కత్తితో బెదిరించి రూ. 6.5 లక్షల దోపిడీ | - | Sakshi
Sakshi News home page

కత్తితో బెదిరించి రూ. 6.5 లక్షల దోపిడీ

Published Thu, Apr 3 2025 2:48 PM | Last Updated on Thu, Apr 3 2025 2:48 PM

కత్తి

కత్తితో బెదిరించి రూ. 6.5 లక్షల దోపిడీ

జయపురం: కత్తితో ఓ వ్యక్తిని బెదిరించి ఆరున్నర లక్షల రూపాయలను దోపిడీ చేశారు. ఈ సంఘటన జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి చమలికుండ్‌ మార్గంలో చోటు చేసుకున్నట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి బుధవారం వెల్లడించారు. డబ్బు పోగొట్టుకున్న వ్యక్తిది బొయిపరిగుడ సమితి రామగిరి పంచాయితీ చమలికుండ్‌ గ్రామానికి చెందిన సదా హంతాల్‌గాచెప్పారు. రామగిరి పంచాయతీ ప్రాంతంలో కొంతమంది కార్మికులు డుంబురుపుట్‌ రైల్వేట్రాక్‌ పనులు చేస్తున్నారు. వీరంతా పండుగ నిమిత్తం తమతమ గ్రామాలకు వెళ్లారు. వారికి రావాల్సిన కూలి డబ్బులు తీసుకురమ్మని సదా హంతాల్‌కు అప్పజెప్పారు. దీంతో సదా జాని అందరి మజూరి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుతో తమ గ్రామానికి బైక్‌పై బయలు దేరాడు. చమలికుండ్‌ మార్గంలో ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి సదా బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో కింద పడ్డాడు. వెంటనే దుండగులు కత్తితో బెదిరంచి అతడి వద్ద గల 6 లక్షల 50 వేల రూపాయలను దోచుకు పోయారు. డబ్బు పోగొట్టుకున్న సదా హంతాల్‌ బొయిపరిగుడ పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

హెచ్చరిక బోర్డు ఏర్పాటు

ఇచ్ఛాపురం రూరల్‌: తమ స్థలానికి ఎదురుగా ఉన్న రచ్చబండను తొలగించి, ఆ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు కె.శాసనాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు ఇటీవల తన అనుచరులతో కలిసి రచ్చబండను తొలగించారు. దీనిపై సాక్షి దినపత్రికలో ‘పచ్చ తమ్ముడి బరితెగింపు’ శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు బుధవారం స్పందించారు. ‘ఇది ప్రభుత్వ భూమి.. ఆక్రమణదారులు శిక్షార్హులు’ అని పేర్కొంటూ హెచ్చరిక బోర్డు తహసీల్దార్‌ కె.వెంకటరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేశారు.

16 గొర్రె పిల్లల సజీవదహనం

మెళియాపుట్టి: మండలంలోని కరజాడ గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, దాసరి ఢిల్లేశ్వరరావు, సార రామయ్యలకు చెందిన 16 గొర్రె పిల్లలు సజీవ దహనమయ్యాయి. మార్చి 30వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగినట్లు పెంపకందారులు చెబుతున్నారు. బుధవారం పలువురు పెంపకందారులతో మాట్లాడగా గిట్టని వాళ్లెవరో ఇటువంటి దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుమారు రూ.50 వేల వరకు నష్టం జరిగిందని, అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

రైలుకింద పడి మహిళ మృతి

కాశీబుగ్గ: పలాస జీఆర్పీ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్నటువంటి సోంపేట రైల్వేస్టేషన్‌ యార్డ్‌ నందు గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి బుధవారం మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో లభించిందని తెలిపారు. మృతురాలు గులాబీ, పసుపు రంగు కలిగిన పంజాబీ డ్రెస్‌ ధరించి ఉందన్నారు. చామనచాయ రంగు కలిగి ఉండి, శరీరం రెండుగా విడిపోయి ఉందని కానిస్టేబుల్‌ డి.హరినాథ్‌ వివరించారు. వివరాలు తెలిసినవారు 99891 36143 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

కత్తితో బెదిరించి  రూ. 6.5 లక్షల దోపిడీ 1
1/1

కత్తితో బెదిరించి రూ. 6.5 లక్షల దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement