ఆరోగ్యశ్రీ... ఏపీ భాగ్యం | Sakshi Guest Columns On Special Story About Ys Rajasekhara Reddy | Sakshi

ఆరోగ్యశ్రీ... ఏపీ భాగ్యం

Jul 8 2021 2:17 AM | Updated on Jul 8 2021 11:42 AM

Sakshi Guest Columns On Special Story About Ys Rajasekhara Reddy

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రూపుదిద్దుకున్న ఎన్నో సంక్షేమ, అభివృధ్ది పథకాలకు... అంతకు ముందు ఆయన సుదీర్ఘ ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఎదురైన అనుభవాలు, జనం అగచాట్లు స్వయంగా గమనించి చేసిన ఆలోచనలే మూలం. ఆయనను ప్రధానంగా కలచివేసిన అంశం, జబ్బుల బారిన పడిన పేద జనానికి మెరుగైన వైద్యం అందక ఆస్తులు అమ్ముకుని ప్రాణం కాపాడుకోవడానికి బడుగు జీవి పడిన పాట్లు ఒక డాక్టరుగా ఆయనలో సరికొత్త పథకానికి నాంది పలికింది. డబ్బులు ఉన్నవాడికే కార్పొరేట్‌ వైద్యం, లేనివాడు ఆరోగ్యం కోసం అప్పులపాలైనా కావాలి లేదా ప్రాణం మీద ఆశ వదులు కోవాలి. ఈ పరిస్థితిలో సమూల మార్పు తీసుకువచ్చి సామాన్యుడికి కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించే ధన్వంతరి మంత్రంగా ఆరోగ్యశ్రీ అమలులోకి వచ్చింది. 

వాస్తవానికి వైఎస్సార్‌ సీఎంగా రోజులో ఎక్కువ సంతకాలు చేసింది సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి వైద్య సాయం కోసం దరఖాస్తుల ఫైళ్లపైననే. 14.05.2004 నుంచి 26.06.2007 వరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ. 168.52 కోట్ల నిధులు విడుదల చేశారంటే పేదల ఆరోగ్యంపై ఎంతగా శ్రద్ధవహించేవారో అర్థం చేసుకోవచ్చు. జబ్బుపడ్డ పేదవాడి కుటుంబం ఆ ఆపత్కాలంలో సీఎం కార్యాలయం వరకు కలిగే ప్రయాసకు స్వస్తి  చెప్పదల్చుకున్నారు వైఎస్సార్‌. డబ్బులు లేక వైద్యం అందని దుర్భర పరిస్థితులకు శాశ్వత పరిష్కారంగా ఆరోగ్యశ్రీని ప్రిస్క్రైబ్‌ చేసి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు డాక్టర్‌ వైఎస్సార్‌ చేసిన ప్రయత్నం, సాధించిన తక్షణ ఫలితాలు యావద్దేశం ఆరోగ్యశ్రీ వైపు దృష్టిపెట్టేట్టు చేశాయి.
 
దేశంలో తొలిసారిగా బీపీఎల్‌ కుటుంబాలకు ఉచిత కార్పొరేట్‌ వైద్య సౌకర్యం కల్పిస్తూ ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. నేషనల్‌ హెల్త్‌ బిల్లులో, 12వ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పేర్లు ఉన్నా ఆరోగ్యశ్రీ స్పూర్తిగా పేదలకు ఉచిత వైద్య బీమా పధకాలు అమలు చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోదీ హెల్త్‌ కేర్‌ వైఎస్సార్‌ తెచ్చిన ఆరోగ్యశ్రీ కోవలోనిదే. 

ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 229.11 లక్షల కుటుంబాలలో వైఎస్సార్‌ హయాంలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 198.25 లక్షల కుటుంబాలు (87 శాతం) ప్రయోజనం పొందడానికి అర్హత కలిగి ఉండేవి. తన సొంతఊరు పులివెందులలో ఒక రూపాయి ఫీజు తీసుకునే డాక్టరుగా పేరొందిన వైఎస్సార్‌.. ఆరోగ్యశ్రీతో పాటు వైద్య సేవారంగంలో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 108 అత్యవసర అంబులెన్స్‌ సర్వీసును వైఎస్సార్‌ 2007 ఆగష్టు 15న ప్రారంభించారు. వైఎస్సార్‌ 108 సర్వీసును ప్రవేశపెట్టిన పదిరోజుల్లోగానే ఆగష్టు 29న అప్పటి గుజరాత్‌ సీఎం నరేంద్రమోదీ తమ రాష్ట్రంలో ఈ సర్వీసును అమలులోకి తీసుకువచ్చారు. 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీగా మార్చి అమలు చేస్తూ ఈ స్కీంను మరింత విస్తృతం చేసి రాష్ట్ర జనాభాలో 90 శాతం పైగా ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉచిత కార్పొరేట్‌ వైద్య సేవలు అందుకోవడానికి వీలు కల్పించారు. తన హయాంలో వైఎస్సార్‌ 940 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తే, వైఎస్‌ జగన్‌ జనరల్‌ సర్జరీ నుంచి సైక్రియాట్రీ వరకు లెక్కకు మించిన వైద్య చికిత్సలను ఈ స్కీంలో చేర్చి తండ్రికి తనయుడు అనిపించుకుంటున్నారు. కరోనా బారిన పడిన వారందరికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద అన్ని హాస్పిటల్స్‌లో ఉచిత చికిత్స అందించేందుకు ఆదేశాలిచ్చిన వైఎస్‌ జగన్‌.. దేశంలో కరోనా చికిత్సను ఫ్రీ హెల్త్‌ సర్వీస్‌ కిందకు తెచ్చిన తొలి ముఖ్యమంత్రి.

బీఎస్‌ రామకృష్ణ,
సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement