
బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగి కిరాతకం
పరారీలో నిందితుడు
సాక్షి, బెంగళూరు: జీవిత భాగస్వామిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరకడం వంటి కిరాతక నేరాలు దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అలాంటి ఘోరం బెంగళూరులోనూ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ముక్కలుగా ఖండించి సూట్‌కేసులో పెట్టి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని హుళిమావు పరిధిలోని దొడ్డకమ్మనహళ్లిలో జరిగింది.
రెండేళ్ల కిందటే పెళ్లి.. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ (37) అనే వ్యక్తి తన భార్య గౌరి సాంబేకర్ (32)ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్‌కేసులో నింపేశాడు. రెండేళ్ల క్రితం రాకేశ్, గౌరికి వివాహం జరిగింది. నెల రోజుల క్రితమే దొడ్డకమ్మనహళ్లిలోని ఇంటికి మారారు. ఇద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కింద ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నారు.
.. గురువారం ఏం జరిగిందో కానీ హత్య చేసి, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన గౌరి తల్లిదండ్రులు తమ ఊళ్లోని సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చారు. ఆ పోలీసులు వెంటనే హుళిమావు పోలీసులకు తెలియజేశారు.
పోలీసులు ఇంటికి వెళ్లి తాళాలు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బాత్‌రూంలో సూట్‌కేసులో గౌరి మృతదేహం ముక్కలై కనిపించడంతో కంగుతిన్నారు. ఆమె హత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదు. నిందితుడు రాకేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా, క్లూస్ టీం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.