
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం కొనసాగుతోంది. ఇటీవలే బర్డ్ ఫ్లూ కారణంగా ఓ చిన్నారి చనిపోయింది. ఇక, తాజాగా తెలంగాణలో కూడా బర్డ్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు అధికార యంత్రాంగం నిర్ధారించింది. దీంతో, గ్రామంలో అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు.
వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకింది. రంగారెడ్డి జిల్లా పశువైద్య, పశు సంవర్థకశాఖ అధికారి డా.బాబు బేరి బర్డ్‌ఫ్లూ వెలుగు చేసిన ఫామ్ వద్ద సిబ్బందితో కలిసి కోళ్లను చంపి మట్టిలో పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. సదరు పౌల్ట్రీ సామర్థ్యం 36వేల కోళ్లు కాగా.. వేలాది ఇప్పటికే మృతి చెందాయి. ఇంకా, గురువారం 17,521 కోళ్లు ఉన్నట్లు గుర్తించారు.
బాటసింగారానికి కిలో మీటరు పరిధిలోని అన్ని పౌల్ట్రీల్లో కోళ్లను పూడ్చనున్నారు. పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటిల్లో నమూనాలు సేకరిస్తున్నారు. బబర్డ్ ఫ్లూ పాజిటివ్ కారణంగా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి.. ఎవరైనా బర్డ్‌ఫ్లూ లక్షణాలతో ఉంటే వారి వివరాలు సేకరిస్తున్నారు. అధికారులు వైద్య బృందంతో గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు.