అయోధ్య రామయ్య దర్శనం ఉచితమే..! | Ayodhya Ramalayam Dharshan Prasadam Free For Devotees | Sakshi

అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..!

Jan 21 2024 9:32 AM | Updated on Jan 21 2024 9:35 AM

Ayodhya Ramalayam Dharshan Prasadam Free For Devotees - Sakshi

భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని..

లక్నో: రామ మందిరం దేశంలోనే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరబోతోంది. ఇలాంటి చోట దర్శనం,  ప్రసాదాలకు రుసుము ఉండటం సహజం. కానీ, భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని  ట్రస్టు నిర్ణయించింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు.

అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు రోజుకు సగటున 1500 నుంచి 2000 మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ సంఖ్య ఒక్కసారిగా పది వేలకు పెరిగింది. ఇప్పుడు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. వీరందరికీ ఉచితంగానే దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. 

ఆలయ నిర్మాణానికి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రపభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా భక్తులు సమర్పించిన విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల నుంచి రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు అందినట్టు సమాచారం. వాటి ద్వారా వస్తున్న వడ్డీ మొత్తంతోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఇప్పటికీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయోధ్య ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు, తాత్కాలిక మందిరం వద్ద ఉన్న కౌంటర్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్  ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అవి సమకూరుతున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: అయోధ్య రామాలయం: భారీగా పెరిగిన స్టాక్‌లు ఇవే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement