విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో.. | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో..

Published Wed, Sep 18 2024 1:50 AM | Last Updated on Wed, Sep 18 2024 12:54 PM

-

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలులోని హర్షిణి జూనియర్‌ కాలేజీలో ఇంటర్మియెట్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని భావన ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. దీంతో బాలిక తల్లి, సోదరితో పాటు విద్యార్థిసంఘాల నేతలు సైతం విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తండ్రి లేకున్నా తన పిల్లలతో రెక్కల కష్టంతో చదివించానని తల్లి రోదించిన తీరు స్థానికులను సైతం కంటతడిపెట్టించింది.

ఆ చీర ఎక్కడిది..?
భావన ఉరేసుకున్న చీరపై అటు కళాశాల యాజమాన్యం, ఇటు బాలిక కుటుంబసభ్యులు చెరో మాట చెబుతున్నారు. సెలవులకు ఇంటికి వెళ్లిన భావన ఇంటి నుంచి వచ్చే సమయంలోనే చీర తెచ్చుకుందని కళాశాల యాజమాన్యం చెబుతుంది. ఇంటి నుంచి చీర తెచ్చుకోలేదని, అది ఎక్కడ నుంచి వచ్చిందో మాకు తెలియదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇందులో ఎవరి మాట నిజమో పోలీసులే చెప్పాలి. అయితే భావన ఇంటి నుంచి చీర తెచ్చుకొని ఉంటే కళాశాల సిబ్బంది ఎందుకు ప్రశ్నించలేదో, కళాశాలలోకి చీరను ఎందుకు అనుమతిచ్చారో తెలియాల్సి ఉంది. బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ బత్తుల పద్మావతి కూడా కాలేజీలోకి చీర ఎలా వచ్చిందో విచారణ చేయాలని ఆదేశించారు.

మొఖం చాటేసిన చైర్మన్‌
కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి కూడా టీడీపీ నాయకుడు, కళాశాల చైర్మన్‌ గోరంట్ల రవికుమార్‌ పత్తా లేకుండా పోయారు. ఆయనతో పాటుగా కళాశాల హెచ్‌ఆర్‌ సురేష్‌, కేర్‌ టేకర్‌ చాముండేశ్వరి కూడా కనిపించలేదు. కళాశాల ప్రిన్సిపాల్‌కు బదులుగా డీన్‌ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా వీరంతా కనిపించకుండా పోవడంపై మృతురాలి సోదరి ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం విద్యార్థిని కుటుంబ సభ్యులతో ఎందుకు మాట్లాడరని నిలదీశారు. పచ్చవ గ్రామానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థినులు భావనతో కలిసి చదువుకుంటున్నారని, కనీసం వారితో కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విచారణకు బాలల హక్కుల కమిషన్‌ ఆదేశం
భావన ఆత్మహత్య సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు బత్తుల పద్మావతి ఘటనా స్థలాన్ని సందర్శించి బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కళాశాలలోని విద్యార్థినులతో మాట్లాడారు. కళాశాల చైర్మన్‌ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల నిర్వాహణా లోపాలపై ప్రశ్నించారు. ఐదంతస్తుల భవన నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారని, జూనియర్‌ కళాశాలను నిర్వహిస్తున్నప్పుడు బాలల హక్కుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. 

ప్రతి అంతస్తులోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సి ఉండగా కనీసం ఒక్క అంతస్తులోనూ సీసీ కెమెరాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని, కనీసం భోజనాల దగ్గరైనా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకుండా నిర్లక్షం వహించారని మండిపడ్డారు. బాలిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు కళాశాల యూనిఫాం ధరించడం, ఉరి వేసుకున్న షెడ్డు పై కప్పు పెద్దగా ఎత్తులో లేకపోవడం, ఉరి వేసుకునేందుకు చీర ఎక్కడనుంచి వచ్చిందో తెలియాల్సి ఉందని సందేహాలను వ్యక్తం చేశారు. మూడు రోజుల్లోగా పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులకు ఆమె ఆదేశించారు. 

ఆమెతో పాటుగా ఆర్‌ఐఓ సైమన్‌, జిల్లా బాలల హక్కుల కమిటీ సభ్యురాలు నీలిమ, డిస్టిక్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ దినేష్‌ కుమార్‌, సామాజిక కార్యకర్త వీరాంజనేయులు ఉన్నారు. భావన ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయాలని, కళాశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ వినోద్‌, పీడీఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement