
తీవ్రమైన మంచు, వణికిస్తున్న చలి
లూయిస్‌విల్లే: ప్రకృతి వైపరీత్యాలు అమెరి కాను వణికిస్తున్నాయి. ఆగ్నేయాన భారీ వర్షాలు, ప్రమాదకరమైన వరదలు అతలా కుతలం చేస్తుండగా ఈశాన్య ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తోంది. మైదాన ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. కెంటకీలోని క్లే కౌంటీలో సంభవించిన వరదల్లో శనివారం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వరద హెచ్చరికల నేపథ్యంలో జాక్సన్‌లోని కెంటకీ రివర్ మెడికల్ సెంటర్‌ను మూసివేశారు.
కెంటకీలో నివాస భవనాలు, కార్లు వరదల్లో చిక్కుకుపోగా వర్జీనియాలోని రోడ్లను బురద కమ్మేసింది. టెన్నెస్సీ, అర్కా న్సాస్‌లోనూ అధికారులు వరద ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. 10 దక్షిణాది రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. న్యూఇంగ్లండ్, న్యూయార్క్‌ల్లో చాలా ప్రాంతాలను భారీగా మంచు కప్పేసింది. నెబ్రస్కా, అయోవా, విస్కాన్సిన్, మిషిగన్, డెన్వర్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయాయి. మొంటానా, డకోటా, మిన్నెసోటాల్లో మైనస్ 51 డిగ్రీల వరకు పడిపోయతాయని అధికారులు చెప్పారు.