
లక్నో: రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22(సోమవారం)న జరగనుంది. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి తీసిన రామ మందిర దృశ్యాలను ఇస్రో పంచుకుంది. ఇస్రో ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)ఈ దృశ్యాలను తీసింది. డిసెంబర్ 16, 2023న నిర్మాణంలో ఉన్న ఆలయం ఫొటోలు తీసింది.
ఉపగ్రహ చిత్రాలలో నూతనంగా అభివృద్ధి చేసిన దశరథ్ మహల్, సరయు నది కూడా రామమందిరం సమీపంలో చూడవచ్చు.
కొత్తగా పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను NRSC షేర్ చేసిన చిత్రాలలో కూడా చూడవచ్చు.
ఆలయ మొదటి దశ పూర్తి కావొస్తోంది. జనవరి 22న బాలరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దేశంలో ప్రముఖులతో కలిపి మొత్తం 7000 మందికి ఆహ్వానాలు అందాయి.
సాంప్రదాయ నగారా శైలిలో నిర్మించిన ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు (తూర్పు-పడమర దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..!