుంది. తాలిబన్‌లు చిత్తశుద్ధితో వ్యవహరించి మెరుగైన కార్యాచరణకు దోహదపడితే సుస్థిరమైన, శాంతియుతమైన అఫ్గాన్‌ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఆ దేశం అచిరకాలంలోనే అభివృద్ధి పథంలో పయనిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement