
తీసింది తక్కువ సినిమాలే అయినా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశమంతా మార్మోగిపోయింది. ఆయన సినిమా తీస్తే హిట్టు కాదు ఏకంగా బ్లాక్‌బస్టర్ అవ్వాల్సిందే అన్న పేరు తెచ్చేసుకున్నాడు. తనను విమర్శించినా ఊరుకుంటాడేమో కానీ తన సినిమాల జోలికి వస్తే మాత్రం అస్సలు సహించడు. అవతలి వ్యక్తి ఎవరైనా సరే ఇచ్చిపడేస్తాడు. ఓ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి (IAS Vikas Divyakirti).. సందీప్ తెరకెక్కించిన యానిమల్ సినిమాపై గతేడాది విమర్శలు గుప్పించారు.
యానిమల్ సినిమాలు ఎందుకు తీస్తారో!
యానిమల్ (Animal Movie) వంటి చిత్రాలు మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తున్నాయి. ఇలాంటి సినిమాలు రూపుదిద్దుకోకూడదు. మీ సినిమాలో హీరో జంతువులా ప్రవర్తిస్తాడని చూపించారు. దీనివల్ల మీకు డబ్బు వచ్చి ఉండొచ్చు. కానీ కేవలం డబ్బు కోణంలోనే ఆలోచిస్తే ఎలా? సామాజిక విలువలు కాస్తైనా ఉండాల్సిన పని లేదా? అని విమర్శించారు. వికాస్.. 12th ఫెయిల్ సినిమా (12th Fail Movie)లో యూపీఎస్‌సీ ప్రొఫెసర్‌గా యాక్ట్ చేశాడు.
అవనసరంగా విమర్శిస్తే..
ఈ విమర్శలపై తాజాగా సందీప్‌రెడ్డి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఓ ఐఏఎస్ అధికారి యానిమల్ వంటి చిత్రాలు రాకూడదన్నారు. ఆయన చెప్పింది వింటే నేనేదో పెద్ద నేరం చేసినట్లుగా అనిపించింది. 'ఒకవైపు 12th ఫెయిల్ వంటి సినిమాలు తీస్తుంటే మరోవైపు యానిమల్ వంటివి తీసి సమాజాన్ని వెనక్కుతీసుకెళ్తున్నారు' అని వ్యాఖ్యానించారు. ఇలా ఎవరైనా అనవసరంగా నా సినిమాపై దాడి చేస్తే నాకు కచ్చితంగా కోపం వస్తుంది. ఆయన బాగా చదువుకుని ఐఏఎస్ అయ్యారు.

యానిమల్ హీరోతో సందీప్ రెడ్డి వంగా, ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి
ఎవరైనా ఐఏఎస్ అయిపోవచ్చు
నాకేమనిపిస్తోందంటే ఢిల్లీ వెళ్లి, ఏదో ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి రెండుమూడేళ్ల జీవితాన్ని అక్కడే గడిపితే కచ్చితంగా ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవుతారు. పైగా అందుకోసం చదవాల్సిన పుస్తకాలు కూడా వేలకొద్దీ ఉండవు. 1500 పుస్తకాలు చదివితే ఐఏఎస్ అయిపోతారు. కానీ సినిమాలో అలా కాదు.. మీరు దర్శకరచయితలు అయ్యేందుకు ప్రత్యేకంగా ఏ కోర్సు ఉండదు.. ఏ టీచర్ కూడా మిమ్మల్ని దర్శకుడిగా, రచయితలుగా తీర్చిదిద్దలేరు అన్నాడు.
సినిమా
సందీప్‌రెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్ 2023లో రిలీజైంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది.