
తమిళ్ సినీ పుటల్లో లెక్కించబడిన చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. దివంగత ప్రముఖ నటుడు విజయ్ కాంత్ కథానాయకుడిగా నటించిన 100వ చిత్రం కావడం గమనార్హం. సాధారణంగా స్టార్ హీరోలు నటించిన నూరవ చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించడం అన్నది అరుదే. అలాంటిది కెప్టెన్ ప్రభాకరన్ తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఘన విజయాన్ని సాధించింది. పులన్ విచారణపై చిత్రం తర్వాత దర్శకుడు ఆర్‌కే సెల్వమణి మరో బ్రహ్మాండ సృష్టి ఈ చిత్రం. నటుడు విజయ్ కాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోయిన చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. అందుకే ఈ చిత్రం జ్ఞాపకంగా నటుడు విజయ్ కాంత్ తన పెద్ద కుమారుడికి విజయ్ ప్రభాకరన్ అని పేరు పెట్టారు. కాగా ఈ చిత్రం పలువురికి పేరు తెచ్చిపెట్టింది.
నటి రూపిణీ, రమ్యకృష్ణ, లివింగ్ స్టన్, తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఇందులో నటుడు శరత్ కుమార్ కీలక పాత్రను పోషించారు. నటుడు మన్సూర్ అలీఖాన్ ఈ చిత్రం ద్వారా విలన్‌గా పరిచయం అయ్యారు. ఈయన వీరప్పన్ గా నటించినా ఈ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల్లో గుర్తుండిపోతుంది. ఐవీ.సినీ ప్రొడక్షనన్స్ పతాకంపై ఏఎస్ ఇబ్రహీమ్ రావుత్తర్ నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని, రాజారాజన్ ఛాయాగ్రహణంను అందించారు. 1991లో తమిళ ఉగాది సందర్భంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.

34 ఏళ్ల తరువాత కెప్టెన్ ప్రభాకరన్ సంగీతాన్ని 4కే డిజిటల్ ఫార్మెట్‌లో 7.1 సౌండ్ మిక్సింగ్ తో ఈ చిత్రాన్ని మురుగన్ ఫిలిం ఫ్యాక్టరీ, స్పాట్లో సినిమాస్ సంస్థల ద్వారా కార్తీక్ వెంకటేశన్ త్వరలో రీ రిలీజ్ చేస్తున్నారు. దీన్ని తమిళనాడులో 500 థియేటర్‌లలో విడుదల చేయనున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు తెలుగులో ఇటీవల గంధపు చెక్కల నేపథ్యంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప చిత్రం తరహాలో చాలా కాలం క్రితమే తెరకెక్కిన చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ అని, ఇప్పుడు ఆంధ్రాకు పుష్ప చిత్రం ఎలాగో తమిళనాడుకు అప్పుడే కెప్టెన్ ప్రభాకరన్ చిత్రం అని ఆయన అన్నారు.