
లారీల సమ్మె సమాప్తం
● ఫలించిన చర్చలు
బనశంకరి: లారీల యజమానులు, ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో లారీల సమ్మె ముగిసింది. గురువారం రవాణా మంత్రి రామలింగారెడ్డితో సంఘం నాయకులు చర్చలు సాగించారు. డీజిల్ ధర తగ్గించాలి, లారీ డ్రైవర్లపై దాడులు ఆపాలి, బెంగళూరులోకి సరుకు రవాణా లారీలను అనుమతించాలి అని పలు డిమాండ్లతో 14 అర్ధరాత్రి నుంచి లారీలను నిలిపేశారు. దీంతో సరుకురవాణా పూర్తిగా నిలిచిపోయింది. మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ లారీ యజమానులు 6 డిమాండ్లు పెట్టారని తెలిపారు. ఆన్‌లైన్‌లో జరిమానా చెల్లించే వ్యవస్థను అమలు చేస్తామని తెలిపారు. ఓటీఎస్ తరహాలో జరిమానా చెల్లింపులు కోరారని, సీఎంతో మాట్లాడతానని అన్నారు. సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌ల సమస్యను మూడునెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సంఘం నేతలు తెలిపారు. అధికారులు, పోలీసుల వేధింపులపై చెప్పామన్నారు. మూడురోజుల లారీల సమ్మెతో వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు.