
413 మందికి పైగా మృతి
హమాస్ చీఫ్, అగ్ర నేతలు హతం
ఇక సమరమే: నెతన్యాహు
బందీలకిది మరణశాసనం: హమాస్
దెయిర్ అల్ బలా: పశ్చిమాసియాలో శాంతి యత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. గాజాలో ప్రశాంతత రెండు నెలల ముచ్చటగానే ముగిసింది. రంజాన్ మాసం ముగిసేదాకా సంయమనం పాటిస్తామన్న హామీని ఇజ్రాయెల్ తుంగలో తొక్కింది. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్ కోరిన మార్పులకు హమాస్ నిరాకరించడంతో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కన్నెర్రజేశారు. ఆయన ఆదేశాలతో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మంగళవారం తెల్లవారుజామునే భారీ స్థాయిలో దాడులకు దిగింది.
ఎడతెరిపి లేని బాంబుల వర్షంతో హమాస్ అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేసింది. గాజాలో హమాస్ ప్రభుత్వ సారథి ఇస్మాయిల్ అల్ దాలిస్‌తో పాటు అంతర్గత శాఖ సారథి మహమూద్ అబూ వటా్ఫ, అంతర్గత భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ బహజాత్ అబూ సుల్తాన్ తదితర అగ్ర నేతలు దాడుల్లో మృతి చెందారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. దాడులకు కనీసం 413 మందికి పైగా బలయ్యారని, 600 మందికి పైగా గాయపడ్డారని ప్రకటించింది. వారిలో చాలామంది బాలలేనని ఆవేదన వెలిబుచ్చింది.
తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని, ఇంతకింతా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. తమవద్ద బందీలుగా ఉన్న 25 మందికి పైగా ఇజ్రాయెలీలకు తాజా దాడులు మరణశాసనమేనంటూ హమాస్ ప్రతినిధి ఇజ్జత్ అల్ రిషెక్ మండిపడ్డారు. ప్రమాదంలో పడ్డ తన సర్కారును కాపాడుకోవడానికి శాంతియత్నాలకు నెతన్యాహు ఉద్దేశపూర్వకంగానే తూట్లు పొడిచారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని ఘాటుగా స్పందించారు.
తమ బందీలను సైనిక చర్య ద్వారానే విడిపించుకుంటామని ప్రకటించారు. హమాస్‌పై ఇక మరిన్ని సైనిక దాడులతో విరుచుకుపడతామని కుండబద్దలు కొట్టారు. తర్వాతి చర్యలపై అత్యున్నత స్థాయి భద్రతాధికారులతో మంగళవారం సాయంత్రం లోతుగా మంతనాలు సాగించారు. తాజా పరిణామాలతో గాజాలో శాంతియత్నాలకు తెర పడ్డట్టేనని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ తమను సంప్రదించిన మీదటే తాజా దాడులకు దిగిందన్న అమెరికా ప్రకటన కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది.
భూతల దాడులు!
మంగళవారం నాటి దాడుల్లో డజన్ల కొద్దీ లక్ష్యాలను సమూలంగా ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాపై అతి త్వరలో భూతల దాడులకు కూడా సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది. తూర్పు గాజాను ఖాళీ చేయాల్సిందిగా తాజా దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. వారంతా మధ్య ప్రాంతంవైపు వెళ్లాలని పేర్కొంది. మిగిలి ఉన్న హమాస్ నేతలను కూడా అంతం చేయడంతో పాటు దాని వనరులు, మౌలిక సదుపాయాలన్నింటినీ ధ్వంసం చేయడమే ఇకపై లక్ష్యమని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు.
2023 అక్టోబర్ 7న హమాస్ సాయుధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి విచక్షణారహితంగా దాడులకు దిగడం తెలిసిందే. వందలాది మంది పౌరులను కాల్చి చంపడమే గాక 250 మందికి పైగా ఇజ్రాయెలీలను బందీలుగా తీసుకెళ్లారు. దానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ తెర తీసిన యుద్ధం 17 నెలలపాటు సాగింది. ఫలితంగా 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజా దాదాపుగా నేలమట్టమైంది.
ఈ నేపథ్యంలో ఈజిప్ట్, ఖతార్, అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన శాంతి చర్చలు ఫలించి జనవరి నుంచి ఆరు వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. 25 మంది బందీలను హమాస్, బదులుగా 2,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాయి. అది ముగిశాక రెండో దశ విరమణకు జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. తన వద్ద మిగిలిన 59 మంది ఇజ్రాయెలీ బందీలను వదిలేస్తానని, బదులుగా యుద్ధానికి పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టి సైన్యం గాజా నుంచి పూర్తిగా వైదొలగాలని హమాస్ డిమాండ్ చేసింది. అందుకు ఇజ్రాయెల్ ససేమిరా అంది.
హమాసే కారణం: అమెరికా
ఇజ్రాయెల్ తాజా దాడులను అమెరికా సమర్ధించింది. ఈ విషయమై ఇజ్రాయెల్ తమను ముందుగానే సంప్రదించిందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ వెల్లడించారు. ఉగ్రవాద చర్యలకు మూల్యం తప్పదంటూ హౌతీలతో పాటు హమాస్‌ను కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారని ఆమె గుర్తు చేశారు. తాజా పరిస్థితికి హమాసే కారణమని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి బ్రయాన్ హ్యూస్ ఆరోపించారు.