
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ బిల్లును అడ్డుకుంటామని చెప్పి చంద్రబాబు మోసం చేశారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే రకం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘పిల్లనిచ్చిన మామనే మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. గుజరాత్ అల్లర్ల సమయంలోనూ బాబు ముస్లింలను మోసం చేశారు’’ అని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
‘‘ఆ తర్వాత పదేళ్ల పాటు చంద్రబాబు అధికారానికి దురమయ్యాడు. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు.. ఆయనకు భవిష్యత్ లేదు. చంద్రబాబు పాపాలకు లోకేష్ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.
కాగా, సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటేయడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు.