
అక్షరాభ్యాసం చేయించిన చేతులతోనే అంతమొందించిన వైనం
పెద్దపల్లి రూరల్: ఉన్నత చదువులు చదివింది.. కన్నబిడ్డకు విద్యాబుద్ధులు ప్రాప్తించేలా చూడాలంటూ రెండ్రోజుల క్రితమే బాసరలోని సరస్వతీదేవి అమ్మవారి ఎదుట అక్షరాభ్యాసం చేయించింది.. ఇంతలో ఏమైందో ఏమో.. క్షణికావేశంలో కన్న కూతురినే కడతేర్చింది.. ఆపై తానూ ఉరివేసుకుంది. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..
పెద్దపల్లి ఎల్‌ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న లోక వేణుగోపాల్‌రెడ్డికి సాహితి (29)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె రితన్య (2) ఉంది. టీచర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో.. సాహితి కూతురు రితన్యకు ఉరివేసి చంపి, తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సాహితికి రాత్రి తల్లిదండ్రులు ఫోన్‌చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానించి ఇరుగు పొరుగు వారితో మాట్లాడి సమాచారం తెలుసుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంటెక్ చదివిన సాహితి ఎక్కువగా ఆలోచిస్తుండేదని, సన్నగా ఉన్నాననే వేదనతో ఉండేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ బాధ తాలూకు క్షణికావేశంలోనే సాహితి.. కూతురిని చంపి, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
అక్షరాభ్యాసం చేయించి..
రెండు రోజుల క్రితమే బాసరలో చిన్నారి రితన్యతో తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. వచ్చే విద్యాసంవత్సరంలో కరీంనగర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. సాహితి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. భర్త వేణుగోపాల్‌రెడ్డి మంచివాడేనని స్పష్టం చేసింది. తన చావుకు ఎవరూ బాధపడొద్దని, తాను లేకుండా బిడ్డ ఎలా ఉంటుందోననే వేదనతోనే.. వెంట తీసుకెళ్తున్నానని లేఖలో పేర్కొంది.