జూన్‌లో జాబ్‌ల జాతర  | Pending documents are also distributed by TREIRB: telangana | Sakshi
Sakshi News home page

జూన్‌లో జాబ్‌ల జాతర 

Apr 6 2024 3:54 AM | Updated on Apr 6 2024 12:18 PM

Pending documents are also distributed by TREIRB: telangana - Sakshi

ఈసారి అన్ని నియామకాలు టీఎస్‌పీఎస్సీ ద్వారానే... 

గ్రూప్‌–4తో పాటు, వివిధ కేటగిరీల్లో తుది ఎంపిక జాబితాలు 

అనంతరం ప్రత్యేక కార్యక్రమం ద్వారా నియామకపత్రాల అందజేత 

టీఆర్‌ఈఐఆర్‌బీ ద్వారా పెండింగ్‌లో ఉన్న పత్రాలు కూడా పంపిణీ 

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్‌ నెలలో అపాయింట్‌మెంట్, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు టీఎస్‌ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్‌ ఎన్నికల కోడ్‌ ముగియగానే జాబ్‌ల జాతరకు లైన్‌క్లియర్‌ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌(జీఆర్‌ఎల్‌)ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్‌ఎల్‌ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్‌ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్‌ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది.

హారిజాంటల్‌ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్‌ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్‌పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్‌ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్‌ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

ఆలోపు పార్లమెంట్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్‌పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్‌ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్‌ కోడ్‌ ముగియగానే జూన్‌ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇస్తారు. 

ఫిబ్రవరి నుంచే..
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్‌శాఖలో కానిస్టేబుల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్‌ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్, జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్‌ డైరెక్టర్‌ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది.

ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే...  టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ  పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement