
లాహోర్: వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పంజ్‌వార్(63) పాకిస్తాన్‌లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో హతమయ్యాడు. పంజాబ్ ప్రావిన్స్ లాహోర్‌లోని తన నివాసానికి సమీపంలో శనివారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన అతడిపై గుర్తు తెలియని దుండగులు దగ్గర్నుంచి కాల్పులకు దిగారు. ఈ ఘటనలో అతడితోపాటు గార్డు కూడా చనిపోయాడు.
ఖలిస్తానీ కమాండో ఫోర్స్–పంజ్‌వార్ గ్రూపునకు ఇతడే నాయకుడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–2020 ప్రకారం భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పంజ్‌వార్ హత్యాఘటనపై వ్యాఖ్యానించేందుకు లాహోర్ పోలీసులు నిరాకరించారు. 1986లో ఖలిస్తానీ కమాండో ఫోర్స్‌లో చేరిన పంజ్‌వార్ అనంతరం సొంత కుంపటి పెట్టుకుని పాక్‌కు పరారయ్యాడు. పంజాబ్, హరియాణా, చండీగఢ్‌ల్లో జరిగిన పలు పేలుడు ఘటనలకు ఇతడి ప్రమేయం ఉంది.