
దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి ఒక ఊపు ఊపిన కధానాయికల్లో నెం.1 స్థానంలో ఉంటారు శ్రీదేవి (Sridevi). భారతీయ సినిమాకు ‘మొదటి మహిళా సూపర్ స్టార్‘గా శ్రీదేవి మూస పద్ధతులను బద్దలు కొట్టారు. కామెడీ నుంచి ట్రాజెడీ వరకు వైవిధ్యమైన శైలిలో విస్తృతమైన పాత్రలను పోషించారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం కన్నడ భాషా చిత్రాలతో ఆమె కెరీర్ నలుదిశలా విస్తరించింది.
సౌత్.. నార్త్.. అన్నింటా తనదే హవా
దక్షిణాదిలో అన్ని భాషా చిత్రాల్లో విజయాలు ఒకెత్తయితే బాలీవుడ్‌లో మరో ఎత్తు. ‘మిస్టర్ ఇండియా,‘ ‘సద్మా,‘ ‘హిమ్మత్వాలా,‘ ‘ఖుదా గవా,‘ ‘‘లాడ్లా,‘ ‘జుదాయి,‘ ‘ఇంగ్లీష్ వింగ్లీష్‘ వంటి సూపర్ హిట్స్‌తో ఆమె బాలీవుడ్ ప్రేక్షకుల కలలరాణిగా కళకళలాడారు. ఆమె చివరి చిత్రం క్రైమ్ థ్రిల్లర్ ‘మామ్' 2017లో విడుదలైంది. ఇది అందరికీ తెలిసిన శ్రీదేవి.. అయితే తెలియని శ్రీదేవి గురించి ఎలా తెలుస్తుంది?
శ్రీదేవి బయోపిక్‌లో నటించాలనుంది: తమన్నా
ఇప్పుడు బయోపిక్‌ల శకం నడుస్తోంది. సిల్క్ స్మిత నుంచి శ్రీదేవి దాకా తారల జీవితాలను తెరకెక్కించాలని సినిమా పరిశ్రమ ఉవ్విళ్లూరుతోంది. గత కొంత కాలంగా శ్రీదేవి జీవిత కథను సినిమాగా రూపొందించాలన్న చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో ఆ పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుంది? అనే చర్చ కూడా వస్తోంది. ఈ నేపధ్యంలో దివంగత తార శ్రీదేవి ‘‘సూపర్ ఐకానిక్’’ కాబట్టి తెరపై ఆమె పాత్రను పోషించాలనుకుంటున్నట్లు నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘శ్రీదేవి, మేడమ్. సూపర్ ఐకానిక్ ఆమె నాకు ఇన్‌స్పిరేషన్. చిన్నప్పటి నుంచీ ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను.. నేను ఎప్పుడూ మెచ్చుకునే వ్యక్తి ఆమె‘ అని తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
మరి నిజంగా తమన్నాకు శ్రీదేవి పాత్ర పోషించి మెప్పించే స్థాయి ఉందా? ఈ ప్రశ్నకు సినీ పండితుల నుంచి ఇంకా సరైన సమాధానం రాలేదు కానీ.. శ్రీదేవి చిన్న కుమార్తె నుంచి పదునైన సమాధానమే వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖుషి కపూర్ (Kushi Kapoor)... తన తల్లిలా మరెవరూ కాలేరని, ఆమె స్థానాన్ని మరొకరు ఎప్పటికీ భర్తీ చేయలేరని కుండ బద్ధలు కొట్టారు. ఆమెలా చిన్నప్పటి నుంచి నటనపై అంతటి అంకితభావం. అద్వితీయమైన ప్రతిభను ఎవరూ ప్రతిబింబించలేరని ఆమె స్పష్టం చేశారు.
తను ప్రత్యేకమైన సృష్టి
ఇతరులకే కాదు తమకి కూడా అమ్మ స్థానం అసాధ్యమని ఆమె పరోక్షంగా తేల్చేశారు. తనపై ఆమె సోదరి జాన్వీపై శ్రీదేవి చూపిన ప్రభావం సాధారణమైనది కాదన్నారు. అయినప్పటికీ ‘రాబోయే 100 ఏళ్లలో కూడా నేను మా అమ్మలా కాలేను. ఆమె వేరే... ప్రత్యేకమైన సృష్టి‘ అంటూ తన తల్లిలా కావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే అంటూ ఓ ఇంటర్వ్యూ లో పరోక్షంగా స్పష్టం చేశారు.
చదవండి: నెలసరి నొప్పులు.. అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్