Telangana: కోతుల బెడద మార్చిన పంట విధానం | How Monkeys Threat Changed Cropping System in Telangana: Analysis | Sakshi

Telangana: కోతుల బెడద మార్చిన పంట విధానం

Nov 12 2022 1:46 PM | Updated on Nov 12 2022 1:46 PM

How Monkeys Threat Changed Cropping System in Telangana: Analysis - Sakshi

తెలంగాణ రాష్ట్రంలో కోతులకు భయపడి రైతులు కొన్ని పంటలు వేయడం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో కోతుల బెడదతో ఏటా వేలకోట్ల విలువగల పంటలకు నష్టం వాటిల్లుతోంది. కోతులకు భయపడి రైతులు కొన్ని పంటలు వేయడం లేదు. ముఖ్యంగా వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలూ, కొన్ని చోట్ల వరిపంటలు కూడా వేయడం లేదు. పండ్ల తోటలు, కూరగాయల పంటల సంగతి ఇక చెప్పవలసిన పనే లేదు. పంట పూర్తిగా కోతకు రాకముందే కోతుల మందలు వచ్చి నాశనం చేస్తున్నాయి. రాష్ట్రంలో కోతులవల్ల ఏకంగా పంటల విధానమే మారిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు.  

వరి, పత్తి మినహా మరే పంట పండించే పరిస్థితి లేదు. పప్పుధాన్యాలు, నూనెగింజలు కోతుల బెడదతో విస్తీర్ణం తగ్గాయి. కోతులు ఏడాదికి 2 లేదా 3 పిల్లలకు జన్మనిస్తాయి. అందువల్ల వీటి సంఖ్య వేగంగా పెరుగు తోంది. ఆహారం కొరకు మందలు మందలుగా వచ్చి ఎంతకైనా తెగబడతాయి. ఇంట్లో దూరి ఆహార వస్తువు లతోపాటు ఇతర వస్తువులను కూడా నాశనం చేస్తున్నాయి. మనుషులపై దాడిచేసి, గోళ్ళతో గీకి, పండ్లతో కొరికి గాయపరుస్తున్నాయి. వీటితో గాయాలపాలైన వారు కోలుకోవడం ఖర్చుతో కూడిన పని. 

రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్‌లో కోతుల రక్షణ కేంద్రం ఏర్పాటుచేసి వాటి పుట్టుకను నియం త్రిస్తున్నామని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ కేంద్రం పనిచేయడం లేదు. సర్వే చేసి రూ. 2.25 కోట్లు వ్యయం చేసి కోతులను పట్టుకొని వాటికి పిల్లలు పుట్టకుండా స్టెరిలైజ్‌ చేస్తున్నామనీ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నిర్మల్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తామనీ అటవీశాఖా మంత్రి చెప్పారు. కోతులను అడవుల్లోకి పంపడానికి పండ్ల చెట్లను నాటుతామనీ, తద్వారా వీటి బాధను తగ్గిస్తామనీ 2017 నవంబర్‌లో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కానీ ఇది ఆచరణలోకి రాలేదు.

కోతులు హైదరాబాద్‌లో అనేక ఇండ్లల్లోకి దూరి నష్టాలు కలిగి స్తున్నాయి. ముఖ్యంగా స్లవ్‌ు ఏరియాల్లో పేదల ఇండ్లల్లో తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటిద్వారా కొత్త జబ్బులు కూడా ప్రజలకు సోకు తున్నాయి. ఒక సర్వేలో 50 శాతం కోతులకు జబ్బులున్నాయనీ, అవి గ్రామాల్లో, పట్టణాల్లో తిరగడం ద్వారా ఆ జబ్బులు మనుషులకు వ్యాపింప చేస్తున్నాయనీ తేలింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కోతుల బెడదను నివారించడనికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించలేదు. రోడ్లపక్కన చెట్లునాటడం, గ్రామాల్లో హరితహారం పేరుతో చెట్లు నాట డానికి వందలకోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ నాటిన చెట్లు కూడా ఎందుకూ ఉపయోగం కానివి. అవి ఎలాంటి కాయలుగానీ, పండ్లుగానీ చివరకు పూలుగానీ ఇచ్చేవికావు. వీటివల్ల కోతులు వెళ్తాయని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా వుంది. 

రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో అడవులున్నాయి. ఈ అడవుల్లో 40 శాతం భూమిలో ఎలాంటి చెట్లు చేమా లేవు. విలువైన టేకు, నల్లమద్ది లాంటి చెట్లను నరికివేసి స్మగ్లర్లు పట్టణాలకు అమ్ముకున్నారు. అడవిలో ఉన్న విప్ప, తునికి, అడవి మామిడి, పరికి, ఉసిరికాయల చెట్లు వంటి వాటిని పూర్తిగా లేకుండా చేశారు. కోతులకే గాక ఏ అడవి జంతువులకూ ఆహారం దొరకకుండా చేశారు. అందువల్ల అడవి పందులు, చివరికి చిరుతపులులు కూడా గ్రామాల్లోకి వస్తున్నాయి.  

 దశాబ్దం క్రితంవరకు ఏ అడవి జంతువులు గ్రామాల్లోకి రాలేదు. కోతులపై పరిశోధ నలు చేసే పేరుతో, వాటి రక్తం సేకరించే పేరుతో కొన్ని ప్రైవేటు కంపెనీలు అడవుల్లో కోతులను పట్టి మందలకు మందలు పట్టణా లకు తెచ్చారు. ఇక్కడ పరిశోధన జరిగిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లో విడిచిపెట్టమని చెప్పినప్పుడు... వాటిని తీసుకెళ్లే వ్యక్తులు అడవిదాకా వెళ్లకుండానే, గ్రామాల్లోనే విడిచిపెట్టారు. అవి సంతాన వృద్ధి చేసుకొని గ్రామాలు వదిలిపెట్టకుండా వుంటున్నాయి. ఇది రైతులకు, గ్రామస్థులకు శాపంగా మారింది. (క్లిక్: డియాగేట్‌కు గుమ్మడికాయ కడదాం!)

రైతులు ధైర్యంగా వచ్చే వానాకాలం నాటికి అన్ని రకాల పంటలు వేసేవిధంగా అవకాశం కల్పించాలంటే కోతులు, పందుల బెడదను పూర్తిగా నివారించాలి. ఆ హామీ ప్రభుత్వం ఇవ్వాలి. కోతుల బెడదతో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఇందువల్ల మొత్తం పారిశ్రామిక, సేవారంగాలు దెబ్బతింటాయన్న ఆర్థిక సూత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. (క్లిక్: ఆహార స్వావలంబన విధాన దిశగా...)


- సారంపల్లి మల్లారెడ్డి 
ఉపాధ్యక్షులు, అఖిల భారత కిసాన్‌ సభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement