
యెమెన్‌పై భీకర దాడులకు సంబంధించి అమెరికా ప్రణాళికలు ముందుగానే బయటపడడం చర్చనీయాంశమైన వేళ.. విస్మయం కలిగించే విషయం ఒకటి వెలుగు చూసింది. హౌతీ రెబల్స్‌పై దాడుల సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తన భార్య, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత లాయర్‌తోనూ పంచుకున్నట్లు బయటపడింది. సమాచారం లీక్ విషయంలో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
న్యూయార్క్: సమాచారం లీక్ అవ్వడానికి కారణమైన ‘సిగ్నల్’ గ్రూప్‌ను తానే క్రియేట్ చేశానని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ (Mike Waltz) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గ్రూప్‌లో సమాచారం ఎలా లీక్ అయ్యిందో అర్థం కావడం లేదని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ఈలోపు.. అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్(Pete Hegseth) తన కుటుంబ సభ్యులతోనూ ఆ కీలక సమాచారం పంచుకున్నారనే విషయం వెలుగు చూసింది.
యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన F/A-18 హార్నెట్ దాడుల షెడ్యూల్‌ల వివరాలను ఆయన మరో ఛాట్‌లో భార్య, తన సోదరుడు, స్నేహితులతోనూ పంచుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హెగ్సెత్ భార్య, ఫాక్స్ న్యూస్ ప్రొడ్యూసర్ అయిన జెన్నిఫర్.. సైన్యానికి సంబంధించిన కీలక సమావేశాలకూ హాజరయ్యారని వాల్ స్ట్రీట్ జనరల్ విడిగా మరో కథనం ఇచ్చింది.
ఈ కథనాలపై ఇటు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్.. అటు వైట్‌హౌజ్ వర్గాలు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. అత్యంత సున్నితమైన భద్రతా వివరాలను పంచుకోవడానికి ట్రంప్ పేషీ ‘‘సిగ్నల్’’ లాంటి యాప్‌ను వాడడంపై అమెరికాలో తీవ్ర చర్చ నడుస్తోంది.
అమెరికా బలగాలు కిందటి నెలలో యెమెన్(Yemen Attacks Plan Leak)పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే ఓ పాత్రికేయుడికి తెలియడం అమెరికాలో కలకలం రేపింది. సిగ్నల్‌లో గ్రూప్‌చాట్ కోసం తనను రెండు రోజుల ముందే యాడ్ చేశారని ‘అట్లాంటిక్ మ్యాగజైన్’ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్‌బర్గ్ ప్రకటించారు. లక్ష్యాలు, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై గ్రూపులో చర్చించారని, ఆ ప్రకారమే దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే తన వద్ద ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. తాను ఎలాంటి కథనాలు ఇవ్వలేదంటూ చెప్పారాయన.
అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు యెమెన్‌పై చర్చించిన సిగ్నల్ యాప్ గ్రూప్‌చాట్‌లో ఈ జర్నలిస్టును యాడ్ చేశారు. దాడుల విషయాలు ఆ పాత్రికేయునికి తెలుసని శ్వేతసౌధం ధ్రువీకరించింది.
మరోవైపు.. ఈ ప్రణాళిక లీకైన అంశంపై తనకెలాంటి సమాచారం లేదని అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఈ భద్రతా ఉల్లంఘనను ట్రంప్ సాధారణ విషయంగా తీసుకున్నప్పటికీ.. డెమోక్రట్లు తీవ్రంగా ఖండించారు. నూతన పాలకవర్గం అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు.
ఇక.. ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి నిఘా అధికారులను అమెరికా సెనెట్ విచారిస్తోంది. ఇప్పటికే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్, జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌లు సెనెట్ నిఘా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు.
అయితే గ్రూప్‌ను తానే క్రియేట్ చేసినప్పటికీ సదరు జర్నలిస్టు ఫోన్ నెంబర్ తన వద్ద లేదని అన్నారు. ఫోన్‌లో లేని నెంబర్ ఎలా గ్రూప్‌లోకి వచ్చిందో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని .. విషయంలో తాము ఇలాన్ మస్క్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మార్చి 15న యెమెన్‌పై దాడులను ప్రకటించారు. ఇజ్రాయెల్ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన యెమెన్ తిరుగుబాటు దళం హూతీలపై అమెరికా ఇటీవల పెద్దఎత్తున దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర నేతలపై తమ దళాలు భీకర దాడులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో 50 మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడ్డారు.